'త్యాగ నిరతికి నిదర్శనం బక్రీద్!
దైవ ప్రవక్త హజరత్ ఇబ్రహీం చేసిన త్యాగానికి ప్రతీక బక్రీద్. త్యాగాల పండుగగా పేరున్న బక్రీద్ రోజు ఉదయమే నిద్రలేచి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ముస్లిం సోదరులు. సమాజంలో పేరుకుపోయిన రుగ్మతల నుంచి జనావళికి జాగృత పరుస్తూ సన్మార్గంలో నడిపించేందుకు అల్లాహ్ భూమండలానికి ఎనభై వేలమంది ప్రవక్తలను పంపినట్లు ముస్లింల ఆరాధ్య గ్రంథం దివ్య ఖురాన్ లో తెలుపబడింది. వారిలో ప్రముఖ ప్రవక్త ఇబ్రహీం. తను అల్లాహ్ పెట్టిన అనేక పరీక్షల్లో తన విశ్వాసాన్ని నిరూపించినట్లు పవిత్ర ఖురాన్ పేర్కొంది. ఈ క్రమంలోనే హజరత్ ఇబ్రహీం, ఆయన సతీమణి హాజీరాలకు అల్లాహ్ దయవల్ల సంతాన ప్రాప్తి కలిగింది. లేక లేక వృద్దాప్య కాలంలో జన్మించిన తన కుమారుడికి ఇస్మాయిల్ అని నామకరణ చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తరుణంలో ఒక రోజు రాత్రి ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్ ను అల్లాహ్ పేరున బలిదానం చేస్తున్నట్టు కలలో కనిపిస్తుంది. దాంతో అల్లాహ్ తన కొడుకును బలిదానం చేయమని కోరుకుంటున్నాడని భావించిన ఇబ్రహీం ఇస్మాయిల్ ను ఖుర్బానీ (బలిదానం) ఇచ్చేందుకు సిద్ధపడతాడు. తండ్రి అంతరంగాన్ని గమనించిన కొడుకు ఇస్మాయిల్ కూడా అల్లాహ్ ఆజ్ఞగా భావించి తానే స్వయంగా బలయ్యేందుకు ముందుకొస్తాడు. అల్లాహ్ ని స్మరిస్తూ ఇస్మాయిల్ గొంతుపై తండ్రి కత్తి పెట్టిన క్షణంలో తన త్యాగ నిరతికి, దైవ భక్తికి మెచ్చిన అల్లాహ్ ఆఖరు క్షణంలో ఇస్మాయిల్ ను తప్పించి ఆ స్థానంలో (బకరా) ఒక మేకపోతు ప్రతక్షమయ్యేలా చేస్తాడు. వెంటనే మేకపోతు గొంతు తెగి అల్లాహ్ మార్గంలో అది ఖుర్బాన్ అవుతుంది. నాటి నుండి 'ఈదుల్ అజ్ హా' గా నిర్దేశించి 'బక్రీద్' పండుగను చేసుకుంటున్నట్లు ఇస్లాం చెబుతుంది.
ముస్లిం సోదరులందరికి బక్రీద్ శుభాకాంక్షలు.
***
-- సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్.
(వ్యాసం)