మనసా...!నన్ను మన్నించు...!
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ), ఖమ్మం.
నన్ను చీకటి దుప్పటి నిద్రలేకుండా చేస్తుంది
నా హృదయాంతరాల అలజడి గుండె దరిని కోస్తుంది
నా మనసంతా గందరగోళంగా
మాయాలోకంలో
క్షణ క్షణం భయం భయంగా బిత్తర పోయి చూస్తుంది
ఆనంద పరిమళం ఒక్కసారైనా మెరుపులా వచ్చి నన్ను ముద్దాడి పోతే బాగుండనిపిస్తుంది
నిద్ర లేని రాత్రులు చిధ్రమౌతుంటే తెల్లవారితే ఏదో తెలియని గుబులు వెంటాడుతున్నట్లు
ఎవడో సామాజిక ఉగ్రవాది కరవాలంతో తరుముతున్నట్లు
సమాజపు చావు ఆలోచనలు కత్తులు దూస్తున్నట్లు
అడుగడుగున కరోనా మరణ మృదంగం కర్ణ భేరిని పగలగొడుతున్నట్లు
కలలు కల్లలై ఆశలు అలలుగా తీరం దాటుతుంటే
నిశాచర సంచారిలా మనసు తిమిరంలో మాయమైంది
మస్తిష్కంలో నరాలు చిట్లెంత ఆలోచన
అగ్నిపర్వతం బద్దలయ్యేంత ఆందోళన
నా ఎద తలుపులు తెరుచుకున్న కన్నీటి తరంగం కెరటంలా
సముద్ర తీరాలలో అలల కల్లోలంలా
అంతులేని ఆకాశమంత అందనంత ఎత్తులో
కంటికి కనిపించనంత దూరంలో
పరుగెడుతూ వుంటే నేను ఎలా అందు కోను?
నీతో నేను అలుపెరుగని బాటసారి లా
పరుగెత్తి ... పరుగెత్తి...
అలసి... సొలసి...
మెదడు మొద్దు బారి ఎంత లేపినా లేవకుంది
నా మనసు అభిమన్యుడి లా
పద్మ వ్యూహం లో చిక్కుకొని
సుడి గుండం మెలికలలో కొట్టు మిట్టాడుతూనే ఉంది
మనసా! నిన్ను ఆశనిరాశల వలయంలో బంధించి ప్రశాంతంగా పవలించనీయనందుకు
మనసున్న మనసా! నన్ను క్షమించు...!