రామాయణ విశిష్టత ---- శ్రీమతి ఇడుకుల్ల గాయత్రి

రామాయణ విశిష్టత ---- శ్రీమతి ఇడుకుల్ల గాయత్రి

రామాయణ విశిష్టత

జై శ్రీరామ్

రామాయణం గురించి నా మాటల్లో చెప్పడానికి నేను గొప్ప సాహసమే చేస్తున్నాను, అనుకోండి. రామాయణం ఆ పేరు విన్న, ఆ కథ విన్న, మన జన్మ పరిపూర్ణం అవుతుంది. ఎందుకు అంటే త్రేతాయుగంలో  జరిగిన రామ పరిపాలన విధానాన్ని ఇప్పటికీ మనం తలుచుకుంటూ ఉన్నాం. ఎన్ని యుగాలు మారినా కూడా ఆ యొక్క ధర్మసంస్థాపన వృత్తాంతాన్ని మనము కథలుగా చెప్పుకుంటూ ఉన్నాము. అంత గొప్ప రామాయణం విశిష్టతని చెప్పాలని, నేను ఒక సాహసమే చేస్తున్నాను. నాకున్న పరిజ్ఞానం తో వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను.


మనిషి ధర్మాన్ని ఎలా అనుష్టానం చేయాలి అన్నది, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అన్న విషయాన్ని, ఎలా మనిషి పరిపూర్ణుడు అవ్వాలి, ఎలా మనిషి ప్రవర్తనను మార్చుకోవాలి, ఇలాంటి ఒక గొప్ప విషయాన్ని మనం రామాయణం చదవడం ద్వారా నేర్చుకుంటాము. వినడం ద్వారా నేర్చుకుంటాం.


ఆనాడు దశకంఠుడైన రావణుడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసి ప్రసన్నం చేసుకుంటాడు. బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు నీకు ఏమి కావాలి అని అడుగుతాడు... అప్పుడు10 తలలు ఉన్న రావణాసురుడు కూడా, అందరూ కోరుకున్నట్టు సహజమైన కోరిక కోరుకుంటారు. ఎవరికైనా ఈ దేహం మీద తీపి ఎక్కువ కదా మరి..


"ఈ దేహానికి మరణం ఉండకూడదు" అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ ఇలాంటి వరం ఇవ్వడం కుదరదు, అని అన్నాడు. ఇంకేదైనా కోరుకో అని అన్నాడు. అప్పుడు రావణాసురుడు" కొంత మంది చేతిలో నాకు మరణం ఉండకుండా వరం ఇవ్వమని అడిగాడు. అప్పుడు బ్రహ్మ !సరే "ఎంతమంది చేతిలో నీకు మరణం ఉండకూడదు" చెప్పు అని అడిగాడు. 


అప్పుడు ప్రతి యుగంలో ఏదైతే జరుగుతుందో అదేవిధంగా రావణాసురుడు కూడా "దేవతలు కిన్నెరులు కింపురుషులు.... ఇలా  ఎవరి చేతిలో కూడా నేను మరణించ కూడదు." అని అన్నాడు .కానీ తృణీకార భావంతో మనుషులను వదిలేశాడు. ఎందుకంటే ఇంతమంది నన్ను ఏమీ చేయలేనప్పుడు, మనిషి ఏం చేస్తాడులే.. అనుకొని, అసలు మనిషిని కోరుకోవడం ఎందుకులే అనుకున్నాడు. అసలు మనిషి అంటే అంత చులకన భావం రావణాసురుడికి... మరి ఈ చులకన భావాన్ని పోగొట్టడానికి వచ్చినటువంటి అవతారం రామావతారం..


రామావతార లక్ష్యం రావణాసురుడి సంహారం. ఆ లక్ష్యం నెరవేరింది .ఎంతకాలమైనా అది మన గుండెల్లో నిలిచిపోయింది.. రామాయణ విశిష్టత ని మనం ఎందుకు ప్రస్తావించుకోవాలి అంటే ,ఎంత కాలం అయితే రామాయణమే భూమిపై ఉంటుందో, అంతకాలం మనిషిలో మానవత్వం ఉంటుంది...


విశ్వనాథ సత్యనారాయణ గారు  చెప్పినట్టు ఈ దేహానికి అన్నం ఎంత అవసరమో, మనిషి  మానవత్వం తో బ్రతకడానికి రామాయణం అంత అవసరం. అందుకే రామాయణం వినాలి. రామాయణం చదవాలి .రాముని ఆదర్శంగా మనం గుర్తుపెట్టుకోవాలి. రాముడు యొక్క గుణాలను, రాముడు యొక్క వ్యక్తిత్వాన్ని ,రాముడు యొక్క శీలాన్ని, ఎంత కాలము మానవులు గుర్తు పెట్టుకుంటారో, అంతకాలం మానవత్వం బ్రతికే ఉంటుంది. మానవత్వం బ్రతికి లేనప్పుడు, వాడు మనిషిగా బ్రతికినా కూడా వృధా. ఎప్పుడైతే మనిషిలో మానవత్వం నశిస్తుందో, సమాజంలో అభద్రతాభావం మొదలవుతుంది. సమాజంలో జరిగే ఎన్నో దారుణాలకు మానవత్వం లేకపోవడమే కారణమవుతుంది. అందుకనే రాముని యొక్క దివ్య గుణాలని కీర్తిస్తూ ఉండాలి. ఆ యొక్క అవతార  విశిష్టత స్మరించాలి.


