నా ఆరు తరాలు వెతికాను
గతమెంతో వెతికాను... గతుకుల రాళ్లే గుర్తొస్తున్నాయి.
బతుకంతా వెతికాను
మెతుకుల నీళ్లే గుర్తొస్తున్నాయి.
నా ఆరు తరాలు వెతికాను
స్పర్శించిన కరము లేదు.
హర్షించిన గళము లేదు.
స్పందించిన స్వరము లేదు.
అందించిన వరము లేదు.
*నా ఆరు తరాలు వెతికాను*
ఉఛ్వాశాలు తప్ప.. ఊహలు లేవు.
ఉద్వేగాలు తప్ప.. ఊసులు లేవు.
చేతులు తప్ప..రాతలు లేవు.
బాధలు తప్ప.. బతుకులు లేవు.
*నా ఆరు తరాలు వెతికాను*
ఆకలికి అల్లాడుతుంటే..అల్లాహ్ అక్బర్ రాలేదు.
తిండి తిప్పల్లేక పస్తులుంటే.. తిరుపతి వెంకన్న రాలేదు.
జీవిగంజి లేక జీవం పోతుంటే.. జీసస్ కూడా రాలేదు.
*ఇక నా తరం వెతికాను*
ఎవరొస్తారు నా తరం మార్చడానికి..
ఎప్పుడొస్తారు మా తరం మార్చడానికి..
మోడుబారిన నా శిల... చితి మంటల్లో కాలకముందే,
కరడుకట్టిన ఈ కట్టె...కాటిని కాల్చే కట్టెల్లో చేరకముందే,
నా శిల శిల్పి చేతికి చేరాలి.. శిల్పంగా మారాలి.. వెతికాను ఎవరొస్తారు అని.
*అప్పుడొచ్చారు వారు.. ఎవరొచ్చారో తెలుసా*
అమర శిల్పి జక్కన్న రాలేదు..
కానీ మా సారొచ్చారు.
అద్భుత చిత్రకారుడు డావిన్సీ రాలేదు..కానీ మా సారొచ్చారు.
హీరోలు రాలేదు, పరిపాలకులు రాలేదు... కానీ మా సారొచ్చారు.
ఆఖరికి ముప్పది మూడు కోట్ల దేవతలూ రాలేదు... కానీ మా సారొచ్చారు.
కరుడు కట్టిన కట్టే... పెన్సిల్ కర్రు అయింది.
మోడుబారిన శిల ... శిల్పమూ అయింది.
ఇక అక్షర సేద్యం మొదలయింది
అది అనంత ఆసరనిచ్చింది
బువ్వనిచ్చింది-బుద్దినిచ్చింది.
లక్ష్యమిచ్చింది-మోక్షమిచ్చింది.
గత ఆరు తరాల చరిత్ర మార్చింది.
*ఇక మా తరం మారింది*
నా చేతిలో ఇప్పుడు అక్షరం ఉంది.
కాదు కాదు కోహినూర్ వజ్రం ఉంది,
కాదు కాదు అక్షయ పాత్ర ఉంది,
కాదు కాదు అమృత భాండం ఉంది.
కాదు కాదు అదేంటో మరి పంచినా కొద్దీ పెరుగుతుంది.
అందరూ దాన్ని అక్షరం అంటున్నారు కానీ గురువు పెట్టిన బిక్ష అనడం లేదు.
మా బతుకులు మార్చిన...
వందననీయుడా మీకు.. వందేమాతరం.
ఆచార్య దేవోభవా.. మీకు మరో అర్చనం.
రచన : *వేర్పుల బాలకృష్ణ*
(చిత్రకళ ఉపాధ్యాయులు)
తొర్రూర్ (గ్రా/మం),
మహబూబాబాద్ (జిల్లా).