మహిళలు, ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న మద్యపానాన్ని ఎందుకు నిషేధించరూ? అత్యాచారాలు, అకృత్యాలను అరికట్టడం ప్రభుత్వ బాధ్యత కాదా?
--- వడ్డేపల్లి మల్లేశము, 9014206412.
సమాజం సవ్యంగా సాగిపోవాలంటే వివక్షత, అంతరాలు, అసమానతలు, సామాజిక రుగ్మతలను సమాధి చేసి సామాన్య ప్రజలు కేంద్రంగా సుపరిపాలన కొనసాగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజల మాన ప్రాణాలను రక్షించడానికి, జీవించే హక్కును కాపాడుకునే క్రమంలో దేశంలో అనేక చట్టాలు చేయబడినప్పటికీ కొన్ని ప్రభుత్వ అసంబద్ధ విధానాల అమలు కారణంగా సమాజములో సంక్షోభం కొనసాగుతున్నది. అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దహన కాండలు, బలహీన వర్గాల పై దాడులు, పీడన వంటి దుష్పరిణామాలు పెద్ద మొత్తంలో సంభవిస్తున్నాయి.
వీటికి పౌర బాధ్యతతో పాటు ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు కూడా సమాజం చిన్నాభిన్నం కావడానికి ,యువత నిర్వీర్యం కావడానికి, అశాంతి ప్రబలడానికి కారణమవుతున్నాయి. ఇందులో మద్యపానం అమలు ప్రధాన అవరోధంగా చెప్పుకోవచ్చు.
మద్యపానం నిత్యజీవితంలో అనుభవాలు:
మద్యపానం వలన సంభవించే వికృత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కాబోలు దేశంలోనే తొలిసారిగా గుజరాత్ రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని ప్రకటించి ఇప్పటికీ అమలు చేస్తున్నారు. అయితే పక్క రాష్ట్రాలలో కొనసాగుతున్న కారణంగా అక్రమ రవాణా వలన గుజరాత్ రాష్ట్రం లోనూ అమలు నీరుగారి పోతున్నది అనడంలో సందేహం లేదు. కనుక దేశవ్యాప్తంగా అమలు అయినట్లయితే మాత్రమే పూర్తి స్థాయిలో ఫలితాలను పొందగలం. ఇది ఒక అంశం . దేశవ్యాప్తంగా అక్కడక్కడా జరుగుతున్నటువంటి అత్యాచారాలు అకృత్యాలకు సంబంధించి ముఖ్యంగా ఢిల్లీలో ,ఉత్తరప్రదేశ్ హత్రాష్, హైదరాబాదులో గత సంవత్సరం దిశ, ఇటీవలికాలంలో హైదరాబాదులోని సింగరేణి కాలనీ లో ఆరు సంవత్సరాల అమ్మాయి అత్యాచారం హత్య వంటి సంఘటనలు కోకొల్లలు. ఈ వారంలోనే నల్లగొండ జిల్లా ముశంపల్లి లో 54 సంవత్సరాల మహిళపై అత్యాచారం హత్య సంఘటన సందర్భంగా పెద్ద మొత్తములో మహిళా సంఘాలు హంతకులను ఉరి తీయాలని డిమాండ్ తో పాటు మద్యపానాన్ని నిషేధించాలని పెద్దఎత్తున ఉద్యమించిన సంఘటన మన అందరికీ తెలిసినదే.
ఢిల్లీ నిర్భయ, హైదరాబాద్ దిశ రెండు సందర్భాల్లోనూ ప్రత్యేక చట్టాలు వచ్చినప్పటికీ ఇలాంటి అకృత్యాలకు మూలాలను నిర్మూలించే క్రమంలో ప్రభుత్వాలు విఫలం అయినాయి. పత్రికలకు ఎక్కని, ప్రభుత్వ దృష్టికి రాని ఇలాంటి అకృత్యాలు రోజు జరుగుతూనే ఉన్నాయి.
