అదృశ్యబలం
--- డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్.
స్వీయ ప్రేమతో మొదలై
వాస్తవ అంతరంగ ఆవిష్కరణకు
నిలబడ్డ ధీరోధాత్త గుణం.
తుచ్ఛమైన వాటికి లొంగకుండా
తనను తాను నిలుపుకొనే తార్కాణం.
ప్రత్యేకతను కలిగి,
పదిమందిలో ఒకడిగా గుర్తింపజేసే చిరునామా.
అస్తిత్వానికి,నమ్మకానికి పెట్టిన
కంచెగా కనబడి,
నిన్ను నిన్నుగా స్థిరంగా నిలబెట్టే నిజమైన నేస్తం.
పరిమళభరితమై,ప్రమోదానికి కారణమై,
పరిచయానికి నాందీవాక్యమై
శిఖరాయమానమవుతుంది.
మనిషిగా చూపెట్టి,
మధురమైన జ్ఞాపకాన్ని మిగిల్చి,
నిరంతరం అండగా నిలుస్తుంది.
శాశ్వతమైన కీర్తిని,
అమేయ గౌరవాన్ని,
అద్భుతమైన గుర్తింపు నిస్తుంది.
ఆత్మాభిమానం కవచకుండలమై,
అన్ని యుద్ధాల్లో గెలిపిస్తుంది.