తెలుగు భాష పై ఆంగ్ల భాష ఆధిపత్యం
తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా
*2019 డిసెంబర్27,28,29 విజయవాడలో జరిగివ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ప్రత్యేక సంచిక SOUVENIR లో ప్రచురణ*
మాతృభాష ఏదైనా దానిని పరిరక్షించ వలసి ఉంది. భాషా ప్రియులు, భాషాభిమానులు, సాహిత్య పరులు భాషను పరిరక్షించాలని కోరుతూ ఉంటారు, కృషి చేస్తుంటారు. ప్రపంచ భాషలన్నింటి మీద ప్రభావం చూపి ఆధిపత్యం చెలాయిస్తున్న భాష ఇంగ్లీష్ భాష. దీనికి కారణం ప్రస్తుతం ఇంటర్నెట్.
ఉద్యోగం కావాలంటే ఆధునిక విద్య అభ్యసించాలి. ఆధునిక విద్యలో పెత్తనం చేస్తున్న ఇంగ్లీష్ భాష నేర్చుకుంటేనే, కంప్యూటర్ నేర్చుకుంటేనే, ఇంటర్నెట్ వెబ్సైట్లోకి వెళ్ళగలిగితేనే, గూగుల్లో వెతకడం వస్తేనే, సోషల్ మీడియాలో వైరల్ అయితేనే, ఇంటర్నెట్ సేవల కోసం కొత్త కొత్త ఆవిష్కరణలు ఆవిష్కరిస్తూ ఉంటేనే ఈనాటి మనిషి జీవించగలుగుతాడు.
మన తెలుగు భాషను గురించి గమనిస్తూ ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలలో సాహితీ కులు చేస్తున్న కృషి వల్ల జాతరలలాగా సాహిత్య సభలు, కవిసమ్మేళనాలు, పత్ర సమర్పణలు, పద్యం - గద్యం రాస్తూ, గానం చేస్తూ, అవధానాలతో, అవధానాల శిక్షణా శిబిరాలతో తెలుగు భాష వెలిగిపోతుంది. ఉపాధ్యాయులు, చదువుకున్న జ్ఞానులు అనేకమంది రోజువారి కవితలు రాస్తున్నారు. అనేక వాట్సాప్ గ్రూపులలో వివిధ అంశాలు ఇచ్చి కవులతో కవితలు రాయిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాయి *నానిలు* లాగా *కైతి కాలు* పుట్టుకువచ్చి పుంఖానుపుంఖాలుగా రాయ బడుతున్నాయి. ఇప్పటికే కైతికాల విధానంలో అతి వేగంగా సంపుటాలకు సంపుటాలుగా ప్రచురింప బడుతున్నాయి. ప్రాథమిక పాఠశాల నుండి, హైస్కూల్, కాలేజీ, పీజీలు చేసే విద్యార్థులందరూ తెలుగులో కవిత్వం రాస్తూ తమ తమ కలాలను పదును పెడుతున్నారు ఇది ఒక శుభసూచకం.
తెలంగాణ ప్రభుత్వం 2017 డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించిన సాహిత్య సభ వల్ల సాహిత్యరంగంలో ఒక ఊపు వచ్చింది తెలంగాణ ప్రభుత్వం శ్రీ నందిని సిద్ధారెడ్డి గారిని తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులుగా చేయడం పుష్కలంగా నిధులు కేటాయించి విడుదల చేయడం వల్ల ఈనాడు తెలంగాణ లో తెలుగు సాహిత్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.
ఆంధ్రసాహితీ కులలో కూడా ఉత్తేజం ఉరకలు వేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సాహిత్య సభలను చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా పనిచేస్తున్నాయా అనిపిస్తోంది ఇది భాషా ప్రియులకు భాషాభిమానులకు భాష పరిరక్షకుల కు ఒక విధంగా సంతోషం కలిగిస్తున్న సందర్భం. రెండు తెలుగు రాష్ట్రాలు హాట్సాఫ్.
తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేయడానికి తెలుగు భాషను అందలం ఎక్కించడానికి నవతరానికి కథలు కవితలు నానీలు కైతికాలు రాయడానికి శిక్షణనిస్తూ ప్రోత్సహిస్తున్న సంస్థలు అనుభవజ్ఞులైన సాహిత్యకారులు తమ తమ కృషిని కొనసాగిస్తున్నారు. తెలుగులో రాస్తున్న నవతరానికి ఇది ఒక వరం.
తెలుగు సాహితీ పరులు ఆధునికతను అందిపుచ్చుకొని అంతర్జాలంలో తెలుగు భాష కోసం సేవ చేస్తున్నారు ఎలక్ట్రిక్ పరికరాల ద్వారా మనిషి చూసి చూసి విని విని చదివి చదివి ఓపిక నశించి షార్టులో చెప్పడం వినడం రాయడం అలవర్చుకున్న ఈ కాలంలో కవులు రచయితలు కూడా తమ తమ రచనలను కుదించి ప్రతిలిపిలో లక్షల్లో రాస్తున్నారు. భాష సజీవంగా ఉంచడానికి ఇది ఒక సాధనమయ్యింది రాసేవారు పాఠకుల నాడిని పరీక్షిస్తూ రాయడం ముదావహం ఒకవైపు తెలుగుభాష కోసం ఇలా కృషి జరుగుతుంటే మరొకవైపు ప్రభుత్వాలు ఆంగ్ల భాష బోధన భాషగా చేసి గురుకుల పాఠశాలలు నడుపుతుంటే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తెలుగులో తప్పులు లేకుండా మాట్లాడగలరా? రాయగలరా? తెలుగు సాహిత్యాన్ని ప్రేమిస్తూ తెలుగు భాష కోసం కృషి చేయగలరా అనేది విజ్ఞులు ఆలోచించవలసిన విషయాలు నిరాశ దరిచేరనీయకుండా భావితరాల భవిష్యత్ కోసం సిద్ధం చేసే ప్రణాళికలు రచించాలి. వాటిని అభివృద్ధి పరిచే మార్గాలను అన్వేషించాలి. అలా అయితే భావితరాలు తెలుగు భాష కోసం పాటుపడతారని ఆశించగలం.
*వ్యాసకర్త మహమ్మద్ అబ్దుల్ రషీద్ రచయిత అనువాదకుడు కవి*