సైకాలజిస్ట్లు, సామాజిక కార్యకర్తలు ఏం చెబుతున్నారు:
అనాదిగా, ఇటీవలికాలంలో జరిగినటువంటి సమాజం సిగ్గుతో తలవంచుకునే సంఘటనలకు కారణాలను విశ్లేషిస్తూ వారు మద్యపానాన్ని తక్షణమే నిషేధించాలని అనేక అనర్థాలకు కారణమవుతుందని నొక్కి చెప్పారు. పేదరికము, అంతరాలు, వివక్షత బానిసత్వము, అవమానాలు ,సంచార జీవితము, అమాయకత్వము కూడా ప్రధానమైన కారణాలు అని వీటిని నిర్మూలించే దిశగా ప్రభుత్వం చర్యలు ఉండాలని సూచించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లా దూబగుంటకు లో 1994లో మద్యపాన నిషేధం కోరుతూ తొలిసారిగా సారా నిషేధం ఉద్యమాన్ని ప్రారంభిస్తే రాష్ట్రవ్యాప్తంగా అంటుకొని నాటి ముఖ్యమంత్రి మద్యపానాన్ని నిషేధించి ఉత్తర్వులు జారీ చేశాడు. తరువాతి కాలంలో వచ్చిన ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయని కారణంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ మద్యపానం విచ్చలవిడిగా ఏరులై పారుతుంది. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం ప్రధాన కారణం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరు:
తెలంగాణలో ఎన్నో సంఘటనలు జరిగి ప్రజలు, మహిళలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం ఏనాడు నోరు మెదపలేదు. మద్యపానం వల్ల జరిగే వికృత పరిణామాలను ప్రభుత్వం మాటవరసకి కూడా అంగీకరించలేదు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాటికి ఏటా 10 వేల కోట్లు ఉన్న ఆదాయం 2021 నాటికి 36 వేల కోట్లకు పెరిగిపోయింది. మద్యపానాన్ని అమలు చేస్తూ విచ్చలవిడిగా ప్రజలకు అందుబాటులో ఉంచడమే కాకుండా గ్రామ ప్రాంతాలలో బెల్టుషాపుల పై ఎలాంటి నిఘా లేని కారణంగా ప్రజలు మద్యం మత్తులోనే ఊగుతున్నారు. మద్యాన్ని అందుబాటులో ఉంచిన ప్రభుత్వం మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాల పేరుతో కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ ద్వంద్వ వైఖరిని అమలు చేస్తున్న ప్రభుత్వం అత్యాచారాలు అకృత్యాల నివారణ లో మాత్రం మూగధై ప్రస్తుత స్థితికి సజీవ సాక్ష్యంగా మిగిలిపోయింది.
"మద్యం తాగి వాహనం నడిపితే నేరమైతే ప్రజలు తాగిన మద్యం వల్ల వచ్చిన ఆదాయంతో పరిపాలన చేస్తున్న ప్రభుత్వానిది నేరం కాదా?"
మద్యపానం వల్ల జరుగుతున్న కొన్ని అనర్థాలు:
దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావలసిన యువత నిరుద్యోగం పేదరికం వంటి సమస్యలతో ప్రభుత్వాలు యువతను పట్టించుకోని కారణంగా మద్యానికి మత్తుమందులకు బానిసై అనారోగ్యం పాలై యువత నిర్వీర్యం అవుతున్నా ప్రభుత్వం చోద్యంగా చూస్తున్నది.
మద్యం మత్తులో హత్య చేసే, వాళ్ళు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, గృహ ఆస్తి దారుణాలకు పాల్పడేవారు, కుటుంబ సభ్యులను కనపడిన వారిని తెగ నరికి చంపిన వాళ్ళు, అత్యాచారం చేసి జీవితాలను బుగ్గి చేసినా తాత్కాలిక చర్యలే తప్ప ప్రభుత్వాలకు ఇవేవీ కనబడడం లేదు.
