ఇష్టపది కవితా ప్రక్రియ:
పరిచయం:
తెలుగు సాహిత్యంలో ఎన్నో కొత్త కవితా ప్రక్రియలు వచ్చాయి.వస్తున్నాయి.ఇతర భాషల నుండి గజల్, రుబాయిలు,దోహాలు లాంటి ప్రక్రియలు కూడా తెలుగు సాహిత్యంలోకి దిగుమతి కాబడి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టి చేశాయి.భాష మనుగడకు ఇలాంటి ప్రక్రియలు ఆవశ్యకం కూడాను.
నేపథ్యం:
శ్రీవైష్ణవ సాహిత్యంలో తిరుప్పావై ప్రబంధం(మూలద్రావిడ భాష) అత్యున్నత సాహితీ అంశాలున్న ప్రబంధం.ఇందులో చాలా అరుదైన ప్రకృతి వర్ణనలు కనబడుతాయి.ఈ ప్రబంధంలో ముప్పై భక్తిరస పాశురాలు ఉన్నాయి.పాశురం అనగా ఎనిమిది పాదాలు కలిగిన యతి,ప్రాసలతో కూడిన తమిళపద్యం.ఇవి సంగీతప్రధానమైన పద్యాలు.2001 వ సంవత్సరంలో నేను జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థ,కరీంనగర్లో ఉపాధ్యాయశిక్షణ చేస్తున్న కాలంలో మా కళాశాలకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయానికి ప్రతిదినం వెళ్ళేవాడిని.ధనుర్మాసంలో పూజావిధానాన్ని గమనించాను.ఆ మాసం మొత్తం తమిళ పాశురాలు చదవడం(తిరుప్పావై) చూశాను.మా తోటి ఛాత్రోపాధ్యాయుడు, శ్రీ వైష్ణవ బ్రాహ్మణోత్తముడైన మాడభూషిణి వేణుగోపాలాచార్య గారి సాయంతో తిరుప్పావై గురించి తెలుసుకున్నాను.గోదాదేవి ధనుర్మాసంలో రోజుకొకపాశురం చొప్పున రాసి,శ్రీరంగనాథునికి పాశురమాలతోపాటు పూలమాల సమర్పించిందని విన్నాను.ఆ పుస్తకం సేకరించాను.పాశురాలను అవగాహన చేసుకున్నాను.అలాంటి గానయోగ్యమైన పద్యం తెలుగులో ప్రవేశపెడితే బాగుంటుందనిఅప్పుడే నాకు అనిపించింది.ఎనిమిది పాదాలతో ఒక ప్రక్రియను మాత్రాఛందస్సుతో యతిమైత్రి/ప్రాసయతిమైత్రితో రూపొందించాను.16-12-2001 తేదీనుండి 14-01-2002 వరకు రోజుకొక్కటి చొప్పున "పురుషోత్తమమాల" పేరుతో ముప్పై పాశురాలు రాసి,శ్రీరంగనాథునికి సమర్పించాను.
"పురుషోత్తముని కూడ పరిశుద్ధ హృదయాన
కొలవండి,తలవండి,కలవరించండీ!"అనే మకుటంతో రాశాను.అపుడు ఆ ప్రక్రియకు ఇంకా పేరుపెట్టలేదు.వాటిని తెలుగు పాశురాలు అన్నాను.2018 ప్రాంతంలో సాహిత్యానికి సంబంధించిన వాట్సప్ గ్రూపులు పెరిగి,మణిపూసలు లాంటి కవితాప్రక్రియలు పుట్టుకురావడం గమనించాను.2001 లో నేను రూపొందించిన ప్రక్రియకు "ఇష్టపది"అని పేరుపెట్టి,నియమాలను ఏర్పరచి 18-10-2018 విజయదశమి రోజున "ఇష్టపదులు" పేర ఒక వాట్సప్ సమూహాన్ని సృష్టించి "ఇష్టపది" ప్రక్రియను తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టడం జరిగింది.పద్యప్రక్రియ రాసేకవిశ్రేష్ఠులతో పాటు,వచన కవులు కూడా రాయడం మొదలుపెట్టారు.మొదట్లో శాడ వీరారెడ్డి, కట్ట రంజిత్ కుమార్, వేములశ్రీ,మాధవీలత,గోగులపాటి కృష్ణమోహన్,బొమ్ము విమల,మమత ఐల,ఆకుండి శైలజ,రాచిరాజు మురళీకృష్ణ;తరువాత ఎం వి ఉమాదేవి, గుడిపూడి రాధికారాణి,దోమల జనార్థన్,శ్రీహరికోటి,ఆదూరి ఫణీంద్రరావు,ముక్కా సత్యనారాయణ మున్నగు కవిశ్రేష్ఠులు ఇష్టపదిని బాగా ఆదరించారు.ప్రక్రియ ప్రారంభించిన మూడు నెలల్లోనే నా సంపాదకత్వంలో 50మంది కవులతో,శ్రీ దాస్యం సేనాధిపతిగారి పీఠికతో "ఇష్టపది కవితాసంకలనం-1" తేవడం జరిగింది.దీనిని ఉదయసాహితీ-కరీంనగర్ అధ్యక్షుడు శ్రీ డా.వైరాగ్యం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ అదనపు పాలనాధికారి శ్రీ గాజుల శ్యాంప్రసాద్ లాల్ గారి చేతుల మీదుగా ఫిలింభవన్ ,కరీంనగర్ లో ఆవిష్కరించడం జరిగింది.
