పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు
చెమటోడ్చి
చెమటోడ్చి ఓ వృద్దుడు
ఓ చెట్టును పెంచాడు
అది "చిగురిస్తున్నప్పుడు"
చిరునవ్వు నవ్వాడు
పూలు "పూస్తున్నప్పుడు"
పులకించి పోయాడు
"కాయలు కాసినప్పుడు"
కడుపు నింపుకున్నాడు
ఎర్రని ఎండలో
చల్లనిచెట్టు నీడన
ఇంత సేద తీర్చుకున్నాడు
ఐతే "ఆకురాలేప్పుడు"
అసహ్యించుకున్నాడు
నీడ కరువైందని నిట్టూర్చాడు
నీడనివ్వనిచెట్టు నిరుపయోగమంటూ
పదునైన గొడ్డలి పైకిలేపాడు
నవ్వుతూ నవ్వుతూ చెట్టును నరికేశాడు
పెళపెళమని చెట్టువిరిగే వేళ నేలకొరిగే వేళ
కిలకిలమని నవ్వాడు కేరింతలు కొట్టాడు
సంతకెళ్ళి చెట్టునమ్మి కొంత
సొమ్ము చేసుకున్నాడు ఇంటి ముఖంపట్టాడు
ఇంతలో...వింతగా హోరుమని
"ఈదురు గాలి" వీచింది
జోరుగా "కుంభవర్షం" కురిసింది
ప్రక్కనున్న నక్కవాగు ఒక్కసారిగా పొంగింది
ఆ ఆకస్మికవరదకు తాను కొట్టుకుపోతూ
రాత్రంతా మృత్యువుతో పోరాడి పోరాడి
"కొనఊపిరితో బ్రతికేడు ఓ కొమ్మ పుణ్యమాని"
"మృత్యుంజయుడైన" ఆ వృద్దుడు
"చెట్టుకు" చేతులెత్తి నమస్కరించి చెమర్చిన కళ్ళతో
ఇది "కొమ్మ కాదు మా అమ్మంటూ"
ఇది "వృక్షం కాదు మా ప్రత్యక్ష దైవమంటూ"
"పచ్చని చెట్లే జగతికి ప్రగతికి మెట్లంటూ"
దీక్షబూని లక్షమొక్కలతో "హరితవనం" సృష్టించేడు
ప్రాణవాయువుకే ప్రాణంపోసి "ప్రాణదాతగా" మిగిలేడు
రండి రండి ! మనం సైతం
పర్యావరణ పరిరక్షణకై "పది లక్షలమొక్కలు" నాటుదాం!
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502