పుడమితల్లి మోస్తున్నది భారం
సమస్తజగతి జీవనానికి భూమి ఆధారం
నేడు పెరిగింది భూభారం
ఇంకా కాకూడదు పెనుభారం
మానవుల స్వార్ధపు ఆశలతో
కళ్ళు మూసికొని పోయిన కోరికలతో
కలియుగ కిరాతకుల కాఠిన్యంతో
విసిగి వేశారుతుంది భూమాత
తరం తరం నిరంతరం
క్షణ క్షణం అనుక్షణం ప్రతీక్షణం
ప్రకృతి పచ్చదనాన్ని చిదిమేస్తూ చీల్చేస్తూ
శాస్త్ర సాంకేతిక రసాయనాల పేరుతో కాలుష్యాన్ని విరజిమ్ముతూ
ప్రాణ రక్షణ కవచాన్ని హరింపజేస్తూ
నవనాగరికత పేరుతో
మనిషి తనను తాను మోసం చేసుకుంటూ
ప్రకృతి ని నాశనం చేస్తూ
కూర్చున్న కొమ్మని తెగ నరుకుతున్నాడు
మనిషి సద్వినియోగం మరచి
ఒకపక్క మానవ వనరుల నిష్ప్రయోజనం
ఒకపక్క సహజవనరుల నిరూపయోగం
ఒకపక్క స్వప్రయోజనాలతో ప్రకృతిని దుర్వినియోగం
ఇంకా ఎన్నెన్నో దుష్టకృత్యాలతో
భూమి ని అసమానతలు పాలుజేసి
భూ సమతౌల్యాన్ని దెబ్బతీసి
భూమాతను కన్నీరు పెట్టిస్తున్నారు
రచన: పసుమర్తి నాగేశ్వరరావు,
టీచర్,
సాలూరు, విజయనగరం జిల్లా.