ఇష్టపది నియమాలు:
1.ఎనిమిది పాదాలు ఉండాలి.
2.ప్రతి పాదం 10(5+5)--10(5+5) మాత్రలుగా రెండు భాగాలుగా విభజించబడిఉంటుంది.
3.మొదటి భాగంలోని మొదటి అక్షరానికి,రెండవ భాగంలోని మొదటి అక్షరానికి యతిమైత్రిగాని,ప్రాసయతి గానీ కుదరాలి.
4.చివరి పాదంలోగానీ,చివరి రెండు పాదాలలోని గాని "మీ ఇష్టదైవత నామం" మకుటంగాను లేదా "కవి నామ ముద్ర" లేదా "రెండూ" ఉండాలి.
5.లఘువుకు ఒక మాత్ర-గురువుకు రెండు మాత్రలుగా లెక్కించాలి.
ఉదా :
కవి: డాక్టర్ అడిగొప్పుల సదయ్య
శీర్షిక : పుడమి తల్లికి వందనమ్
ఆకు పచ్చని చీర నందముగ కట్టుకొని
చంద్రుణ్ణి,సూర్యున్ని చంచలాక్షుల నిలిపి
ఝరీపాతములన్ని ఝషములై దుముకగా
నదీ వాహములన్ని నగల నిగలై మెరువ
నగములును,ఖగములును,మృగములును,భుజగములు
జీవజాలముకెల్ల ఆవాసస్థానమై
బతుకునిచ్చే తల్లి! బంగారు సుమవల్లి!
పుడమి తల్లీ! నీకు పూమాల వందనమ్!
*వివరణ:*
*మొదటి పాదము* : (10+10 మాత్రలు)యతి-ఆ-న (అ)
ఆకు పచ్చని చీర —నందముగ
U I U I I U I —U I I I
కట్టుకొని
U I I I
*రెండవ పాదము* : (10+10 మాత్రలు)యతి-చ-చ
చంద్రుణ్ణి,సూర్యున్ని—
U U I U U I —
చంచలాక్షుల నిలిపి
U I U I I I I I
*మూడవ పాదము* :(10+10 మాత్రలు)యతి-ఝ-ఝ
ఝరీపాతములన్ని —ఝషములై
I U U I I U I —I I I U
దుముకగా
I I I U
*నాల్గవ పాదము* : (10+10 మాత్రలు)యతి-న-న
నదీ వాహములన్ని —నగల నిగలై
I U U I I U I —I I I I I U
మెరువ
I I I
*ఐదవ పాదము* : (10+10 మాత్రలు)ప్రాసయతి-
నగ-మృగ
నగములును,ఖగములును—
I I I I I I I I I I—
,మృగములును,భుజగములు
I I I I I I I I I I
*ఆరవ పాదము* :(10+10 మాత్రలు)ప్రాసయతి-జీవ-ఆవా
జీవజాలముకెల్ల—
U I U I I U I—
ఆవాసస్థానమై
U U I U I U
*ఏడవ పాదము* : (10+10 మాత్రలు)యతి-బ-బ
బతుకునిచ్చే తల్లి! —బంగారు
I I I U U U I —U U I
సుమవల్లి!
