పల్లె...యాంత్రికమైపోయే! --- ఎం వి స్వామి, 7893434721.

పల్లె...యాంత్రికమైపోయే! --- ఎం వి స్వామి, 7893434721.

పల్లె...యాంత్రికమైపోయే!
..................................

పెద్ద పామొకటి పడగవిప్పి
పిచ్చుకని కాటేసి...కాటేసి
కబళించి కాళేబరాన్ని
కక్కేసి వదిలేసినట్లు....!
ప్రపంచీకరణ ఆర్ధిక వ్యవస్థ
పచ్చని పల్లెను... పట్టి
కొట్టి పట్టుబట్టి పాడుచేసి
మూలాల మూల్గులను పీల్చి
పిప్పిచేసి మూలకు విసిరేసింది!
అచ్చట అక్కడక్కడా ఖచ్చితంగా...
ఆకుపచ్చని పొలాలూ కనిపించినా!
కర్షకుల గుండెల్లోని బీటలే
ఆ కళ్ళల్లో స్పష్టంగా అగుపిస్తాయి!
భూమి ఒకడిది...భుక్తి ఒకడిది
పట్టా ఒకడిది...ఫలసాయం ఒకడిది!
ఋణాలు వ్రణాలై....
సలుపు పెడుతున్నా చేతిలోచరవాణి!
ఫాల్స్ ప్రేస్టేజీ ఉచ్చులో...
ఇంట్లో ఈగల మోత....
వీధిలో మోటారు బండి కూత!
చేతివృత్తులు చేయుట నామోసీ!!!
యంత్రాల మీటలు నొక్కించే...
యాంత్రిక మాంత్రికుల మాయాజాలం
అడుగడుగునా కనిపిస్తాయి!
ఆత్మీయత...అనురాగం
ఆ అరుగుల్ని వదిలేసి ఎప్పుడో...
రాజకీయ 'శకునిజం' విసిరిన వలలో
కుళ్ళి కుట్రలఒడిలో పడిపోయాయి!
సంప్రదాయాలు...కట్టుబాట్లు
కళ్ళబొల్లి కబుర్లట...!
మిడిమిడి జ్ఞాన యువత పెడదారి
మేథావి నవత విదేశీదారి!
కాసుల వేట బాటలో పల్లే వేట
వేటగాళ్ళు నడిమంత్రపు కుబేరులు!
పంటభూమి ఫ్లాట్స్ గా మారిపోయి
కళ తప్పిన కన్యలా ఉంది!
పల్లె దారులన్నీ పట్టణాలకు...
రియల్టర్ల పేరాశలన్నీ పల్లెల వైపు!
ప్రకృతి అసంకల్పితంగానే...
వికృతి అవ్వక తప్పటలేదు!
పేరుకే పల్లె...ఒక చక్కని మల్లి!
తెరిచి చూస్తే... ఆర్ధిక డొల్లల తల్లి
స్వార్ధ సునకాల మధ్య ఓ పిల్లి!

............................................
--- ఎం వి స్వామి, 7893434721.

0/Post a Comment/Comments