రామాయణ కథ ని తెలుసుకునే కన్నా ముందు, మనము చరిత్రకు సంబంధించిన ఏ కథలను చదివినా.. కూడా  అక్కడ చాలా సంవత్సరాల  పాటు సాధన చేసిన ఎంతోమంది, కోరుకునే విచిత్రమైన కోరిక ఏమిటంటే, మాకు మరణం ఉండకూడదు... అన్నప్పుడు... బ్రహ్మదేవుడు అది కుదరదు... ఇంకా ఏదైనా కోరుకోండి అని చెప్పడం... అప్పుడు వాళ్ళు ఒక పెద్ద లిస్టు చదివి ఫలానా ఫలానా వారి చేతుల్లో నేను చావకూడదు అని చెప్పడం..., దానికి బ్రహ్మదేవుడు సరే అని ఒప్పుకోవడం, ఆ తరువాత ఆ కోరుకున్నవారు గర్వంతో వెళ్లి అందరిని హింసించడం, చివరిగా మరణించడం. ఇది ప్రతీ కథలోనూ మనం గమనిస్తూ ఉంటాం...


వారు కోరుకునే  ఇటువంటి కోరికల వలననే మనకి, అవతారాలు ఏర్పడడం మనం గమనిస్తూ ఉంటాం. ప్రతి అవతారానికి కూడా ఒక లక్ష్యం అనేది ఉండడం సహజం. ప్రతి కథలో కూడా  దేవతలు కానీ, భూదేవి కానీ, స్థితికారకుడైన విష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకోవడం, విష్ణుమూర్తి అవతరించి ,ఆ రాక్షసులను సంహరించడం, ఇది మామూలుగా ప్రతి కథలో మనం గమనిస్తూ ఉంటాం.  కానీ రామ జననం ఇందుకు భిన్నమైనది... ఎవరో వచ్చి ప్రార్థించడం వల్ల, ఈ జననం జరగలేదు. దేవతలు కానీ భూదేవి గాని... వచ్చి విష్ణుమూర్తిని ప్రార్థన చేయలేదు. దశరథ మహారాజుకి కుమారుడు కావాలని కోరిక కలగడం వలన జరిగిన అశ్వమేధ యాగం వలన, రామ జననం జరిగింది....


ఆ యాగానికి వచ్చిన వారందరూ  కూడా రావణాసురుడు పెట్టినటువంటి బాధలన్నీ ఈ విధంగా తలుచుకుంటూ ఉన్నారు... అప్పుడు వాయుదేవుడు నన్ను గట్టిగా వీచ నివ్వడం లేదండి అన్నాడు, అప్పుడు సూర్యుడు నన్ను ప్రకాశించనివ్వడం లేదని అన్నారు.. అప్పుడు  నీరు అన్నది నన్ను ఇంత కన్నా ప్రవహించ కూడదు అంటున్నాడు.. ఇలా ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు... ఇంతలో అక్కడికి చేరుకున్న బ్రహ్మ గారిని చూసి ...అందరూ నమస్కరించి... మీరు రావణాసురుడికి ఇచ్చిన వరాల వల్ల మమ్మల్ని అందరినీ బాధపెడుతున్నాడు అని మొరపెట్టుకోగా.... బ్రహ్మదేవుడు "ఆ మహావిష్ణువు మీ బాధలన్నీ తీర్చడానికి మళ్లీ అవతరిస్తాడు. శ్రీ మహావిష్ణువు, బ్రహ్మాండమంతా నిండి ఉన్న ఆ శ్రీ మహా విష్ణువు మీ బాధలు తొలగించడానికి నేను వస్తాను అని చెప్పాడు. రాక్షసుడు అయినటువంటి రావణాసురుడిని సంహరిస్తాను తరువాత పదకొండు వేల సంవత్సరాలు ఈ భూభారాన్ని వహిస్తాను అని తెలిపాడు" అని వివరిస్తాడు.