I I U I
*ఎనిమిదవ పాదము:* (10+10 మాత్రలు)యతి-పు-పూ
పుడమి తల్లీ! నీకు —పూమాల
I I I U U U I —U U I
వందనమ్
U I U
ఇప్పటి వరకు ఇష్టపది ప్రక్రియలో అచ్చైన పుస్తకాలు:
1.ఇష్టపది కవితాసంకలనం-1--సంకలనకర్త: డా.అడిగొప్పుల సదయ్య,జమ్మికుంట
2.ఇష్టపది కవితాసంకలనం-2--సంకలనకర్త: డా.అడిగొప్పుల సదయ్య,జమ్మికుంట
3.వాగ్దేవీ వందనం- కవయిత్రి: శ్రీమతి గుడిపూడి రాధికారాణి,మచిలీపట్నం
4.ఉమాంతరంగాలు-శ్రీమతి ఎం వి ఉమాదేవి, నెల్లూరు
5.ఇష్టపదులు- శ్రీ దోమల జనార్దన్, నవీ ముంబై
6.ఇష్టపది కృష్ణగీత(భగవద్గీత)--శ్రీ హరికోటి,ఏలూరు
7.అక్షర దివ్వెలు -- శ్రీ వేముల శ్రీ చరణ్ సాయిదాస్
8.మేలి మౌక్తికాలు -- శ్రీమతి బొమ్ము విమల
9.కరోనా ఇష్టపది సంకలనం-(ముద్రణకు సిద్ధంగా ఉన్నది)
10.తిరుప్పావై ఇష్టపది సంకలనం-(ముద్రణకు సిద్ధంగా ఉన్నది)
నా పరిచయం:
పేరు: డాక్టర్ అడిగొప్పుల సదయ్య
కలం: క్షపాకర,మహతి
వృత్తి: ప్రభుత్వ గణితోపాధ్యాయుడు
జన్మదినం: 03-02-1976
అభిజననం: రెడ్డిపల్లి,వీణవంక,కరీంనగర్
తల్లిదండ్రులు:అడిగొప్పుల కౌసల్యా-రామయ్య
ధర్మపత్ని: సరస్వతి
కుమారులు: అర్చిష్మాన్,మహతీనందన్
బిరుదులు: సహస్ర కవిమిత్ర, కవిచక్రవర్తి, విద్యాజ్యోతిరత్న,కళాసాగర,సాహితీ సేవాభూషణ,సాహితీచక్రవర్తి
ఇష్టపది నూతన కవితా ప్రక్రియ రూపకర్త
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం సాహితీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు
రచనలు: శ్రీ శ్రీనివాస శతకం(కందం),మనుచరిత్ర(ప్రథమ,ద్వితీయాశ్వాసాలు-ముత్యాలసరాలు),చంద్రకిరణాలు(అంత్యప్రాస),బాలసాహిత్యము(గేయాలు),అనామిక(ముత్యాలసర కావ్యం),పురుషోత్తమమాల(ఇష్టపదులు),వచనకవితలు,పద్యాలు మున్నగునవి
సంకలనాలు:
ఇష్టపది కవితాసంకలనం-2019,ఇష్టపది కవితాసంకలనం-2020,గాంధీజయంతి కవితాసంకలనం,కరోనా ఇష్టపది కవితాసంకలనం-2021, దాశరథి కృష్ణమాచార్య ఈ-కవితా సంకలనం,మనసుదోసినారె ఈ-కవితాసంకలనం,స్వతంత్రభారతం ఈ-కవితాసంకలనం,మహాత్మా ఈ-కవితాసంకలనం,గురుభ్యోనమః ఈ-కవితాసంకలనం,శ్రీమద్రామాయణం ఈ-కవితా సంకలనం,గణితం మూర్థనిస్థితయే ఈ-కవితాసంకలనం, పర్యావరణ పరిరక్షణ ఈ-కవితాసంకలనం,శ్రీ ప్లవనామ ఉగాది ఈ-కవితాసంకలనం, పి.వి.శతజయంతి ఈ-కవితాసంకలనం, మాతృదేవోభవ ఈ-కవితాసంకలనం, మున్నగునవి.
ఇష్టపది వారపత్రికలు(2019,2020)
ఇష్టపది బ్లాగు నిర్వహణ,ఇష్టపది FB సమూహం,ఇష్టపది వాట్సప్ సమూహాల నిర్వహణ.
