నిద్ర కరువైన కళ్ళు --- మచ్చరాజమౌళి, దుబ్బాక.

నిద్ర కరువైన కళ్ళు --- మచ్చరాజమౌళి, దుబ్బాక.

 
నిద్ర కరువైన కళ్ళు

సూదిమొన దూరనంత 
సుఖం లేని జీవితంలో
సుడిగుండాల చక్రాలకింద
వేధించే వేలవేల ఆలోచనలు
మది అంతరంగాన్ని తొలుచుకుంటూ
గిరికీలు తిరుగుతూ నలుగుతున్నప్పుడు

క్షణం మరో క్షణాన్ని
భారంగా మోస్తూ నడవలేక నడవలేక
తనకు తానై మరణిస్తున్నప్పుడూ
నిప్పు కణికలై బడబాగ్నిని తలపిస్తూ
తెల్లవార్లూ మెలకువ జాతర చేస్తున్నాయి

కళ్ళు.. 
కన్నీటిని కార్చడం కూడా మరిచిపోయాయి
ఇంకిపోయిన శకలాలు
దూర దూరంగా పడివున్నాయి
మబ్బుల మాటున దాగిన మనసు
మరణద్వారపు గడియకోసం వెతుకుతుంది

నిద్ర కరువైన కళ్ళు మాత్రం 
ఎంత వద్దు వద్దనుకున్నా
నివురు కప్పిన నిజాలను దాచలేకపోతున్నాయి

పిడికెడు గుండె
ఎంతటి దావానలాన్ని మోస్తుందో., 
ఎప్పటికప్పుడు రెప్పలకైనా చెప్పే కళ్ళు 
నేడెందుకోమరి, 
నిశీధిలో వెలుతురు ఆనవాల్లను వెతుకుతున్నాయి

--- మచ్చరాజమౌళి 
దుబ్బాక 

0/Post a Comment/Comments