వజ్రాయుధం
డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్.
నిరసన తెలపడానికి ఋజుమార్గం
కదలిక తేవడానికి ధర్మసూత్రం
ప్రాణాన్ని ఇచ్చే ఆహారాన్ని,నీటిని
తీసుకోకుండా చేసే సత్యాగ్రహం
నిరాహారమే నిరసనకు ఆయుధం
ఉపవాసమే ఉద్యమానికి ఊతం
నిస్సత్తువ ఆవహించినా,శక్తి సన్నగిల్లినా
లక్ష్యమే ఆహారంగా,సాధనే కర్తవ్యంగా
నేటికీ ఆచరింపబడుతున్న గాంధీమార్గం
పాలకులపై ఎక్కుపెట్టే పాశుపతాస్త్రం
ఇంద్రియనిగ్రహంతో చేసే యోగం
ప్రాయశ్చిత్తం, పరివర్తనలు ఆకాక్షించే వ్రతం
మార్పుకోసం,మనుగడ కోసం సల్పే దీక్ష
అహింసామార్గంలోని అజేయ యుద్ధం
తాను తపిస్తూ,శరీరాన్ని తపింపజేస్తూ
ఎదుటివారిలోని మానవతకు పెట్టే పరీక్ష
ఓర్పు,సహనాలతో స్వీయశిక్ష ననుభవిస్తూ
శాంతి,సౌజన్యాలతో ప్రకటిత నిరసనను తెలియజేస్తూ
నాటి నుండి నేటి వరకు ప్రజలకోసం,పరిష్కారాలకోసం
మార్పుకోసం చేసిన,చేస్తున్న
మహాయజ్ఞం
వ్యష్ఠిగానైనా,సమష్ఠిగానైనా
చేసే ఐక్యపోరాటం
సహనశక్తే విజయాలకు మూలం
అది ఉపవాసదీక్ష అందించే
సందేశం.