పెరిగి యుల్లోకాల సరిగ కొలిచియు బలిని
అణచి పాతాళముకు అంపివేసిన సామి!
అర్ణవంబును దాటి స్వర్ణలంకను చేరి
దశకంఠు మర్దించి ధరజ గాచిన సామి!
గోవర్ధనంబునే గొడుగుగా పైకెత్తి
గోత్రారి నరికట్టి గొల్ల గాచిన సామి!
పలు విధంబుల నిలా పరమేశు లీలలను
తనివితీరా నేను తలచుకొని ప్రార్ధింప
నాలోని జీవునకు నానందముప్పొంగి
పరవశంబును పొంది పరితృప్తిపడతాడు...
నవమాసములు మోసి నరకయాతనతొగని
నన్నపానములిచ్చి నడక నేర్పిన తల్లి!
లోకరీతులు తెలిపి, లోని గుట్టులు విరిచి,
విద్యలిచ్చియు బతుకు విలువ నేర్పిన తండ్రి!
సంస్కారవంతునిగ, సచ్ఛీలవంతునిగ
సరిగ తీర్చియు గొప్ప చదువు నేర్పిన గురువు!
పలు విధంబుల నేను ప్రత్యక్ష దేవతల
త్రికరణంబుల సతము తిరముగా కొలువగా
నాలోని జీవునకు నానందముప్పొంగి
పరవశంబును పొంది పరితృప్తిపడతాడు...
రమణీయ,కమనీయ రంజనపు క్షితిలోని
నగములును,నదములును నందంపు సృష్టిగన,
కనుల పండువునిచ్చు కర్ణామృతంబులగు
శుకములును,పికములును,శిఖుల సౌరులు కనగ,
అమృతంబులు గురియు ఆహారమును యిచ్చి
అమ్మలా నరుసుకొనె ఆలమందల కనగ
నాలోని జీవునకు నానందముప్పొంగి
పరవశంబును పొంది పరితృప్తి పడతాడు...
----------------------------------------------------------
ధరజ = సీత
గోత్రారి = ఇంద్రుడు
----------------------------------------------------------
కవిచక్రవర్తి
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
ఇష్టపది రూపకర్త
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
9963991125