_*స్వామి వివేకానంద జయంతి*_
*వివేకానంద జీవిత చరిత్ర
*బాల్యం*
బాల్యంలో వివేకానంద స్వామిని నరేంద్రనాథ్ దత్త అని , ముద్దుగా నరేన్ అని పిలిచేవారు. ఆయన కలకత్తా నగరంలో విశ్వనాథ్ దత్త , భువనేశ్వరి దేవి దంపతులకు 1863 సంవత్సరం జనవరి 12 వ తేదీ సోమవారం జన్మించారు. దత్త కుటుంబీకులు ధనికులే గాక సంఘంలో మంచి పేరున్నవారు. దాతృత్వానికీ , విద్యాధికతకూ , స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను కాంక్షించే వారుగానూ పేరెన్నికగన్నారు. నరేంద్రుడి తాత అయిన దుర్గాచరణ్ దత్త పర్షియన్ , సంస్కృతభాషలలో గొప్ప పాండిత్యాన్ని కలిగిన న్యాయవాది. కానీ విశ్వనాథ్ జన్మించిన తర్వాత ఆయన సన్యసించారు. అప్పుడాయనకు 25 సంవత్సరాల వయస్సు మాత్రమే.
కలకత్తా హైకోర్టులో విశ్వనాథ్ దత్త ఒక న్యాయవాది. అతడు ఆంగ్ల , పర్షియన్ భాషలలో గొప్ప పండితుడు. పర్షియన్ కవి అయిన హఫీజ్ రచించిన కవితలను చదివి తన కుటుంబానికి వినిపించేవాడు. బైబిల్ గ్రంథాన్ని చదవడంలోనూ , సంస్కృతంలోని హిందూశాస్త్రాలను చదవడంలోనూ గొప్పగా ఆనందించేవాడు. మితిమీరిన దాతృత్వాన్ని , పేదలపట్ల జాలిని కలిగివున్నా మత సాంఘిక విషయాలలో హేతుబద్దమైన , అభ్యుదయ భావాలను కలిగివుండేవాడు. బహుశా పాశ్చాత్య సంస్కృతీ ప్రభావంవల్ల ఆయనకు ఆ గుణాలు కలిగివుండవచ్చు. భువనేశ్వరీదేవి ఏ పనినైనా సమర్థంగా నిర్వహించగలిగిన రాజకుటుంబీకురాలు. నరేంద్రుడు పుట్టకముందు కొందరు కుమార్తెలు పుట్టినా కొడుకు కావాలన్న కోరికతో ఆమె వారణాసిలోని వీరేశ్వర శివునికి పూజలు జరిపించమని తన బందువులలో ఒకరిని కోరారు. తరువాత శివుడు ఆమెకు కలలో కనిపించి , *'నీకు కొడుకుగా పుడతాన'* ని మాట ఇచ్చినట్టు చెప్పుకుంటారు. ఆ తర్వాత కొంతకాలానికి నరేంద్రనాథ్ జన్మించాడు.
చిన్నతనంలో నరేంద్రనాథ్ ఎంతో ఉల్లాసంగా , అల్లరివాడుగా ఉండేవాడు. కానీ అదే సమయంలో అతనికి ఆధ్యాత్మిక విషయాల మీద గొప్ప ఆసక్తి ఉండేది. రాముడు , సీత , శివుడు మొదలైన దేవుళ్ళ బొమ్మల్ని పూజిస్తూ , ధ్యానిస్తూ ఆడుకునేవాడు. తన తల్లి చెప్పిన రామాయణ , మహాభారత కథలు అతని మనస్సు మీద చెరగని ముద్ర వేసాయి. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు , ధైర్యం , పేదలపట్ల జాలి , దేశద్రిమ్మరులై వచ్చే సన్న్యాసులపట్ల ఆకర్షణ మొదలైన గుణాలు అతనిలో పసితనంలోనే కనిపించాయి. చిన్నతనంలోనే ఎవరేదిచెప్పినా దాన్ని నిరూపించి చూపమని నరేంథ్రనాథ్ సవాలు చేసేవాడు. మదికీ , హృదికీ తలమానికమైనటువంటి ఈ సద్గుణాలతో అతడు ఒక శక్తిమంతుడైన యువకునిగా ఎదిగాడు.
