బంగారు బతుకమ్మ
డా.. కందేపి రాణీప్రసాద్.
సాధారణంగా మనం జరుపుకునే పండుగలన్నీ చెడుపై మంచి సాధించే విజయాలకు గుర్తుగా చేసుకునేవే. 'దుష్టశిక్షణ ' కొరకై దేవుడు ఎత్తే అవతారాలను అంటే పౌరాణిక గాధల నుండి పుట్టుకొచ్చిన పండుగలనే జరుపుకుంటాము. ఇంకా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు కరువు కాటకాలు తాండవమాడినపుడు అంటువ్యాధులు ప్రబలినపుడు వీటిని ఆయా దేవుళ్ళ అగ్రహా దేశాలుగా భావించి వాటికీ ఉపశాంతి కొరకు పూజలు చెయ్యడం కూడా పరిపాటే. మనిషి జీవించడానికి ఆహారం ప్రధానం కాబట్టి వ్యవసాయ పనుల్లో కూడా కొన్ని పండగలు జరుపుకుంటారు. ఏ పూజలు అయినా ముఉల విరాట్ శక్తి అది పరాశక్తే. ప్రాచిన కాలాల్లో మాతృస్వామ్య వ్యవస్థే కొనసాగేది. స్త్రీని ఆశ్రయించుకునే కుటుంబ వ్యవస్థ నడిచేది. మనిషికి వచ్చిన చాలా కష్టాలకు ఓదార్పు గా దేవతా మూర్తులే కరుణించేవారు. అందరూ శక్తి మాత రూపాలే . గ్రామాల్లోకి అంటువ్యాధులు రాకుండా ఉండాలని ఊరి పొలిమేరల్లోనే మైసమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, పోచమ్మ వంటి దేవతలను గ్రామీణులు ప్రతిష్టించి పూజలు చేసేవాళ్ళు. అలాగే పుట్టిన పిల్లలు మరణించకుండా చల్లగా బతుకు సాగించాలని 'బతుకమ్మ' అనే ఒక దేవతను సృష్టించుకున్నారు జానపదులు. ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో మమేకమే తమ జీవితం ప్రకృతిలోనే సాగిస్తున్న పల్లె ప్రజలు, ఆ ప్రకృతి లోని పువ్వుల తోనే ఒక పండుగను రూపొందించుకొని ఆనందిస్తున్నారు. ప్రకృతిలో దొరికే రకరకాల బతుకమ్మను పండుగ అని అంటున్నప్పటికీ ఇది కూడా ఒక నోములాంటిదే. నోములలో వాయనాలిచ్చినట్లు ఈ పండుగలో కూడా వాయనాలిస్తున్నారు. పూల మధ్యలో గౌరమ్మను పెట్టి కాంతలంతా "నూటోక్క పూవుల కోటి నోముల నోమీ " అన్నట్లుగా గౌరీ మాతకు మంగళం పాడుతూ ఉండటంలో ఇది నోము వంటిదని అర్థమవుతున్నది.
'శ్రీ గౌరీ నీ పూజ ఉయ్యాలో
చిత్తమందున దలుతు ఉయ్యాలో
అంబికా నీకిదే ఉయ్యాలో
అర్ఘ్యం బిచ్చెద ఉయ్యాలో'
– అంటూ పాడే పాటలో తమ నోముకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గౌరీదేవి కరుణ చూపాలని ఆశిస్తారు.
'ఒక్కొక్క పూవేసి చందమామ
ఒక్క జామ ఆమె చందమామ
శివుడింక రాడాయె చందమామ
శివుని పూజా వేళాయే చందమామ'
అంటూ బతుకమ్మపై పేర్చగా మిగిలిన విడి పూలను చల్లుతూ శివ పార్వతుల పాటలే ఎక్కువగా పాడినప్పటికీ " రామ రామ ఉయ్యాలో ! శ్రీ రామ రామ ఉయ్యాలో"! అంటూ సీతారాములను కూడా ప్రార్ధిస్తూ పాటలు పాడతారు. గౌరీదేవి, లక్ష్మిదేవీ, సరస్వతీ దేవీ ముగ్గురమ్మల మూలపుటమ్మ అదిశక్తియే అని నమ్మిన జానపదులు ఆమెనే పరాశక్తిగా పూజించారు.
" శ్రీ లక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
బారతి సతివయ్యి బ్రహ్మకిలాలివే "
అంటూ ఆమెను కీర్తించారు.
