నా రేడియో కథ ----డా.. కందేపి రాణీప్రసాద్

నా రేడియో కథ ----డా.. కందేపి రాణీప్రసాద్

నా రేడియో కథ
        డా.. కందేపి రాణీప్రసాద్

నా అక్షరాభ్యాసం అయిన తర్వాత మా నాన్న నన్ను స్కూలుకు పంపలేదు. ట్యూషన్ మాస్టార్నే ఇంటికి పిలిపించారు. ఐదు తరగతులన్నీ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి 6వ తరగతికి హైస్కూల్లో చేరాను. కాబట్టి నేను స్కూలుకు పోవడం ఇదే మొదలు. నాకు కొత్తగా భయంగా ఉంది. హైస్కూలుకు వెళ్ళిన రోజే టైం టేబుల్ చెప్పారు నోట్ చేసుకోమని. ఉదయం పూట నాలుగు పిరియడ్లు, మధ్యహ్నం పూట మూడు పిరియడ్లు ఉండేవి. టైం టేబీల్లోని పిరియడ్లలో ఏయే సబ్జెక్టులుంటే ఆయా పాఠ్య పుస్తకాలు తెచ్చుకోవాలని సూచించారు. మొదటి రెండు రోజులు కొత్తగా కొనుకున్న టెక్స్ట్ పుస్తకాలకు అట్టలు వేసి నేమ్ స్లిప్ లు అతికించుకొని ఫెళ ఫెళ లాడే పుస్తకాలతో స్కూలుకు వెళ్లాము. అప్పుడే మా ముందున్న వాళ్ళు ఫలానా మాస్టారు మంచివాడని, ఫలానా మాస్టారు తొడపాశం పెడతాడని, ఇంకో మాస్టారు చేయి వెనక్కి తిప్పి రూళ్ళ కర్రతో కొడతాడని ఎన్నో సంగతులు చెప్పారు. ఏదో హైస్కూలు చదువంటే చాలా గొప్పని ఫీలవుతుంటే ఈ కొట్టటమేంటి అని లోపల్లోపల భయపడుతూనే రెండు మూడు రోజులు విజయవంతంగా ముగించాను. ఆ తర్వాతి రోజు ఉదయం టైం టేబుల్ చూసి పుస్తకాలు సర్దుకుందామనుకునే సరికి పెద్ద ఆశ్చర్యం. నా మొదటి, రెండవ పిరియడ్లు ఇంగ్లీషు, తెలుగు అని ఉన్నాయి. అది బాగానే ఉన్నది. మూడవ పీరియాడే కోరుకుడు పడలేదు. అక్కడ 'రేడియో' అని ఉన్నది. ఏం చేయాలో తెలియలేదు. సమయానికి మా నాన్న ఇంట్లో లేరు. మా అమ్మేమో తనకు తెలియదన్నది. పక్కింట్లో ఉన్న నా స్నేహితురాలిని అడిగితే తనూ పెదవి విరిచింది. ఏది ఏమైనా టైం టేబుల్ లో రాసుంటే ఆ పుస్తకాలు స్కూలుకు తీసుకెళ్ళాలి అని చెప్పారు. కాబట్టి ఇక్కడ రేడియో అని ఉంది కదా రేడియోని తీసుకెళ్ళాలి అని డిసైడ్ అయ్యాం. నా స్నేహితురాలు మా ఇంట్లో రేడియో లేదు అన్నది. సరే నేను తెస్తానుగా అని నేను రేడియో తెచ్చాను. ఇద్దరం కలసి రేడియో మోడుకొని స్కూలుకు వెళ్లాము. మా క్లాసురూం లోకి  వెళ్ళాలంటే హెడ్మాస్టర్ గారి రూము దాటి వెళ్ళాలి. మా చేతిలో బరువుగా బలవంతంగా మోస్తున్న రేడియోను చూసి మమ్మల్ని పిలిచారు. లాంగ్ నోట్ బుక్ సైజులో బరువుగా ఉన్న రేడియోను చూసి 'ఇదేంటి రేడియోను స్కూలుకు తెచ్చారు' అని అడిగారు. మేం టైం టేబుల్ లో రాసున్న విషయం చెప్పగానే ఆయన పడీ పడీ నవ్వారు. 'టైం టేబుల్ లో రేడియో అని ఉంటే రేడియో తేనవసరం లేదు. మేమే ఇక్కడ రేడియో పెట్టి కార్యక్రమాలు వినిపిస్తాం' అని చెప్పారు. 'ఇంకెప్పుడూ రేడియోలు స్కూలుకు తేకండి' అని వార్నింగిచ్చి పంపేశారు.