పురస్కారాలు:
1.తెలుగు కవితావైభవం సంస్థ-హైదరాబాదు వారి సహస్రకవి
2.మల్లినాథసూరి కళాపీఠం-ఏడుపాయల వారి కవిచక్రవర్తి బిరుదు ప్రదానం
3.తెలుగు భారతి సాహితీసంస్థ వారి కాళోజీ పురస్కారం
4.కంకణాల జ్యోతిరాణి ఛారిటబుల్ సంస్థ వారి విద్యాజ్యోతిరత్న పురస్కారం
5.గోరసం వారి కళాసాగర పురస్కారం
6.మునియేటి రచయితల సంఘం-పెనుగంచిప్రోలు వారి సాహితీసేవాభూషణ పురస్కారం
మున్నగునవి...
ఈనాడు,గణేష్ ,అల,తెలంగాణా కేక,నవ తెలంగాణ, ప్రవాహిణి,తపస్వీ మనోహరం,మొలక,జనదీపిక,ఉదయం,పున్నమి మున్నగు పత్రికలలోనేగా అనేక సంకలనాలలో ఇష్టపదులు ప్రచురించబడ్డాయి.
మచ్చుకు కొన్ని ఇష్టపదులు:
1.సరస్వతీ ప్రార్థన:
కవి: డా.అడిగొప్పుల సదయ్య
శ్రీ వాణి! విధిరాణి! శ్రీ విద్య! గీర్వాణి!
సంగీత సాహిత్య సమలంకృతశ్రేణీ!
అజ్ఞాన హారిణీ! విజ్ఞాన కారిణీ!
కుసుమ పరిమళ వేణి! కుముద పుష్పాసనీ!
జ్ఞాన స్రోతస్విణీ! సకల వేదాగ్రణీ!
బాస,పుస్తక పాణి! బ్రాహ్మి! పారాయణీ!
శ్రీ!హంస వాహినీ! చిరు గంధ హాసినీ!
పలుకు పువ్వులబోణి! పరమ మేదావినీ!
అక్షమాలాధరిణి! ఆస్యసంవాసినీ!
సిత వస్త్రధారిణీ! అతిమధుర భాషిణీ!
2.ఏడుకొండలవాడికి వేడికోలు
కవి:డా.అడిగొప్పుల సదయ్య
వకుళమాతకు నిష్ట వరపుత్రుడవు నీవు
ఆకాశ భూపతికి అనుగల్లుడవు నీవు
పద్మావతీదేవి పతిదేవుడవు నీవు
ఏడు కొండల నిలిచి ఏలెదవు ధర నీవు
తొండమాన్ నరపతికి దండియాయుధమీవు
అన్నమాచార్యునకు ఆశు పదమువు నీవు
తరిగొండ వెంగమకు పరమిచ్చినది నీవు
అడిగొప్పులాన్వయపు ఆదిదైవము నీవు
3.శీర్షిక: శ్రీ హస్తము (ఇష్టపది మాలిక)
కవి: డా.అడిగొప్పుల సదయ్య
ఈ హస్తమేకదా ఇల కంసునెదపైన
పిడిగుద్దులను గుద్ది మడియించి కాచినది
ఈ హస్తమేకదా ఎల్లలోకాలపై
కాలనేమిని కప్పి కాపాడుతుండేది
ఈ హస్తమేకదా ఏడుకొండలు చేరు
భక్తులకు కరుణతో భరవసము నిచ్చేది
ఈ హస్తమేకదా ఇంద్రజునకుద్బోధ
చేసి సమరపు గీత గీసి నడిపించినది
ఈ హస్తమేకదా ఇభవల్లభుని గాచి
మకరి శిరమును నరికి మృత్యుపురమునకంపె
ఈ హస్తమేకదా ఎరచిమేపరులడచి
దేవతల,మునివరుల,దీనులను కాపాడు
ఈ హస్తమేకదా ఎసగి విశ్వముజొచ్చి
అరి దిప్పి జీవులకు నాయుస్సు నిచ్చేది
ఈ హస్తమేకదా ఇరుసుగా యిద్ధరణి
శకటమును నడిపించి జంతుతతి బోషించు
ఈ హస్తమేకదా ఎలనాగులా సాగి
కోవిడను విషక్రిమిని క్రోలునాహారంగ
ఈ హస్తమేకదా ఎగసి చక్రముదిప్పి
దావానలంబయ్యి దహియించు విషక్రిమిని
4.శీర్షిక: శ్రవణ ఇష్టపదిమాలిక
కవి : డా.అడిగొప్పుల సదయ్య
పార్వతీ రమణుండు పాపహరుడని వింటి
గర్వాంధకారులను కడతేర్చునని వింటి
కడలి మథనములోన గరము పుట్టుట వింటి
కుడిచి గళమున భవుడు నడిచె విషమని వింటి
కైలాసగిరినుండి కాపాడునని వింటి