మాములు పండుగలలో వాసనా లేని పూవులను దేవుని పూజకు ఉపయోగించరు. కానీ ఈ బతుకమ్మ పండుగలో ప్రకృతిలో లభించే ప్రతి పువ్వునూ దేవుని పూజలో వాడతారు. తంగేడు, గోరంట, గన్నేరు, పొగడ, రుద్రాక్ష వంటి అతి సాధారణ పూలను సైతం పండుగలో అలంకరిస్తారు. ఏ మాత్రం పోషణ లేకపోయినా ఎక్కడా పడితే అక్కడ పెరిగే ఇలాంటి చెట్ల పూలను పూజకు ఉపయోగించడాన్ని ' ప్రకృతి పూజ' గా అభివర్ణించవచ్చు. గ్రామీణులు ప్రకృతిలో పుట్టి పెరిగిన వారు కాబట్టి వారు అన్ని రకాల పూవులను సమన దృష్టితో చూస్తారు. బతుకమ్మలను నీళ్ళలో వదిలిన తర్వాత స్త్రీలు ముత్తైదువలకు పసుపు కుంకుమ, పూలుపండ్లు, రవికల గుడ్డలు వంటివి ఇతర స్త్రీలకు పంచుతారు. ఇలా అందరూ తమ తమ ప్రసాదాలను ఒకరి కొకరు పంచుకుంటూ మనుషుల మధ్య అనుబంధాలను పదిల పరచుకుంటూ ఆనందంగా జీవిస్తారు. సమిష్టి కుటుంబాలు మాయమై చిన్న కుటుంబాల వైపు మొగ్గు చూపుతున్న వారందరికి ఇలాంటి పండుగల వల్లనే తమ బంధువులనూ పుట్టింటి వారిని కలుసుకోవటానికి సమయం దొరుకుతుంది. ప్రతి నిత్యం పనులతో సతమతమయ్యే మహిళా శ్రామికులకు ఈ పండుగ ఉన్నా వారం రోజులు నిజంగా సంబరమే. మహిళ శ్రామికులే కాదు ఆర్థిక సమానత్వం కోసం పోరాడే ఉన్నతోద్యోగులకు బతుకమ్మ వంటి పండుగలు కాస్తంత ఆటవిడుపును కలిగిస్తాయనటంలో ఎటువంటి సందేహము లేదు.
దుస్తులు నగల మీద సహజంగానే స్త్రీలకు మక్కువ ఎక్కువ. ఇలా వారి ఇష్టాన్ని దేవతలకూ ఆపాదించి గౌరీదేవీ పట్టు వస్త్రాలతో శోభాయమానంగా కాంతులు వెదజల్లుతుందని చెపుతారు. అంతేకాక ఆమె సౌందర్యాన్ని దేవతల తరం కూడా కాదని చెప్పడంలో ప్రజలకు అమ్మవారి మీదనున్న భక్తి ఎంతో మనకు అర్థమవుతున్నది. గౌరీదేవీ పాలు వరసను దానిమ్మ గింజలుగా పెదవులను మంకెన పువ్వులలోనూ వర్ణించారు.
" నల్ల వరి బియ్యమూ – మల్లెమొగ్గలో లేక
తెల్ల వజ్రంబులా – ముల్లోకములు ఏలే
తల్లీ నీదంతంబులా గౌరమ్మ దానిమ్మ బీజంబులా "
గౌరీదేవీనీ ఇలా వర్ణన చేస్తూ పానకాలు, పోళీలు, పాలమీగడ, అట్లు, జున్ను చక్కర గరిజెలు, సేవేలు, మడుగు పువ్వులు మొదలైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తామని చెపుతారు. గ్రామీణులు తమకు అందుబాటులో ఉన్న తమకు తెలిసిన ఆహారాలను దేవికి నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు.
" రుద్రాక్ష చెట్లల్ల అట చిలకల్లార పాట చిలకల్లార
కలికి చిలకల్లార కొలికి చిలకల్లార కందువ్వగువ్వలు
నీ నోము నీకిత్తునే గౌరమ్మ నా నోము ఫలమివ్వవే "
- అంటూ స్త్రీలు పాటలు పాడుతూ గౌరిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇలా పాటలు పాడిన వారికి విన్న వారికి కూడా గౌరమ్మ అత్యంత శుభాలనిస్తుందని వారి నమ్మకం. అంతే కాక పల్లకీలను, గుర్రాలను, ఏనుగులనీ ఇస్తుందని భావిస్తారు.
