దాశరథి ఓ సాహితీ నిధి
(22.7.2021 తేదీన వీరి జయంతి సందర్భంగా)
చిన్న గూడూరు చిన్నోడు
ఉమ్మడి వరంగల్ జిల్లావోడు
తెలంగాణ ముద్దు బిడ్డ వాడు
విరిసిన ఓ పారిజాతం వంటి వాడు
కవితా ఉద్యానవనాన వాడు
ఉద్యమస్ఫూర్తితో
నిజాం పాలనపై నిప్పులు కురిపించి
"నిజాం రాజు జన్మ జన్మల బూజు" అంటాడు
"రైతుదే తెలంగాణము రైతుదే
ముసలి నక్కకు రాచరికము దక్కునే..
..........దిగిపోవోయ్, తెగిపోవోయ్"
అని గర్జించాడు జైలు పాలైనాడు
రాతినేలనైననేమి రావి విత్తు మొలకెత్తదా
అన్నట్లు పండ్లుతోముకోను ఇచ్చిన బొగ్గే
కలమై జైలు గోడలే పేపర్లు చేసుకున్నాడే గాని రాతలు మాత్రం మానలేదు
తన కవితా దివిటీ వెలిగించి
నిరంకుశత్వం అను చీకటికి
వెలుగు నిచ్చిన మహనీయుడు
కోటిరతనాల వీణ మా తెలంగాణ
ఆని ఆనాడే ఎలుగెత్తిన కవిపుంగవుడు
కవితా సుందరీమణులు ఎందరో
ఈ సుందరుని కవితలను మోహించి
అవార్డుల మాలలతో వరించిరి
సినీ సంగీతమనే వినీలాకాశంలో
ఈ కవీశ్వరుని పాటలు
ఎన్నో చుక్కలై ధగ ధగా మెరుస్తున్నాయి
పాటల పూదోటలో వాడిపోని
ఓ దేవలోక పారిజాతమై నిలిచె
గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుందీ
అంటూ ఓ పల్లెపడచు ఆనందకేళి
ఇంతేనయా తెలుసుకోవయా
ఈ లోకం ఇంతేనయా... నీతిలేదు..నిజాయితీ లేదు...
పైసాతోటి సీసా చేరి జల్సా చేసింది అని
ఓ పాటలో అవినీతిపై విరుచుకు పడతాడు
మంచిని మరచి వంచన నేర్చి
నరుడే ఈనాడు వానరుడైనాడూ..
ధనమే హెచ్చి.. గుణమే చచ్చి నరుడే ఈనాడు వానరుడైనాడూ..
అంటూ మరో పాటలో సమాజంపై విరుచుకు పడిన అభ్యుదయ భావకుడు
యుగళ గీతాలతో యవతీ యువకులను
ఊహల్లో విహరింపజేశాడు
నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే అంటూ ఓ జంట పరవశత్వం
ఖుషీ ఖుషీ గా నవ్వుతూ చలాకిమాటలు రువ్వుతు హుషారు గొలుపే వెందుకే నిషాకనులదాన.. అంటూ ..మరో జంట
చిన్నారి పొన్నారి పువ్వును విరబూసి విరబూసి నవ్వమంటాడు
ఏ శుభ సమయంలో..
ఈ చెలిహృదయంలో....అంటూ ఇంకో జంట
ఎన్నెన్నో జన్మల బంధం ..నీదీ నాది అంటూ మరో జంట
ఇలా ఎన్ని యగళ గీతాలు పూయించాడో!
గోరింక గూటికి చేరిన ఓ చిలకకు..మల్లెపూలతో మంచి కధలు చెప్పిస్తాడు
మదిలో వీణలు మ్రోగించే వీణ పాటలు
ఎన్నో పండించారు
బడాబాబుల సరదాలకై
కొంటె చూపులెందుకులేరా జుంటి తేనెలందిస్తారా..అంటూ
మత్తెక్కించే మగువ విన్యాసాలు చూపించగల సరసగీతల సృష్టి కర్త
దీపాలు వెలిగె పరదాలు తొలిగె
ప్రియురాలు పిలిచె రావోయి..అంటూ
ఓ ప్రియురాలి పిలుపు వినిపిస్తాడు
నిషాలోనూ గళం నిషాగా పాడాలంటుంది
అప్పుడు నిజాలు బయట పడతాయి
కొందరికి డబ్బు నిషా..కొందరికి క్లబ్బు నిషా..
కొందరికి పదవి నిషా..కొందరికి పెదవి నిషా..
కొందరికి మధువు నిషా..
వీటన్నిటి కంటే స్వార్ధమే అసలు నిషా
అని ఓ తాగుబోతుతో వేదాంతం పలికిస్తారు మరి వీరికి కవితా నిష మెండేమో!
విషాదం కూడా పండించే విషయతుల్యుడు
ఎచటికోయి నీ పయనం ..అని ఓ అమరశిల్పిని సుతిమెత్తగా మందలిస్తాడు
"శిలలు కరిగించు నీవు శిలవే అయిపోయినావా ...
వెన్నెలతో విందు చేయు పున్నమి చంద్రుడు నీవు..కళలు మాసి కాంతి బాసి గ్రహణం పాలైనావా!"
"మంటలురేపే ఓ నెలరాజా..అంటూ
తీగలు తెగిన వీణియపై తీయని రాగం పలికేనా..మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేశాడు"
అంటూ దేవుని పై విరుచుకు పడతాడు
ఇక రక్తి భక్తి కవులకు రెండు కనులేమో
భక్తిపరవశంతో ఓ నిరు పేద భక్తుడు
ఆ ఏడు కొండలవాన్ని ఆరాధిస్తూ..
"నడిరేయి ఏజాములో స్వామి నిను చేర దిగివచ్చునో... అంటూ
కలవారినే కాని కరుణించలేడా..
నిరుపేద మొరలేవి వినిపించుకోడా
అడుగవే మాయమ్మ అలివేలి మంగా
అంటూ ఆ దేవుని కూడా కడిగేస్తాడు
ఈయన సమాజాన్నే కాదు ఆ ఏడుకొండలవాణ్ణి కూడ వదలడు..
వేయి వేణువులు మ్రోగే వేళ.. అంటూ ఆ శ్రీకృష్ణుని స్తుతిస్తూ..
కంసుని చెరసాలలో ఖైదీవై పుట్టావు
కాంతల కౌగిళ్ళలో ఖైదీవై పెరిగావు..
ఈ భక్తుని గుండెలో ఖైదీగా వుండాలని..
ఓ భక్తి పారవశ్యం ..వినిపిస్తాడు
ఇలా నవరసాలూ పండించిన కవితా మాధురి ఈ దాశరథి వారు
ఈ సాహితీ నిధి జయంతి నేడు
అందుకే నా ఈ అక్షర మాల
ఓ మారు వారి పాండిత్యాన్ని స్మరిద్దాం
వారికి ఆత్మీయ నివాళి అర్పిద్దాం
డా విడి రాజగోపాల్
9505690690