ముత్యాల హారాలు ----మీసాల సుధాకర్

ముత్యాల హారాలు ----మీసాల సుధాకర్

ముత్యాల హారాలు


1)తొలకరి చిరుజల్లులు
పులకించెను మనసులు
చిగురించును తరువులు
నిండుకొనెను చెరువులు

2)వానజల్లు కురిసింది
మనసు పులకరించింది
పుడమి మురిసిపోయింది
ప్రకృతి పరవసించింది


3)భయమును వీడాలి
ధైర్యముగా ఉండాలి
కష్టపడి బతకాలి
ఆనందం పొందాలి

4)చక్కగ మాట్లాడాలి
హాస్యము పండించాలి
శ్రోతల మెప్పించాలి
సభను అలరించాలి

5)మాటలు విలువనిచ్చు
మనిషిగ ఎదగనిచ్చు
చల్లని బతుకునిచ్చు
మంచిని పంచియిచ్చు


6)కాలేజి చదువులు
విలాసాల బాటలు
మానకుంటే యువకులు
మారును తలరాతలు


7)ప్రతిబడిలోన తెలుగు
ప్రతిమదిలోన తెలుగు
ప్రతిపలుకులో తెలుగు
విరజిమ్ము తనవెలుగు

8)మధురమైనట్టి భాష
సరళమైనట్టి భాష
రమ్యమైనట్టి భాష
తెలుగు మన మాతృభాష


9)పదుగురితో కలవాలి
మంచిచెడు తెలపాలి
కలిసిమెలిసి బతకాలి
ఐక్యతను చాటాలి

10)ఉమ్మడి కుటుంబాలు
విడిపోయిన రోజులు
కనిపించని ప్రేమలు
కరువాయెను మమతలు

11)పెద్దల అనుభవాలు
పిల్లలకు పాఠాలు
తరతరాల జ్ఞాపకాలు
భవితకవి మార్గాలు

12)మితమైన ఆహారము
మనకిచ్చును ఆరోగ్యము
కలిగించును ఉల్లాసము
దరిచేరదు ఏ రోగము

13)అందమైన ఉదయాన
చల్లనైన సమయాన
సూర్యుని వెలుగులోన
పక్షులెగురు ఆకసాన

14)డబ్బుకు ప్రాణంలేదు
మనిషికి విలువలేదు
మానవతా కానరాదు
మంచితనం లేనెలేదు

15)ప్రశాంతంగా బతకాలి
శాంతినెపుడు పొందాలి
దయాగుణం పెంచాలి
జన్మధన్యమవ్వాలి

16)గురువంటే దైవము
గురువంటే ధర్మము
గురువంటే జ్ఞానము
గురువేకద సర్వము

17)నిజాయితీ చూపాలి
నిజాలనే చెప్పాలి
నిబ్బరముగ ఉండాలి
నిబద్ధతను చాటాలి


18)బంధాలను కలిపేది
బాధ్యతలను తెలిపేది
ఇంటికన్న గొప్పయినది
పుడమిపైన ఇంకేది

19)మనిషి విలువ తెలుసుకో
మమత విలువ పెంచుకో
మంచిపనులు నేర్చుకో
మంచితనం నిలుపుకో

20)సముద్రంలో అలలు
జీవితంలో కష్టాలు
సమాజంలో బాధలు
జగమెరిగిన సత్యాలు

21)సత్యమునే పలకాలి
ధర్మమాచరించాలి
నీతిగాను బతకాలి
దయాగుణం పెంచాలి

22)గలగలపారే నదులు
కిలకిల పక్షులకూతలు
ప్రకృతిలోని అందాలు
కనులకు ఆనందాలు

23)మూర్ఖులతో వాదించకు
ఎవ్వరికీ తలవంచకు
పెద్దలను ఎదురించకు
పిల్లలను బెదిరించకు

24)నీడనిచ్చే చెట్టులా
ఊతమిచ్చే కర్రలా
దానమిచ్చే చేతిలా
సాగిపోరా నావలా


25)ఎదలకు హత్తుకునేలా
మనసు మెచ్చుకునేలా
మంచిని పెంచేలా
నిలిచిపో మనిషిలా

26)నచ్చినట్టు పయనించు
చెమటధార చిందించు
ఒళ్ళు వంచి కష్టించు
రాజులాగా జీవించు


27)తలరాతను నిందించకు
తలిదండ్రులు బాధించకు
బాధలకు శోఖించకు
సమాజాన్ని పీడించకు

28)మంచిమాటల కూర్పు
మనలో తెచ్చు మార్పు
మనిషికుండాలి ఓర్పు
దానిక్కావాలి నేర్పు

29)వెలుగుతున్న దీపము
గడుస్తున్న కాలము
కరిగిపోవు తధ్యము
చింతించుట వ్యర్థము

30)కడుపు కాలినవాడు
కష్టాలు కలవాడు
ఖాళీ జేబులవాడు
ప్రతిపనిని చేస్తాడు

31)పిల్లలను కొట్టవద్దు
ఇతరులతో పోల్చవద్దు
తప్పులెత్తి చూపవద్దు
గారాబం చేయవద్దు

32)వన సంరక్షణ చేయుము
జల సంరక్షణ చేయుము
భూ సంరక్షణ చేయుము
జగతినెపుడు కాపాడుము

33)పచ్చదనం నిండాలి
పరిశుభ్రత కావాలి
ఆరోగ్యం పొందాలి
బతుకు పండగవ్వాలి

34)చెట్లునాటి పెంచాలి
పచ్చదనం పరవాలి
జోరువాన కురావాలి
ప్రకృతికాంత మురియాలి


35)అమ్మలా లాలిస్తుంది
నాన్నలా పాలిస్తుంది
గురువులా బోధిస్తుంది
చెట్టుమనకన్నిస్తుంది.

---మీసాల సుధాకర్
ఖిలాషాపురం
జనగామ జిల్లా

0/Post a Comment/Comments