ప్రేమలు పెళ్ళిళ్ళు
యుక్త వయసులో
ఆడ మగ పరస్పర ఆకర్షణతో
ప్రేమలు చిగురిస్తాయి
అది కేవలం ఆకర్షణా
అందులో నిజమెంత
ఏమైనా దురుద్దేశ్యం
అందులో దాగి ఉందా
తేలిసేదెలా
మన సమాజం
ఎత్తు పల్లాల భూమాత వంటిది
దేని గుణం దానిది
శిఖరంపై నీటి బిందువు నిలవదు
పల్లం తనలో చేరిన నీటి బిందువును
వదలించుకోజాలదు
అలాగే ఓ పెట్టి పుట్టినోడు
కూటికోసం కోటి పాట్లు పడే
ఓ సాధారణ మనిషికి
మధ్య ఎంత తారతమ్యం
అది అనాదిగా వస్తున్నదే!
అయితే ప్రేమకు ఇవేవి పట్టని నైజం ఎండమావులు మనల్ని మోసంచేసినట్లు అదీ మోసం చేయగలదు
ఎక్స్ రే మాత్రమే
మన శరీరంలో లోపాలను పసిగట్టగలదు సాధారణ కళ్ళకు అది సాధ్యం కాదు
అక్బర్ ఓ మహారాజు
ఉన్నంతలో నీతి నిజాయతీ కలవాడే
సలీం మొగల్ సామ్రాజ్యానికి
ఏకైక వారసుడు
ఎక్కడో అనార్కలిని చూడటం
ప్రేమలో పడటం
తానొక సిపాయినని
ఓ తీయని అబద్దం ఆడటం
అనార్కలి అమాయకంగా నమ్మి
ప్రేమించడం
ఓ సందర్భంలో సలీం ప్రాణదాతగా
అక్బర్ ఏమైనా కోరుకోమనగా
ఏమి కాంక్షించక అక్బర్ చేతిలో ఉన్న
దానిమ్మ పూవును కోరుకుంటుంది
అక్బర్ ఆశ్చర్య పడతాడు
ఆమెకు అనార్కలి అని పేరు పెడతాడు
అలా అనార్కలి ఓ పేదింటి మాణిక్యం అనిపించుకుంటుంది
చివరకు కోటలో కుట్రలకు బలి అవుతుంది
సలీం అనార్కలికి బాసటగా నిలచినా
అక్బర్ సామ్రాజ్య దర్పం
సమాజంలో అసమానతల ఆగాధం
అనార్కలి అంటే ఏమిటో తెలిసికూడ
పెళ్ళికి కాదంటాడు ఆ మొగల్ చక్రవర్తి
చివరకు చిగురించవలసిన ప్రేమ
సజీవ సమాధి అవ్వటం
విఫల ప్రేమకు ప్రతీక చరిత్రలో
దేవదాసు పార్వతీల ప్రేమ
లైలా మజ్నుల ప్రేమ
అంతెందుకు శకుంతల దుష్యంతుని ప్రేమ
ఏదో ఆకాశవాణి అద్భుతం వల్ల
కథ సుఖాంతమయ్యింది గానీ
లేకుంటే శకుంతల పని ఏమయ్యేది
మనకు ఏ ఆకాశవాణి సాక్ష్య చెబుతుంది
ఆలోచించండి అమ్మాయిలూ
ఎన్ని విఫల ప్రేమలు చరిత్ర కెక్కక
ధన వంతుల విలాస వంత మైన కారుక్రింద
నలిగి పోయాయో లెక్కించ తరమా
అవసరమైతే అమ్మాయి నడవడిక పై
ఓ అందమైన కథ అల్లి
అబ్బాయే అసహ్యించుకొనేలా
చేయగల సమర్థులున్న సమాజం మనది
అందుకే ఏది నిజమైన ప్రేమో ఏది కాదో
తెలుసుకునేంత వివక్ష కలిగి
తల్లి దండ్రుల సమ్మతితో
సాగే ప్రేమలు ఎప్పుడూ
హర్షించ తగినవే
ప్రేమకు కామానికి
ఆడ్డుగోడ ఒకటి ఉండాలి
అది అరటి ఆకువంటిదైతే
మీ గోటితో కూడ చిరిగి పోగలదు
మనసే ఓ ఇనుప గోడగా
ఆంక్షల హద్దుల్లో సాగే ప్రేమ
అందమైన ప్రేమే సుమా!
అది పెళ్ళితో సుఖాంతం కావాలి
ఆపై కడవరకూ సాగాలి
అందమైన సంసార బంధమై
--- డా విడి రాజగోపాల్,
9505690690.