కమల నాభుడు విష్ణు కమల భవుడే బ్రహ్మ
కమలాసనయె లక్ష్మి కమలాప్తుడే ఖమణి
కమలారి నిశిరేడు కమలాకరము సరసు
కమల నేత్రులు స్త్రీలు కమలధియె సాగరము
కమలమా! నీకింత కర్మ ఫలమేమిటే?
పూర్వ జన్మల నేమి పుణ్యములు చేసితే?
కమలమా! ఠీవిగా, కడు రాజసంబుగా
భరత పీఠమునెక్కి పాలించుచుంటివే!
తరుణి కన్నుల దోయి తామరస కుముదాలు
పడతి సన్నని ముక్కు పరమళపు చంపకము
మానినీ యధరాలు మందార పుష్పాలు
పూబోడి నెత్తనువు పూప మార్దవతనము
అబ్జముఖి హస్తాలు అమలంపు పద్మాలు
జలజాక్షి చరణాలు సౌగంధ కమలాలు
లలితాంగి దేహమే లక్షణంబై మెరిసె
ధరలోని పూలన్ని ధగధగద్దాయమై
కవిచక్రవర్తి
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
9963991125