*శ్రీ రామకృష్ణుల చరణకమలాల వద్ద*
యువకునిగా , నరేంథ్రనాథ్ తన సింహంలాంటి రూపానికి సరితూగే ధైర్యాన్ని కలిగివుండేవాడు. మంచి వస్తాదు వంటి శరీరనిర్మాణాన్ని , సుస్వరమైన గొంతును , ప్రకాశమానమైన బుద్ధిని కలిగివుండేవాడు. సాముగరిడీలలోనూ , తత్త్వశాస్త్రంలోనూ , సంగీతం లోనూ తన తోటివారి మధ్య తిరుగులేని నాయకుడిగా పేరెన్నికగన్నాడు. కళాశాలలో పాశ్చాత్య తత్త్వాన్ని అధ్యయనం చేసి ఒంటపట్టించుకున్నాడు. తద్వారా అతని మనస్సులో విషయాలను సూక్ష్మంగా పరిశీలించే శక్తి నాటుకుపోయింది. పుట్టుకతో అలవడిన లక్షణాలయిన ఆధ్యాత్మికతపై మక్కువ , సనాతన మతసాంప్రదాయాల మీద , నమ్మకాల మీద గౌరవం ఒకప్రక్క , మరొకప్రక్క పదునైన బుద్దితో జతగూడిన అతని విమర్శనాత్మక స్వభావం ఇప్పుడు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఇటువంటి సందిగ్ధసమయంలో , ఆ కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న మత - సాంఘిక ఉద్యమమైన భ్రహ్మసమాజంలో చేరి కొంత ఊరట పొందటనికి ప్రయత్నించాడు. భ్రహ్మ సమాజం నిరాకారదైవాన్ని నమ్మి , విగ్రహారాధనను తూలనాడి , అనేక విధాలయిన సంస్కరణలను చెయ్యడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. నరేంద్రనాథ్ అనేకమంది పెరెన్నికగన్న మతనాయకులను కలుసు కున్నాడు. కానీ వారెవ్వరూ , 'దేవుడు ఉన్నాడా' , లేడా?' అన్న అతని ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలెకపోయారు. ఇది అతని ఆధ్యాత్మిక అశాంతిని మరింతగా పెంచింది.
ఇటువంటి చిక్కుపరిస్థితిలో , కలకత్తాకు కొద్ది దూరంలో , దక్షిణేశ్వరంలో ఒక సాధువు ఉన్నాడని తన ఆచార్యుడైన విలియం హేస్టీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వర్డ్స్ వర్త్ తన 'విహారము' అన్న కవితలో వర్ణించిన పారవశ్యస్థితిని ఆ 'సాధువు అనుభూతి చెందాడని హేస్టీ వివరించాడు. అతడి గ్నాతి అయిన రామచంద్ర దత్త కూడా ఆ సాధువును దర్శించమని నరేంద్రుణ్ణి ప్రోత్సహించాడు. ఆ విధంగా 1881 లో ఆధునిక భారతదేశపు దివ్యద్రష్ట అయిన శ్రీరామక్రుష్ణునికి , అతని సందేశప్రచారకుడైన నరేంద్రునికి పరిచయం కలిగింది. *"అయ్యా ! మీరు దేవుణ్ణి చూశారా?"* అని నరేంద్రనాథ్ ప్రశ్నించాడు. *"ఔను ! నేను భగవంతుణ్ణి చూశాను ! నిన్నిప్పుడు చూస్తున్నదానికన్నా స్పష్టంగా చూశాను !"* అని శ్రీరామకృష్ణులు సమాధానమిచ్చారు. ఎట్టకేలకు తన సొంత అనుభూతి ద్వారా దేవుణ్ణి దర్శించిన ఒక మనిషి నరేంద్రుడికి లభించాడు. అతని అనుమానం తొలగిపోయింది. శిష్యునిగా శిక్షణ ప్రారంభమయింది.
ఉమశేషారావు వైద్య