కొందరు జీవితాంతం తమ కోసమే బ్రతికితే మరికొందరు జీవితాంతం ప్రజల కోసం, వ్యవస్థ కోసమే బ్రతుకుతారు. రెండవ కోవకు చెందిన వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి కొండంత అండ తెలంగాణ ఆత్మగౌరవ పతాక కొండా లక్ష్మణ్ బాపూజీ.
సామాజిక సేవా రంగం:
తెలంగాణ ప్రాంతంలో బాపూజీ గా పిలువబడే కొండాలక్ష్మణ్ తన జీవిత కాలంలో ఏ రంగాన్ని కూడా వదలలేదు. జీవితంలో ఎన్ని విజయాలు ఉన్నాయో అంతకుమించిన అపజయాలు కూడా ఉన్నాయి. ఎదగడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా దొడ్డిదారిన కాకుండా వ్యవస్థ కోసం తెలంగాణ కోసం ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అనేక సార్లు ముఖ్యమంత్రి పదవి కూడా వదులుకున్నాడు.
బహుజనులైన ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ వర్గాల నుండి యువతరం నాయకులు రాజకీయాల్లోకి రావాలని బాగా ఆశించేవాడు. అయితే గ్రూపు రాజకీయాలు, కులవివక్ష పెరిగిపోవడంతో ముఖ్యంగా బీసీ వర్గాలు ఎదగక పోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఈ వర్గాలకు రాజ్యాధికారం దక్కాలనేది ఆయన చిరకాల వాంఛ.
ఎన్నో కుల సంఘాలకు సహకార సంఘాలకు మార్గదర్శకత్వం వహించిన బాపూజీ దళిత సంఘాలకు నిరంతరం మద్దతిచ్చి ముందుకు సాగే వాడు. సంఘాల రిజిస్ట్రేషన్లు, రిజర్వేషన్లు, కుల వృత్తి సహకార సంఘాలకు సబ్సిడీలు, రాయితీలు చేనేత అభివృద్ధి, దళితుల హక్కుల వంటి అంశాలలో అనేక కార్యక్రమాలు చేపట్టి ఆ వర్గాలకు అండగా ఉన్నారు. బహుజనులు అన్ని రంగాలలో సాధికారత సాధించాలని ఆశించిన బాపూజీ అందుకు విద్య మార్గమని విద్యని అందుకోవడానికి హాస్టల్ సౌకర్యాల కోసం పద్మశాలీల తోపాటు అనేక కులాల వారికి హాస్టల్ సౌకర్యాలను సమకూర్చడంలో కృషి చేశారు.
నిజాయితీ, దిక్కార స్వరం:
స్వాతంత్ర సమరయోధుల సంఘానికి అధ్యక్షులుగా నియమించినప్పుడు నిజాయితీగా ఎవరైతే నిజాముకు వ్యతిరేకంగా ఉద్యమించారో వారి కేసులను పరిష్కరించడమే కాకుండా కొడుకు ను భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పైలెట్ గా పంపిస్తే, తన భార్య డాక్టర్ గా యుద్ధంలో క్షతగాత్రులకు సేవలందించారు.
- 1987లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ సిఫారసులను వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కొండా లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తన ధిక్కార స్వరాన్ని వినిపించారు.
- 1977 ఎన్నికల్లో శాసనసభ్యునిగా గెలిచి మంత్రి పదవి దక్కిన ప్పటికీ ఉమ్మడి రాష్ట్రాన్ని రాష్ట్ర పాలనను వ్యతిరేకించారు. 1969 లో తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ కోసం 1969 మార్చి 27న ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వారించినా తెలంగాణ ఆత్మగౌరవం కోసం వెనక్కు తగ్గక పదవిని త్యాగం చేసిన ధన్యజీవి.
- మంత్రి పదవి త్యాగం చేసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపింది.
బాల్యం ,ఉద్యమ ప్రస్థానం:
ఆదిలాబాద్ జిల్లా వాంకిడి లో 1915 సెప్టెంబర్ 27వ తేదీన మధ్యతరగతి చేనేత కుటుంబంలో కొండాలక్ష్మణ్ జన్మించారు. చిన్నతనంలోనే ధిక్కార స్వరాన్ని సొంతం చేసుకున్న ఆయనకు పోరాట దృక్పథం అలవడింది. విద్యార్థిదశలో గ్రామంలో మూఢనమ్మకాలను వ్యతిరేకించడంతో పాటు యువజన సంఘాలను ఏర్పాటు చేశారు. 1930 లో మహారాష్ట్ర పరిధిలోని రాజు రా గ్రామానికి గాంధీ వస్తున్నట్లు తెలిసి కాలినడకన 15 మైళ్ళు ప్రయాణం చేశారు.
నిజాం రాజు గాంధీ సభకు వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించినప్పటికీ సైన్యం కంట పడకుండా రహస్యంగా హాజరై గాంధీని కలిసి ఆయన వెంటనే తిరిగి టోపీ ధరించి నందుకు నిజాం సైనికులు ఆయనను అరెస్టు చేసి హెచ్చరించి వదిలారు.
అప్పటి నుండి పోరాట ఫంథానే కొనసాగించిన ఆయన 1938లో హైదరాబాద్లో జరిగిన పౌర ఉద్యమం, మహాసభల్లో పాల్గొన్నందుకు అరెస్టు చేశారు. 1940లో ఆంధ్రమహాసభ ద్వారా ఖద్దరు చేనేత వస్త్రాల ప్రచారం చేపట్టి స్వయంగా తిరిగి వస్త్రాలు అమ్మినారు. వందేమాతర ఉద్యమం తో పాటు 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా పోరాట పటిమతో ఆబిడ్స్లోని బ్రిటిష్ పోస్ట్ ఆఫీస్ పై, కోఠీలోని బ్రిటిష్ రెసిడెన్సీ పై జెండా ఎగురవేసి తన సత్తాను చాటుకున్నారు.