పాలాభిషేకాల పరవశించని వింటి
నాగమే తన మెడన నగయౌట నొగివింటి
సితకరుడు తన తలన సిగయౌట మరివింటి
కాటిలో వాసమని కడు బాధతో వింటి
చితి బూది దాల్చునని చింతపడుచును వింటి
కట్టు బట్టలు లేని కడు పేదడని వింటి
జనని లేదని తనకు జనులనగ నేవింటి
తిరిపెమున తిండికై తిరుగుతాడనివింటి
మురిపెమున నిద్ధరణి మెరుపు తాననివింటి
తనువులో సగపాలు తన పడతిదని వింటి
మనసులో లోపాలు మడయించునని వింటి
సూర్యుండు,చంద్రుండు చూడ్కులని నేవింటి
అగ్నిగుండము నుదుటి యక్షిలోననివింటి
నందినెక్కియు వసుధ నంత జుట్టనివింటి
గంగనెత్తిన దాల్చి క్షమను కాచనివింటి
చిత్తజుని పొరిగొనిన చిత్తేశుడని వింటి
మత్తుతో గిరిపుత్రి మదిదోచుననివింటి
(ద్వాదశ జ్యోతిర్లింగాలు):
దివ్యలింగాలుగా దేవదేవుని వింటి
పన్నెండు పట్టాల పాటిల్లునని వింటి
సోముడారాధించు సోమేశ్వరుని వింటి
మహిమాన్వితంబైన మల్లికార్జుని వింటి
కరుణాలయుడు,మహా కాళేశ్వరుని వింటి
కమనీయ శబ్దమోం కారేశ్వరుని వింటి
వసుధ,సుధల పేటిక వైద్యనాథుని వింటి
భీతి బాధల తీర్చు భీమశంకరు వింటి
రమ్య సాగరతీర రామేశ్వరుని వింటి
నవనాడులను లేపు నాగేశ్వరుని వింటి
విమల భస్మాంగుండు విశ్వనాథుని వింటి
తక్షణమె ముక్తిచ్చు త్ర్యంబకేశ్వరు వింటి
ధరణీధరముల కే-దారేశ్వరుని వింటి
ఘన లింగ రూపుండు ఘృష్ణేశ్వరుని వింటి
(పంచ భూత లింగాలు):
పంచభూతపు లింగ ప్రాదేశముల వింటి:
అల చిదంబర లింగ మాకాశమని వింటి
కంచి యేకాంబరుడు క్షమ లింగమని వింటి
కాళహస్తీశుండు గాలి రూపని వింటి
జంబుకేశ్వరస్వామి జలలింగమని వింటి
అరుణాచలేశ్వరుడు అగ్నిరూపని వింటి
శూలి తానని వింటి,చూలి తానని వింటి
ఆలి హిమజని వింటి, మేలి వేల్పనివింటి
నటరాజు నా వింటి,నిటలాక్షుడని వింటి
కటకటలు తొలగించు కరుణాత్ముడని వింటి
తా నిత్యమని వింటి, తా సత్యమని వింటి
తా ముత్యమని వింటి,తా భత్యమని వింటి
తా ధర్మమని వింటి,తా మర్మమని వింటి
తా నర్మమని వింటి,తా కర్మమని వింటి
తా ముక్తి యని వింటి, తా రక్తి యని వింటి
తా నుక్తి యని వింటి, తా శక్తి యని వింటి
తా భోగమని వింటి,తా యోగమని వింటి
తా లోకమని వింటి, తా శ్లోకమని వింటి
ధరణి వెలసిన శ్రీ స-దానందుడని వింటి
వరములివ్వగ నేడు నరుదెంచునని వింటి...
5.శీర్షిక: ప్రియసతి
కవి: డా.అడిగొప్పుల సదయ్య
నాకంటి చూపులో నమలంపు కాంతీవె
నావొంటి జంత్రమును నడిపించు శక్తీవె
నాబతుకు నావలో నతుల చుక్కానీవె
నాహృదిన నెలకొన్న నందాల దేవీవె
నాజంట పులుగీవె, నాయింటి వెలుగీవె
నామదిని,నాహృదిని నలరించునదినీవె
నా భావి జీవితము,నా భావ లోకమును
నా భవన నిర్వాహ ణాధికారిణివీవె
ఏడేడు జన్మలకు జోడినీవే కావె?