పైగా ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం మద్యం షాపుల వేలం లో కూడా గౌడ కులస్తులకు 15 శాతం ఎస్సీలకు 10 శాతం ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ ప్రకటిస్తూ చేసిన నిర్ణయం ప్రజల డిమాండ్ను మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నది.
ప్రజలు మహిళా సంఘాల డిమాండ్ ఏమిటి:
ఈ వారంలో జరిగిన నల్లగొండ జిల్లా ముషం పల్లి లో జరిగిన స్త్రీ హత్య అత్యాచారం ,హైదరాబాద్ సింగరేణి కాలనీ లో ఆరు సంవత్సరాల అమ్మాయి అత్యాచారం హత్య ఇతరత్రా జరిగిన సంఘటనల నేపథ్యంలో అక్కడ గుమిగూడిన మహిళలు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున మద్యపాన నిషేధానికి డిమాండ్ చేసి ప్రభుత్వాన్ని ఆలోచింప చేసినవి. ముషం పల్లి ఘటనకు సంబంధించి తన తల్లిని చంపిన నేరస్తులను తమకు పిస్తోలు ఇస్తే కాల్చి చంపుతామని కూతురు ఆవేశంతో ఆవేదనతో మాట్లాడిన మాటలు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితికి అద్దం పడుతున్నవి.
ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి ప్రభుత్వం వెంటనే మద్యపానం నిషేధించడం తో పాటు మత్తు పానీయాలు మత్తుపదార్థాలు అశ్లీల ప్రదర్శనలు వెంటనే ఆపి వేస్తూ నిర్ణయం తీసుకోవాలి. మహిళల రక్షణకు సామాజిక రుగ్మతలను నివారించడానికి వివిధ వర్గాల మేధావులతో వెంటనే కమిటీ వేసి నిర్బంధ కార్యక్రమాలను నిబద్ధత గా అమలుపరచాలి. యువత నిర్వీర్యమై పోకుండా మహిళలపై అకృత్యాలు జరగకుండా ఉండాలంటే మద్యపాన నిషేధం తప్పనిసరి.
ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి:
ఇప్పటివరకు ప్రభుత్వం మద్యపానం విషయంలో తన స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు. మౌనంగా ఉంటే ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు. పరిస్థితులు చేయి దాటకముందే ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఉత్తమ సమాజ నిర్మాణానికి కఠిన చర్యలు ప్రకటించాలి. మద్యపానం తో వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని పరిపాలించడానికి పూనుకోవడం చాలా అవమానకరం.
రైతుబంధు పేరుతో కోట్లాది రూపాయలు ఉన్నత వర్గాలకు కట్టబడుతున్న ప్రభుత్వం అమలు కాని అవసరం లేనటువంటి శాస్త్రీయము కానీ దళిత బంధు పేరున కోట్లాది రూపాయలు వృధా చేస్తున్న ప్రభుత్వం ప్రజల మేలు కోసం సమాజ సంక్షేమం కోసం శాంతిభద్రతల పరిరక్షణ కోసం మద్యపానాన్ని నిషేధించ లేదా?
ఈ వారంలో జరిగిన సంఘటనలతో కోపోద్రిక్తులైన మహిళలు కొన్నిచోట్ల మద్యం షాపుల పై దాడి చేసి సీసాలను పగలగొట్టి నారు. ప్రభుత్వమే స్వచ్ఛందంగా నిషేధం విధించక పోతే ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతాయి. అప్పుడు ప్రభుత్వమే బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది. కనుక అంత వరదాకా రాకుండా సమీక్ష చేయాలి. మహిళా ప్రజా సంఘాలు, బుద్ధి జీవులు, మేధావులు, సైకాలజిస్టులు, సామాజిక కార్యకర్తలతో ఆచరణ సాధ్యమైన అమలుకోసం నూతన మార్పుకోసం చర్చించడమే ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వేస్తోందని ఆశిద్దాం.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత, హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట, తెలంగాణ రాష్ట్రం.)