ఒకవైపు బ్రిటిష్ పాలన పైన మరోవైపు నిజాం పాలన పైన గళాన్ని వినిపించడంతో పాటు, విస్నూరు ప్రాంతములో చాకలి ఐలమ్మ తదితరులపై కుట్రకేసు బనాయించిన సందర్భంలో ఉచితంగా వారి కేసును వాదించి నిర్బంధము నుండి విముక్తి కల్పించారు. తెలంగాణ ఉద్యమం, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన వారికి మద్దతుగా న్యాయవాదిగా న్యాయ సహాయాన్ని ఉచితంగా అందించారు.
రాజకీయ జీవితం ప్రజా రంగం:
పలు ఉద్యమాలలో కీలకంగా పాల్గొనడం వలన 1952 నాటికి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. తొలి సాధారణ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి, 1957లో నల్లగొండ జిల్లా చిన్న కొండూరు నుంచి ఎన్నికకాగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి గా ఆయనను ఎన్నుకో గా 60 వరకు ఆ పదవిలో కొనసాగారు. 67 లో భువనగిరి నుంచి ఎన్నికై మంత్రిగా పదవి పొందినప్పటికీ తెలంగాణ కోసం రాజీనామా చేసిన త్యాగశీలి.
1972లో తిరిగి భువనగిరి నుంచి గెలిచి నప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆయన పేరును ముఖ్యమంత్రి పదవికి రెండుసార్లు పరిశీలించినప్పటికీ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కంటే తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని కేంద్రానికి చెప్పడంతో ఆయనకు ముఖ్య మంత్రి పదవి దక్కలేదు. సంజీవయ్య బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాలలో మంచిగా పని చేసినప్పుడు వెనుకబడిన వర్గాలకు ఆయన ఎంతో అండగా ఉండేవారు.
1953లో కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన కులాల చేతివృత్తుల అధ్యయనానికి కమిటీని నియమించిన ప్పుడు కొండాలక్ష్మణ్ అప్పటి రాష్ట్రంలోని బీసీల స్థితిగతులపై నివేదిక రూపొందించి సమర్పించారు. నాటి కర్ణాటక ముఖ్యమంత్రి దేవరాజ్ ఆర్స్ తో కలిసి బెంగళూరులో అఖిలభారత బీసీ మహాసభను 1971లో నిర్వహించి నిర్వహించిన ప్పుడు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాని ఇందిరా తిరిగి బీసీ కమిషన్ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
ముగింపు:
ఆయన సేవా దృక్పథం, ఉద్యమ ప్రస్థానాన్ని, రాజకీయ జీవిత ప్రజా ఉద్యమాన్ని పేర్కొనడానికి ఒక వ్యాసం సరిపోదు . పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్య జీవించిన ఆయన నుండి నేటి రాజకీయ నాయకులు ఎన్నో గుణ పాఠాలు నేర్చుకోవాల్సి ఉన్నది. సమస్యలను తెలుసుకోవడానికి తెలుగు రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించిన తొలి ప్రజా ప్రతినిధి ఆయనే. 1961 లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు నల్లగొండ జిల్లాలో 220 కిలోమీటర్ల పాదయాత్ర చేయడంతోపాటు చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలిచావులు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి భరోసానిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పనిచేసిన ఆయన అహింసాయుత పద్ధతిలోనే రాష్ట్ర సాధన జరగాలని ఆకాంక్షించారు.
ఐదు సార్లు ప్రజాప్రతినిధిగా రెండు సార్లు మంత్రిగా నిరాడంబరంగా పనిచేసి తన నివాసం జలదృశ్యాన్ని భిన్న వర్గాలకు ఉద్యమ వేదికగా సమ కూర్చు కున్నారు. 96 ఏళ్ల వయస్సులో ఆయన ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయడంతోపాటు తెలంగాణ సాకారం కాకముందే 2012 సెప్టెంబర్ 21న దీర్ఘ వయస్సులో తనువు చాలించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ వారిని గుర్తించకపోయినా చనిపోయిన తర్వాత వారి శత జయంతిని 2015 లో అధికారికంగా నిర్వహించడంతోపాటు జయంతి వర్ధంతి లను కూడా ప్రభుత్వం నిర్వహిస్తూ హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి వారి పేరును పెట్టడం మనందరికీ గర్వకారణమే.
పద్మశాలీల తోపాటు వెనుకబడిన వర్గాల కోసం కృషి చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరున ఒక సంస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆయన శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేయడం బహుజనులకు గౌరవప్రదమైన ది. చేనేత పద్మశాలి కులంలో పుట్టినప్పటికీ బహుజనుల కోసం, తెలంగాణ సాధన కోసం జీవించిన ఆయన స్మృతి కార్యక్రమాలలో అన్ని వర్గాల వారు పాల్గొని నివాళి అర్పించడం తో పాటు నేటి ప్రజా ప్రతినిధులు, రాజకీయ పక్షాల నాయకులు, యువత , ప్రభుత్వాలు కూడా స్ఫూర్తిని పొంది సామాజిక తెలంగాణ సాకారం చేయడంలో హృదయపూర్వకంగా పాల్గోవాలని ఆశిద్దాం.వారి నివాసo జలదృశ్యమే నేటి trs పార్టీ కార్యాలయంగా కొనసాగుతున్నవిషాయాన్ని ఆంధరు అర్థించాలి.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, అధ్యక్షులు జాగృతి కళాసమితి, హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట.)