నా సతీ!సరస్వతి! నాగుండె లయగతీ!
కడవరకు నాచేతి కర్రవై నిలవవే!
నెచ్చెలీ! నా తనువు నెత్తురై పారవే!!
శ్రీమతి గుడిపూడి రాధికారాణి,మచిలీపట్నం గారి ఇష్టపదులు:
6.ప్రభాతం
ఎల్లవారలకున్ను తెల్లవారినదోయి
కోవెలన మంత్రాలు కూరగాయల బళ్ళు
సందడులు వినవచ్చు సమయమే వచ్చెనోయ్
వేడి కాఫీ కొరకు వెచ్చనగు గది వీడి
కలలిచ్చు నిదురనే కట్టి పెడుదురు జనులు
ఇడ్డెన్ల అంగళ్ళు వడ్డింపు సందళ్ళు
ఆటోలు బస్సులకు పోటీలు మామూలు
కష్టాలు రాకుండ కావుమయ్యా కృష్ణ!
7.రాధ-కృష్ణ
నదినీటి నురగల్లె హృది తడిమిపోయావు
గలగలల సవ్వడై పులకింత రేపావు
నడిరేయి స్వప్నాన నవ్వుతూ కనబడగ
మెలకువన నినుగనక కలతచెందితి నేను
నీడల్లె తోడుగా నిమిషమైనా విడక
నాజతగ నీతలపు నన్నంటి నడిచేను
మరల దర్శనమెపుడు? మనము కలిసేదెపుడు?
రాధికా విరహమిది రమణీయమే కృష్ణ!
8.శీర్షిక:ఎంకి-నాయుడుబావ
ఎంకి నా తోడుంటె - ఏడేడు జన్మలకు
వెలుగుపూ రేకల్లె - వికసించిపోతాను
రైతుకూలీనైన - రాజోలె ఉంటాను
తమలపాకుల చిలక - తాజాగా చుట్టేసి
నాజూకు వేళ్ళతో - నా నోటికందించి
చిలకలా నవ్వింది - చిత్రాల నాయెంకి
ఒళ్ళోన కూకుంది - వయ్యారి నాయెంకి
రాధికకు చెపుతాను - రంజైన మా కథను.
9.శీర్షిక:రైతు
రతనాలు పండించు - రారాజు కద రైతు
కర్ణుడిని సరిపోలు - కరుణామయుడు రైతు
పొలము చూడాలంటు - పొరుగువారొస్తేను
నష్టాల్లొ తానున్న - నవ్వుతూ పళ్ళిచ్చి
తొలకరిన నడుమొంచి - తొలిపంట పండించి
దేశాన్ని బతికించు - దేవుడేరా రైతు
మట్టినే దేవుడని - మనసార నమ్ముతూ
ఆకలిని తీర్చేటి - అన్నదాతా నమో
10.శీర్షిక: రాత్రి
భాస్కరుని కిరణాలు - తస్కరించును రేయి
నల్లరేకుల కలువ - చల్లగా వికసించి
హాయైన స్వప్నాల - హాసమొసగిన రీతి
నీకనులు మెల్లగా - నిదురనే వరియించి
మోముపై శాంతమను - మోహమంత్రము వేసి
నేటి అలసట బాపి - కోటి ఆశలు మోసి
రేపటికి స్వాగతము - మాపటికి సాంత్వనము
ఇచ్చు చీకటి తెరలు - మెచ్చు రాధిక నేడు
శ్రీమతి ఎం వి ఉమాదేవి,నెల్లూరు గారి ఇష్టపదులు:
11.శీర్షిక -గోదావరి
కళకళల గోదారి కలహంస వలె నడిచి
ఋతువులో మెలుకువలె ఋషివలెను తెలిపింది
నిండుగా ప్రవహించి నిట్టూర్పు విడిచింది
కొండమలుపుల లోను కొంత నెమ్మదిగాను
జాలిగా పిలిచింది జాలరిని వేటలకు
పిల్లపాపల తోడ పిట్టలను దీవించు
గలగలా గోదారి గంపెడాశల నిచ్చు
ఉమాదేవి గీతము ఉడిపి కృష్ణుని వరము !