ఎందుకు 11 వేల సంవత్సరాలు పరిపాలిస్తాను అని చెప్పాడు అంటే, ఆ కాలంలో అప్పటికే రావణాసురుడి పరిపాలన లో మనుషులు ఎన్నో కష్టాలు పడ్డారు. మనుషుల బ్రతకడం మరిచిపోయారు. అందుకే మళ్లీ మనిషి యొక్క ఔన్నత్యాన్ని తెలపడం కోసం ,పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించి ...ధర్మ సంస్థాపన చేస్తాను. తిరిగి మనుషులు మనుషులుగా బ్రతికేలా చేస్తాను... అని వరమిచ్చి...."అందుకే నేను భూలోకంలో మనిషి రూపంలో జన్మించిన పోతున్నాను... దశరథ మహారాజు యొక్క కుమారుడిగా జన్మను స్వీకరించ పోతున్నాను అని "తనంతట తానుగా తెలిపాడు.... నేనే నలుగురి రూపంలో వస్తున్నాను. రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు రూపాలలో జన్మించ పోతున్నాను. నేను దశరథ మహారాజుని తండ్రిగా వరించి వస్తున్నాను అని చెప్పాడు .


రామాయణంలో రాముని పాత్ర చూసి మనం తెలుసుకోవలసింది చాలా ఉంది. మనకి రాముడు చెప్పినటువంటి మొట్ట మొదటి పాఠం జీవితంలో ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం... తను వృద్ధిలోకి వస్తే గర్వ పడతాడు. అదే తన తండ్రి తనకన్నా తక్కువ స్థాయి ఉద్యోగం చేస్తుంటే చెప్పుకోవడానికి సిగ్గు పడతాడు. ఏ విధంగా అయితే బురదలో నుంచి తామర పువ్వు పడుతుందో అది బురదలోనే ఎలా బ్రతుకుతుందో... అది తన స్థానాన్ని గర్వకారణంగా భావిస్తోంది... ఈ దేశంలో తండ్రి గురించి చెప్పుకోడానికి, తల్లి గురించి చెప్పుకోవడానికి, ఆడపడుచుల గురించి చెప్పుకోవడానికి, అత్తగారి గురించి చెప్పుకోవడానికి... ఇలా అన్నింటి గురించి చెప్పుకోవడానికి సిగ్గు పడే వారు ఎందరో ఉన్నారు. కానీ రామాయణం చదవడం ద్వారా, వినడం ద్వారా, ఆ సిగ్గు పోతుంది. తను మనిషిగా పుట్టినందుకు పదిమందిలో ఎలా తన గురించి తానే చెప్పుకోవాలి అర్థమవుతుంది. అందుకనే తన తండ్రిగారి పేరు పైన దాశరథీ కరుణాపయోనిధీ అనగానే రాముడికి అంత ఆనందం కలుగుతుంది. ఎందుకు అంత ఆనందం కలుగుతుంది, అంటే ఇక్కడ మనిషి గుర్తుపెట్టుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏమిటంటే తన తండ్రిని ఎలా గౌరవించాలి అన్న విషయం.


రామాయణానికి ఎందుకు అంత గొప్ప విశిష్టత  అయనము అంటే కదలిక రామాయణం అంటే రాముని యొక్క కదలికలు రాముడు కదలికలో ఒక గొప్ప తనం దాగి ఉంది .మానవమాత్రులమైన మన కదలికల వంటిది కాదు. రామ కదలికల లో చాలా విశిష్టత ఉంది. రాముడు వేసే అడుగులలో ఒకటి సత్యమైతే, మరొకటి ధర్మము. సత్య ధర్మాలని రెండు పాదాలుగా చేసుకొని  నడిచాడు రాముడు. అందుకే మనిషి ఎలా నడుచుకోవాలో తెలిపేదే రాముడి జీవితం యొక్క సందేశం


ఈ ప్రపంచంలో తండ్రి, తల్లి, కుమారులు, అన్నదమ్ములు భార్య, సేవకుడు, ఆదర్శవంతంగా ఎలా ఉండాలో సవివరంగా తెలిపిన మహా కావ్యము రామాయణము. రామాయణములోని పాత్రలే మనకు ఆదర్శములు అనడంలో అతిశయోక్తి కాదు. రామాయణములో రాముడు ధర్మాన్ని తాను అనుసరించి, ఆచరించి, ధర్మమార్గంలో తాను నడిచి దారిని మనకు చూపించారు. అదే రామాయణం యొక్క గొప్పతనం. రామాయణము కూడా ఒక కథమాదిరి నడుస్తుంది. కాని అందులో ఉన్న రాముడు, లక్ష్మణుడు భరతుడు, సీత, హనుమంతుడు మొదలగు పాత్రలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు.రామాయణము హిందూ మతము లో కాదు, బౌద్ధ, జైన మతములలో కూడా ప్రచారంలో ఉంది.  రామాయణ మహాకావ్యము.దేశవిదేశాల్లో గొప్ప కావ్యంగా కొనియాడబడింది. కాని అన్నింటి లోకల్లా వాల్మీకి రామాయణం ప్రాచీన మయింది అనడంలో ఎలాంటి సందేహము లేదు. 


రచన
మీ
శ్రీమతి  ఇడుకుల్ల గాయత్రి

0/Post a Comment/Comments