అయ్యో ఓ బ్రహ్మ ! ఎందుకిచ్చావయ్యా మాకీ రైతుజన్మ !... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

అయ్యో ఓ బ్రహ్మ ! ఎందుకిచ్చావయ్యా మాకీ రైతుజన్మ !... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

అయ్యో ఓ బ్రహ్మ !
ఎందుకిచ్చావయ్యా మాకీ రైతుజన్మ !

మా అన్నదాతల బ్రతుకు అడవిలో
మ్రాను బతుకే...అది పరులకొరకే
ఆకలిని మాయం చేసే "ఆయుధం"
మా అన్నదాతల చేతుల్లోనే ఉన్నది

నిజమే మట్టిలో పుట్టి మట్టిలో పెరిగే
మట్టిలో కలిసే "మట్టినే నమ్ముకున్న"
మట్టి మనుషులమే మేమంతా
కంచంలో "మెతుకు‌లకు తెలుసు"
"మంచంలో మనిషికి" నిద్రెందుకురాలేదో

మా కుడి ఎడమల
నాగుపాములున్నాయి
నవ్వుతూ నట్టేటముంచే
నయవంచకులున్నారు
అరచేతిలో స్వర్గంచూపించే
అంధులైన అధికారులున్నారు
దళారులున్నారు దగాకోరులున్నారు

నిన్న కరువు "కత్తులు" దూస్తుంటే
మొన్న అనావృష్టి "అగ్ని" కురిపిస్తుంటే
మా కుటుంబాలెన్నో కూలిపోయె
కుమిలిపోయె పాతాళానికి కృంగిపోయె

మేము విధిచేతిలో పావులమైతిమి
పులి నోట చిక్కిన జింకలమైతిమి
ఆత్మహత్యలకు పూనుకొంటిమి
మృత్యువు ముంగిట నిలిచివుంటిమి
ఆకలికి అలమటించే అస్థిపంజరాలమైతిమి

పాలకులు మాముందు "విందువిస్తరి" వేసిరి
ఆశ...ఆకలితీరకనే అందులో "విషాన్ని" కలిపిరి
మేమే మీచుట్టాలమంటు "సాగుచట్టాలు" చేసిరి
ఊపిరాడకుండా మా మెడలకు "ఉచ్చు" బిగించిరి
అయ్యో ఓ బ్రహ్మ ! ఎందుకిచ్చావయ్యా మాకీ రైతుజన్మ‌ ! అందరూ అంటారే 
ధైవమెక్కడో ధైర్యమక్కడని !
ధైర్యమెక్కడో దారి అక్కడని !
మెరుపు ఎక్కడో మేఘమక్కడని !
మేఘమెక్కడో చినుకు అక్కడని !
చినుకు ఎక్కడో చిరునవ్వులక్కడని !
చిరునవ్వు లెక్కడో చల్లని బ్రతుకక్కడని ! 
అందుకే ఓ దైవమా!మాపై దయచూపుమా! 
కరుణించుమా! కాపాడుమా !

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502



 

0/Post a Comment/Comments