12.శీర్షిక -దేవులపల్లి కృష్ణశాస్త్రి
భావకవితల వీణ భారమై హృదిలోన
కృష్ణశాస్త్రి కలమున కృష్ణపక్షపుసోన
తాను కూర్చుపదాలు తన్మయ తరంగాలు
తొందరపడి కోయిల తోచక కూసిందని
మూగబోయిన గొంతు ముచ్చట్లు చెప్పినది
సామ్యవాదపు భావ సరళిగా సాగింది
తేటతెలుగు పాటగ తేనియల నొలికింది
ఉమాదేవి గీతము ఉడిపి కృష్ణుని వరము!
13.శీర్షిక -పత్రికా స్వేచ్ఛా దినోత్సవం
ప్రజాస్వామ్యమునకు ప్రధాన లక్షణములు
పత్రికలస్వేచ్చ పరిరక్షణము నందు
భావ ప్రకటన కొరకు భవ్యమే పత్రికలు
వాటి నోరుమూయగ వాటిల్లు విప్లవము
పాలనా లోపాలు పలుప్రజా సమస్యలు
పత్రికలపై దాడి పలు నిర్బంధాలును
మానివేసిన నాడె మానవత్వము గెలుపు
ఉమాదేవి గీతము ఉడిపి కృష్ణుని వరము !
14.శీర్షిక -చిన్ని చిన్ని బాతులు
చెరువులో ఉన్నాయి చిన్ని చిన్ని బాతులు
కరువుతీర యీదుతు కడుపు నిండు చేపలు
తల్లిబాతు ప్రక్కన తమ్ము విడువకుండును
బురదలో ముక్కుతో బుడ్డపక్కి పట్టును
ఒడ్డునే యెఱ్ఱలును ఒడుపుగా పట్టాయి
రెక్కలను విదిలించి రెల్లుపొద దాగాయి
గునగునా పిల్లలే గుంపులో కలిశాయి
పాదములు చీలికను పరమాత్మ యుంచెనుమ!
15.శీర్షిక: గురుతర బాధ్యత
సూర్యకిరణము వలెను సూటిగా ప్రసరించు
గురువు తరగతి గదిని గురుతర బాధ్యతలను
విద్యార్ధుల హృదయమున వివశతను కలిగించు
చిరునవ్వు సూక్తులను చిన్నవగు ప్రశ్నలను
జవాబులు రాబట్టి జాతీయ భావమును
బాల్యమునె వెలిగించు బహుమంచి మాస్టారు
ఇట్టి గురువర్యులకు ఇంటబైటను మెప్పు
కృష్ణ పరమాత్మయే కృపకోరె గురువులను !
16.రచన: డాక్టర్ అడిగొప్పుల సదయ్య
కార్మిక దేవా నమో!(ఇష్టపది మాలిక)
చెమట చుక్కలు విత్తి చెలకలను పండించి
అవని కడుపులు నింపు అన్నదాతా నమో!
తనువునింజను చేసి తపసుతో వస్త్రాలు
నేసి మానము గాచు నేతగాడా నమో!
అరచేత బ్రాణాల నెరి తాటి మొగిలెక్కి
కల్లు కుండలు దింపు గౌడవీరా నమో!
తిరిగి వచ్చెదనన్న భరవసము లేకున్న
భూగర్భ గనిజొచ్చు బొగ్గుకార్మిక నమో!
సతము చోదనమందు సరుకులను,యానికుల
పదిలంగ చేర్పించు వాహ్య చోదక నమో!
కురుమ! గోపాలకా! కుమ్మరీ!కమ్మరీ!
చాకలీ!మంగళీ! చర్మకారీ! నమో!
భట్రాజ! ముదిరాజ! భవనకార్మిక రాజ!
చలనచిత్రపు రంగ శ్రమవీరుడా నమో!
వేలాయుధము దాల్చి విద్యార్థులందరను
సన్మార్గమున నడుపు సత్త గురుడా నమో!
విశ్వ బ్రాహ్మణ నమో! విశ్వ కర్మా నమో!
యంత్రకారీ నమో! చిత్రకారీ నమో!
సకలకుల వృత్తులను సాదరించుతు జగతి
కల్యాణమున వరలు కర్మ దేవా నమో!
17.లింగ ఇష్టపదులు
కవి: డా.అడిగొప్పుల సదయ్య
కొండశిఖరముపైన కొలువున్న శివలింగ!
