తెలంగాణ నిప్పు కణిక...!
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ) ఖమ్మం
పుట్టుక నీది ...చావు నీది
బతుకంతా దేశానికి అన్న
మట్టి మనుషుల గొంతుక
ప్రజా ఉద్యమ జ్వాలిక
పీడిత ప్రజల యుద్ధనౌక...!
తెలంగాణ భావజాల విశ్వ రూపం
పౌరుషానికి నిలువెత్తు రూపం
తెలంగాణ పోరాట దిక్కార స్వరం
రాజకీయ ఖద్దరుపై యుద్ధం చేసిన కంఠస్వరం
హక్కుల కోసం పిడికి లెత్తిన ధైర్యం...!
తెలంగాణ ప్రజల తొలి ఉషస్సు
పోరుగల్లు ఉద్యమ ఉరుమైన తేజస్సు
మేలు కొలువు కాలజ్ఞాని
న్యాయం కోసం నిలిచిన మహర్షి...!
బడిపలుకుల భాష కాదు
పలుకుబడుల భాష మనదని
యాస భాషల అస్థిత్వాన్నిఎలుగెత్తిన అక్షర మాల...!
ఆలోచన ,ఆచరణ కలగలిపిన రూపం
ఆంధ్ర పెత్తనం పై ఎత్తిన నిరసన గళం...!
ప్రజల గొడవే నా గొడవన్న ప్రజాకవి
తెలుగింటి వెలుగు రేఖ
తెలంగాణ నిప్పు కణిక
అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడన్న
రమాబాయమ్మ రంగారావుల
ముద్దు బిడ్డ మన కాళన్న...!