ఈ పండుగ సమయంలో మెత్త పంటలన్నీ పండి ఇంటికి చేరతాయి. జొన్నలు, వడ్లు వంటి ఆహార ధాన్యాలు ఇంటినిండా చేరినపుడు సంతోషంతో ప్రకృతిని పూజించే పండగ ఇదని చెప్పవచ్చు. పంటలు చక్కగా పండి ఇంటికి ధాన్య సంపద రావడానికి కారణం ప్రకృతి కారునే కారణం. కాబట్టి సంపద ఉన్నచోట లక్ష్మి కోలువుంటుందని ప్రజల విశ్వాసం. ఋతువు మారడం
" పన్నీరు అత్తరు పచ్చి గంధంబును
పరిమళంబుల బుక్క, బాగైన కస్తూరి
పసుపు కుంకుమ గుప్పుచూ
పాటలెన్నో పాడుచూ "
అంటూ గౌరమ్మను పూజిస్తామని ఇలాంటి పాతాళ ద్వారా తమ మనసులోని భావాలను తెలుపుతారు. ప్రతి ఇంటిలోని స్త్రీలు వారి వారి ఉళ్ళ లోని చెరువులకు నదులకూ వెళ్ళి సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకుంటారు. ఎంతటి బీదసాదలయినా ఈ పండుగకు కొత్త బట్టలు కుట్టించుకుంటారు. తమ ఆడపిల్లలను ఇంటికి తీసుకు వచ్చి వారికి చీర సారెలు, బహుమతులు, మంచి పిండి వంటలు ఇస్తారు. అందరూ కలసి ఉత్సాహం జరుపుకునే ఈ సందర్భాన్ని కూడా పాట రూపంలో మలిచారు. ప్రజలు తమ దగ్గరలో ఉన్నా పుణ్యక్షేత్రలనూ దేవుళ్ళనూ ఆయా ప్రాంతాల విశేషాలనూ పాటల్లో చేర్చి పాడుకుంటారు.
" బండికి దగ్గట్టు కోడెల మరించి
కోడెలకు దగ్గట్టు గొలుసుల మరించి
గోలుసులకు దగ్గట్టు గజ్జెల మరించి
గజ్జేలకు దగ్గట్టు గంటల మరించి
ఆ బండి బాయేనే భద్రాద్రి దనుక
భద్రాద్రి రాములా పండోయి పండ్లు
చూచెవారె గానీ కొనేవారే లేరు"
ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తావారింటికి సాగనంపేటప్పుడు తల్లీ ఎంతో హిత బోధ చేస్తుంది. అత్త వారింట సహనంతో అందరి మెప్పు పొందాలనీ, లేదంటే కుటుంబంలో కలతల వస్తాయనీ చెప్తారు. పతి భక్తియే పచ్చల పథకమని, అత్తమామ వజ్రాల సొమ్ములన్నీ, కష్టాలన్నీ కంకణలనీ, చుట్టాల బాగోగులే పట్టా గోలుసులనీ, దేశాభిమానమే కాసుల దండలనీ పాటల రూపంలో ఆడపిల్లలకు అత్త వారింట ఎలా మెలగాలో నేర్పిస్తారు. బతుకమ్మ తన సోదరుని భార్య ఘాతకానికి బలైనప్పటికీ, ఈ పండుగ సందర్భంగా పాడే పాటలలో అమ్మాయి అణిగి మణిగి ఉండాలనే బోధిస్తారు.
స్త్రీల మాతృత్వానికి సంబంధించిన పాటలు కూడా ఈ పండుగలో ఉన్నాయి. అంతే కాకుండా గర్బిణీ స్త్రీలు పాటించాల్సిన ఆహార నియమాలు సైతం వర్ణించారు. వారికి ఏ శాస్త్ర విజ్ఞానం లేకపోయినప్పటికీ తమ అనుభవాల తోనే ఆహార పదార్థాల విలువను గ్రహించారు.
ఒకటో మాసం నెల తన గర్భిణి
ఓనగాయ గోరె చెలియా
రెండో మాసం నేల తన గర్భిణి
రేగు బండ్లు గోరే చెలియా !
ప్రస్తుత సమాజంలో ఆడపిల్లను బతకనివ్వడం లేదు. బతుకమ్మ పండుగ ద్వారా ఆడపిల్లలు బతికి బట్టకట్టి మరికొంత మందికి బతుకునివ్వాలని ఆశిద్దాం. నియోనేటల్ మొర్టాలిటీ రేట్ ప్రకారం ప్రతి వెయ్యి మంది పుట్టిన బిడ్డలలో 29 మంది చనిపోతున్నారు అనేక కారణాల వల్ల. అందులో ఆడపిల్లలే ఎక్కువ నిరా దరణ హత్యలకు గురవుతున్నారు. భూమ్మీదకు రాకుండానే ఇంకా ఎందరో భ్రూణ హత్యలకు గురవుతున్నారు. ఆడపిల్లలనే నిర్లక్ష్య నిరాదరణలకు గురవడంతో పాటు అనేక అసమానతలను అనుభవిస్తున్నారు. ఈ పండుగ సందర్భంగా ఇక నుంచీ ఇలాంటివి దూరమవ్వాలని భావిద్దాం. బతుకమ్మను ప్రార్థిద్దాం.
ఆడపిల్లను బతకనివ్వండి – అందరికి బతుకునిస్తుంది.