బాలానందం అనే కార్యక్రంలో రేడియో అక్కయ్య, రేడియో అన్నయ్యాలో పిల్లల చేత పాటలు పాడించేవారు. రేడియోలో వచ్చే ఈ ప్రోగ్రాములన్నీ పిల్లలందరికి ఆ పీరియడ్ లో వినిపించేవారు. ఇదీ స్కూల్లో నా రేడియో కథ. ఇంకా క్రాఫ్ట్ పీరియడ్ లో నవారునేయించేవారు. సంగీతం పీరియడ్ లో పాటలు పాడించేవారు. మా టీచరు వ్రాయించిన నోట్సు నా దగ్గర ఇప్పటికీ ఉంది. ఆమె పాడించిన 'కోడిబాయే లచ్చమ్మదీ కోడీ పుంజు బాయే లచ్చమ్మదీ" పాట ఇంకా వింటున్నట్లే ఉంటుంది. 'కుట్టు'కొ పీరియడ్ ఉండేది. ఆ పీరియడ్ లో కుట్లు, అల్లికలు నేర్పేవారు. ఇలా స్కూళ్ళలో అన్నింటిపైన అవగాహన కల్పించేవారు ఆరోజుల్లో. ఇప్పటి పిల్లలకు చదువులు, మార్కులు తప్ప వేరే ఏవీ తెలియవు. కలల పట్ల అవగాహన ఉంటే ఆ తెలివి తేటలు చదువులో ముందుకు పోవడానికి ఉపయోగపడతాయి.

ఈ మధ్యనే నేను చదివిన జిల్లా పరిషత్ హైస్కూలు ఇంకొల్లు విద్యార్థులంతా కలుసుకున్నాం. మేము పదవ తరగతి పరీక్షలు వ్రాసి 30 సంవత్సరాలు అయిన సందర్బంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నాం. ఆ రోజున నా రేడియో లాంటి జ్ఞాపకాలు అందరూ స్టేజీపై చెబుతుంటే ఒకటే నవ్వులు. అప్పుడు మాకు పాఠాలు చెప్పిన మాస్టార్లనీ పిలిచాము. వారిని సగౌరవంగా సన్మానించుకున్నాం. అందరం ఒకరికొకరం పాత సంగతులు కలబోసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్కరు ఏం చేస్తున్నారో చెప్పుకున్నాం. అప్పటి మా హెడ్మాస్టరు గారు మరణించారు. ఆయన విగ్రహాన్ని తయారు చేయించి మా హైస్కూలు ఆవరణలో ప్రతిష్టింప చేశాము. ఊరిలో ఉన్న ప్రముఖులందరిని పిలిచి కార్యక్రమం బాగా జరగటానికి కారణం మా క్లాసులోని అబ్బాయిలే. ఆ రోజుల్లో మేం చదివేటపుడు మా క్లాసులో అమ్మాయిలు ఐదుగురే. మిగతా వారంతా అబ్బాయిలే. కాబట్టి ఈ కార్యక్రమ క్రెడిటంతా వాళ్ళదే. మొన్నటి సమావేశానికి ఆ ఐదుగురు అమ్మాయిలలో ఇద్దరమే హాజరయ్యాం. నేనూ, నాతోపాటు రేడియోని తీసుకెళ్ళిన నా స్నేహితురాలు, ప్రస్తుతం పై కథలోని నా స్నేహితురాలు నా అదపడుచై నా మీద అర్థ మొగుడి హోదాలో పెత్తనం చెలాయిస్తోంది. ఏం చేయను!

0/Post a Comment/Comments