నలుపందం(వచన కవిత) --- డా. రామక కృష్ణమూర్తి,

నలుపందం(వచన కవిత) --- డా. రామక కృష్ణమూర్తి,

నలుపందం(వచన కవిత)
--- డా. రామక కృష్ణమూర్తి,
హైదరాబాద్.

అందం శరీరానికా?మనసుకా?
నశించేది శరీరం,కాదు మానసం
నలుపైతేనేమి?తెలుపైతేనేమి?
వర్ణానిదేముంది?నైర్మల్యమే శాశ్వతం
గుణమే రాజద్వారం
కారుమబ్బు నలుపు
కానీ వర్షిస్తుంది
నల్లనివాడు కృష్ణుడు
అభయమిస్తాడు
కాటుక‌ నలుపు
కానీ అందాన్ని తీర్చిదిద్దుతుంది
కురులు నలుపు
కానీ అందాన్నిస్తాయి
కంటిపాప నలుపు
కాని కాంతినిస్తుంది
కనుబొమలు‌ నలుపు
తీర్చిదిద్దినట్టుండి,కట్టిపడేస్తాయి
బుగ్గన చుక్క నలుపు
దిష్టి తొలగిస్తుంది
పుట్టుమచ్చ నలుపు
గుర్తింపే తానై నిలచిపోతుంది
నలుపు కోసం తపించి 
ఆరాటపడే వారెందరో
అందానికి నల్లదనం అడ్డుకాదు
నలుపు కార్లు స్టేటస్
నలుపు ఫోన్లు డిమాండ్
నల్లపూసలు సౌభాగ్యానికి చిరునామా
నల్లనిదారాలు అలంకారాలు
చీకటి నలుపు సేదదీరుస్తుంది
బొగ్గు నలుపు సంపద సృష్టిస్తుంది
నల్లకలువ ప్రకృతికే సోయగం
నల్లంచు తెల్లచీర‌ తీర్చిదిద్దినట్లుంటాయి
నిరసన తెలపడానికి నలుపు
చల్లదనానికి నలుపు
నల్లబల్ల నలుపు జ్ఞానానిస్తుంది
నల్లని చెప్పులు కాళ్ళకు అందాన్నిస్తాయి
నలుపే పాపాయికి శ్రీరామ రక్ష
నలుపే నవ్యతకు శ్రీకారం
నలుపే ఆవిష్కరణకు ఆకారం
నలుపే రంగులలో కాంతివంతం
నలుపే రేపటికి ఆముఖం
కారుచీకట్లు సమస్యలకు‌ పరిష్కారం
దిష్టిపూసలు,నల్లని మొలత్రాడు
అమ్మచేతి ఆశీర్వాదాలు
కోకిల నలుపు శ్రావ్యతకు మారుపేరు
కాకి నలుపు పితృదేవతల పేరు
పొగ నలుపు,పోక నలుపు
బ్లాక్ block చేస్తుంది
నలుపు నవ్విస్తుంది
నలుపు కవ్విస్తుంది 
నలుపు వెక్కిరిస్తుంది
నలుపు మురిపిస్తుంది
నలుపు బొట్టై
నలుపు గ్రహణమై
నలుపు మీసాలై మెలివేస్తుంది
నలుపు నాటక రంగమై‌
పాత్రల ఔచిత్యాన్ని పట్టిస్తుంది
తెరలపై అలముకొని
మనసుపై కప్పబడి
కష్మలాన్ని‌ కాల్చి
కన్నీటిని తుడిచి
కరవాలమై తెంచి
తొలగించుటకు వీలై
ఉషోదయాన మాయమై
త్యాగమై,ధర్మమై
చిరంజీవమవుతుంది.



0/Post a Comment/Comments