జగతి గతి తప్పినది జరిపించు పదిలంగ!
నగరాజు సిగనుండి దిగ దుమికె సిరి గంగ
పాపాల కడిగేయ ప్రజలంత మునుగంగ
సిగ నగై తొగరాజు ధగధగా మెరియంగ
ఇగకొండ వాసమై జగమేలు శివలింగ!
వీరగణములు నిన్ను చేరి నుతి గొలువంగ
నటరాజువై పూని నర్తించెదవు లింగ!
నీయాజ్ఞ లేనిదిల నేమి జరగదు లింగ!
విషక్రిమిని యెందుకిల విడిచితివి యిగురంగ
క్రిమినడచి మముగాచి కృపజూడు భసితాంగ!
నందివాహన లింగ! గంధ లేపన లింగ!
మాలింగ! మరు భంగ! మంగళాకృతి లింగ!
ఉత్తుంగ! ధవళాంగ! ఉత్తమోత్తమ జంగ!
18.రచన: డా.అడిగొప్పుల సదయ్య
శీర్షిక: కరోనా విలయ తాండవము
జడలు విప్పెనుకదా జగతిపై విషక్రిమి
విస్ఫులింగములవల విసరి యూపిరి తీయ
శ్వాసకోశములపై పాశసర్పము చుట్టి
మహిషవాహనుడల్లె మహిని విజృంభించె
ముళ్ళ నాలిక జాపి మెల్లగా మనుజులను
కాలగర్భములోకి కలుపుతూపోతోంది
ప్రాణవాయువు నాపి ప్రాణముల హరియిస్తు
పసిడి తరువులలోటు పరిహసించుతు చెప్పె
ముక్కు మూతుల రెండు మూసి మాస్కుల తొడుగు
కరములను గడిగడికి కడిగి లేపనమద్దు
కళ్ళనూ, ముక్కునూ కలియతిప్పకు నెపుడు
కాచుకొని కూచుండె కరోనా వాటిలో
ఆరునడుగుల దూరమవలంబనము చేసి
విషవాయు వలయమును విరిగేట్లుజేయాలి
భద్రతలు పాటించ పారిపోవును క్రిమి
మన బతుకు కలదిపుడు మన చేతనే సుమీ...
19.శ్రీరామ స్తుతి(ఇష్టపది మాలిక)
శ్రీరామ! జయరామ! శ్రీ దివ్య గుణధామ!
దశరథాత్మజ రామ! దశముఖాంతక రామ!
కౌసల్యసుత రామ! కరుణాంబుధీ రామ!
రఘుకులాన్వయ సోమ! రాఘవాఖ్యా! రామ!
జానకీధవ రామ! జన్మబంధన రామ!
లక్ష్మణాగ్రజ రామ! లంకనాశక రామ!
కోలభంజన రామ! కోదండధర రామ!
తాటకీ హర రామ! తామరాస్యా రామ!
క్రతు రక్షకా రామ! శ్రిత పోషకా రామ!
శ్రుత సుందరా రామ! మిత భాషకా రామ!
రజనీచర నాశక రాజితాయుధరామ!
రజనీకర సాదృశ రంజితాంబక రామ!
నీల మేఘశ్యామ! నిర్మలాత్మా రామ!
కపిరాజ నుత రామ! కదనభీమా రామ!
భద్రాద్రిపుర రామ! భద్రాత్మకా రామ!
సాకేతపుర రామ! సదయహృదయా రామ!
20.గృహనాయకుడు
కవి:డా.అడిగొప్పుల సదయ్య
అమ్మలో కుడిసగము, అర్థ సంపాదనము
పరివార పాలనము,పరుగులతొ జీవనము
కఠినత్వమున దాచు కరుణరస చెలిమలను
గుంభనమునను దాచు గుండెలో సలుపులను
ఇంటిల్లిపాదికిని ఇచ్ఛలను కడతేర్చి
తన కాంక్షలన్నిటిని తా పొదుపుగా మార్చు
ఆరోగ్య దాయకుడు ఆనంద వాయకుడు
ఆజీవ కాయకుడు అరివీర నాయకుడు
తన సంతునకు గురువు, తన యింటికిని తరువు
తన కులమునకు పరువు, తానె మోయును బరువు
త్యాగధనుడే తండ్రి,యాగ కర్తయె తండ్రి
ఇంటి యలుగే తండ్రి, కంటి వెలుగే తండ్రి...
సమాప్తం