ఇంపైన రీతిలో గద్వాల కవితలు
....................................................
ఆధునిక తెలుగు సాహిత్యంలో నేడు రకరకాల కవితా ప్రక్రియలు పుట్టుకొస్తున్నాయి. అందులో కొన్నిటికి విశేష స్పందన లభిస్తోంది. అలా జనహృదయాల్లో నిలిచిపోయిన వాటిలో మణిపూసల రూపం ఒకటి. వడిచర్ల సత్యం సృష్టించిన మణిపూసలు మాత్రా ఛందస్సు నియమాలతో కూడిన లఘు కవిత. ఈ ప్రక్రియను ఇటీవలి కాలంలో ఎందరో కవులు అనుసరిస్తున్నారు. పుస్తకాలను ముద్రిస్తున్నారు. ఆ వరసులలోనే బాలసాహితీవేత్త, ఉపాధ్యాయుడు గద్వాల సోమన్న కూడా "గద్వాల మణిపూసలు" అనే చక్కని పుస్తకాన్ని తీసుకువచ్చారు.
గద్వాల సోమన్న వృత్తిరీత్యా గణిత ఉపాధ్యాయుడైనప్పటికీ, ప్రవృత్తి రీత్యా మంచి సాహితీవేత్త. ఇప్పటికే అనేక బాలగేయాలు, కవితలు రాసి, బాలసాహితీవేత్తగా మంచి గుర్తింపును తెచ్చుకున్న సోమన్న కలం నుండి జాలువారిన ఆణిముత్యాలే ప్రవాహమే "గద్వాల మణిపూసలు". ఇంపైన పదజాలంతో, సరళమైన భావంతో మనసును రంజింపజేసి మంత్రముగ్దులను చేసే విధంగా ఈ మణిపూసలను తీర్చిదిద్దారు. నవకవులకు మార్గదర్శకంగా నిలిచిన గద్వాల మణిపూసల నుండి మచ్చుకు కొన్ని పరిశీలిద్దాం.
"భగవంతుని కానుక
వెలుగునిచ్చె తారక
దేవత ప్రతిరూపమే
ఇంటిలోని బాలిక!"
ఆడపిల్ల భగవంతుడిచ్చిన కానుక, ఆకాశంలోని తారక వలె ఆడపిల్ల మన ఇంటికి వెలుగును పంచుంతుందని, అంతే కాదు అమ్మాయి దేవతకు మరో రూపమని చెప్పిన భావం బాగుంది. అందుకే ఆడపిల్ల వున్న ఇంటి యొక్క కళే వేరు అంటారు పెద్దలు.
"బాల్యమే గొప్ప వరం
కాదనుట ఎవరి తరం
బాల్యదశ బ్రతుకులో
అత్యంత మనోహరం!"
అంటూ బాల్యం గురించి ఉన్నదున్నట్లుగా సూటిగా నొక్కివక్కాణించారు. జీవితంలో ఎవరికైనా మరుపురాని బాల్యదశకున్న గొప్పతనం మనస్సును ఆకట్టుకునేలా బాగా చెప్పారు.
"పరభాష పై మోజు
దులుపుకో ఆ బూజు
తెలుగు పరిరక్షణకై
పెంచుకొనుమిక మోజు!"
అంటూ మాతృభాష పై తనకున్న అభిమానాన్ని చాటడమే కాక మన మాతృ భాష అయిన తెలుగు అంతరించి పోకుండా, కాపాడుకొనడం పై అందరూ ప్రత్యేక దృష్టి పెట్టాలని, పర భాషపై అతి వ్యామోహం మంచి కాదని చెబుతున్నారు.
"కుటుంబాన విషాదం
నింపుతుంది ప్రమాదం
అతివేగము తగ్గించు
జీవితమిక ప్రమోదం!"
అతివేగం వలన కలిగే అనర్థాల్ని, రోడ్డు ప్రమాదం కుటుంబంలో ఎంతటి విషాదాన్ని కలిగిస్తుందో ఈ చిన్ని మణిపూస ద్వారా చూపిన తీరు ఆలోచింపజేసేలా ఉంది. ముఖ్యంగా ప్రయాణ సమయంలో "నిదానమే ప్రధానం" అనే సూక్తిని ఎవ్వరూ మరువకూడదు.
ఇంకా ఈ "గద్వాల మణిపూసలు" సంపుటిలో... గిట్టుబాటు ధరలేక రైతులు పడుతున్న దీనస్థితిని మన కళ్లముందుచాడు. పిల్లల ఊహా ప్రపంచంలోకి వెళ్లి మొక్కలు, చుక్కలు, జల్లులు అంటూ శ్రీ శ్రీ కవిత్వాన్ని గుర్తుకు తెచ్చారు. మంచి మాటలు వెన్నెకన్న మిన్న అంటూ హితవు పలికారు. చింత పెద్ద తంట అని, అది మనిషిని కృంగదీస్తుందన్నారు. ఓర్పు నేర్పు కలిగి ఆత్మవిశ్వాసంతో ఉంటె విజయాన్ని సాధించవచ్చు అంటారు. అత్యాశ వద్దని హితవు పలికాడు.
సినారె, శ్రీశ్రీ గురించి చెప్పిన మణిపూసలు, యువశక్తి దేశానికి శక్తి అని చాటుతూ రాసిన మణిపూసలు అందంగా బాగున్నాయి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కావాలని ఆశించారు. స్నేహానికి సాటి ఏది రాదని స్నేహాస్తం అందించారు. బ్రతుకున నవ్వుల పువ్వులు ఆనందాలన్నీ రువ్వు తాయని అన్నారు. కోపాన్ని అదుపు చేస్తే, జీవితం సాఫీగా సాగుతుందని మరో మణిపూసలో వర్ణించారు. "సహస్ర మణిపూసల కవిభూషణ" బిరుదు పొందిన గద్వాల సోమన్న కలం నుండి మరిన్ని అద్భుత రచనలు, బాలసాహిత్య గేయాలు రావాలని ఆశిద్దాం. గద్వాల మణిపూసలు పుస్తకం వెల. 30 రూపాయలు
ప్రతులకు..
గద్వాల సోమన్న
1-1583, గాంధీ నగర్
ఎమ్మిగనూరు, కర్నూల్
చరవాణి. 9966414580
కందుకూరి భాస్కర్
9703487088