బ్రతుకూ పూలబాట కాదుlllడా విడి రాజగోపాల్lll9505690690

బ్రతుకూ పూలబాట కాదుlllడా విడి రాజగోపాల్lll9505690690

బ్రతుకూ పూలబాట కాదు

నిన్నటి ఓ ఆమ్మ 
నేడు బామ్మగా ఎదిగింది
ఇంట్లో పెద్దోడు నడిపోడు చిన్నోడు
ఆపై మరో ఇద్దరు  అమ్మాయిలను  కనిపెంచింది  

పెనిమిటి తాను తాగేది విషమని
తెలుసుకొనేలోపు  
కాలేయము చేతులెత్తేసింది
ఇక నావల్ల కాదు 
నాటుసారా నన్నే తినేసింది
అని గుండెకు సారీ చెప్పింది
ఆ గుండె తనబలాన్ని 
తను  తాళి కట్టిన  నేస్తానికి 
బదిలీ చేసి తనూ ఆగిపోయింది

అందుకే రెండు గుండెల బలంతో 
వైధవ్యంతో జీవన పోరు సాగించింది
కాయాకష్టంతో ఐదుగురు పిల్లలను సాకింది

తాను పెంచిన చెట్లు వృక్షాలయినాయి
తానేమో పండుటాకయ్యింది
పచ్చదనం కోల్పోయింది
ఇక నీవు భారమని పొమ్మంది చెట్టు

తన పరిస్థితి ఇంచుమించు అంతే
అయితే జొన్నలు దంచిన  చేతులు
చెప్పుల ఆసరా లేక తిరిగిన కాళ్ళు
వెన్నెముక వంగిపోయినా
గుండె దిటవుగానే ఉంది
చర్మం ముడతలు పడినా 
ఎముకలు గట్టిగానే ఉన్నాయి

ఏదో నాలుగు ప్రమిదలమ్మి 
నాలుగు రూకలొస్తే
ఒక రూకతో తను కలో గంజో తాగి
తక్కిన మూడురూకలు 
పోగు చేసి పెద్ద మనవరాలుకు 
పెళ్ళీడు వచ్చింది కదా!
కనీసం  ముక్కుకు ఓ ముక్కెరైనా చేయిద్దామని అవ్వ తాపత్రయం

తాను అమ్మేది ప్రమిదలు
ఆ ప్రమిద తనకు వేడి తాకినా
వెలుగు నిచ్చు  ఇతరులకు
అందుకేనేమో తాను ఓ ప్రమిదగా మారింది

మనిషి పండుటాకయినా 
ప్రేమలు చావక 
అనుబంధాలు వీడక
ఆత్మీయతానురాగాలు 
ముడతల చర్మం మాటున దాగి
ఇంకా బతకాలని ఆశ
వీలైతే ముని మనుమల చూడాలని 
ఆరాటంతో జీవన పోరాటం చేసే 
ఓ ఎండుటాకా శభాష్!

డా విడి రాజగోపాల్
9505690690

0/Post a Comment/Comments