10th తెలుగు - 2వ పాఠం: ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

10th తెలుగు - 2వ పాఠం: ఎవరి భాష వాళ్ళకు వినసొంపు


10వ తరగతి - తెలుగు వాచకం 

2 పాఠం: ఎవరి భాష వాళ్ళకు వినసొంపు


ఎవరి భాష వాళ్ళకు వినసొంపు.pdf

  

పాఠ్యాంశ వివరణ

    భాష అనే పదం ‘భాష్’ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడింది (ధాతువు అంటే మూలము). భాష భావ వినిమయ సాధనం. ప్రతి ఒక్కరు తన ఆలోచనలను ఇతరులకు తెలుపడానికి, ఇతరుల ఆలోచనలను తానూ తెలుసు కోవడానికి ఉపయోగపడేదే భాష. సొంపు అనగా సంవృద్ది, సంతోషము, ప్రసన్నత, సుఖము, సౌందర్యము అని మొదలగు అర్థాలు కలవు.

 ఎవరి భాష వాళ్ళకు - ఎవరి మాతృభాష వాళ్ళు విన్నప్పుడు సంతోషం కలగడం సహజం. ఎన్ని భాషలు నేర్చినా తన సొంత భాష ద్వారా పొందే ఆనందాన్ని ఇంక దేని ద్వారా పొందలేరు. వ్యాస ప్రక్రియను పరిచయం చేస్తూ భాష పై అభిమానాన్ని తెలియజేస్తుంది ఈ పాఠ్యభాగం.


ప్రక్రియ పరిచయం

   ఈ పాఠ్యభాగం వ్యాస ప్రక్రియకు చెందింది. ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా, ఆకట్టుకునేటట్లు వివరించేది వ్యాసం. సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా వుండడటం వ్యాస లక్షణం.


 కవిపరిచయం

   ఎవరిభాష వాళ్ళకు వినసొంపు పాఠ్యభాగ రచయిత డాక్టర్ సామల సదాశివ. తన స్వీయ అనుభూతులతో రచించిన ‘యాది’ అనే వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది ఈ పాఠ్యభాగం. సదాశివ గారు బహు భాషావేత్త. సంస్క్రతం, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, పార్సీ, మరాఠీ, భాషల్లో పండితుడు. ఇతను రచించిన ‘అమ్జద్ రుబాయీలు’కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అనువాద రచనా పురస్కారం, ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించాయి. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ డిగ్రీని ఇచ్చాయి. సామల సదాశివ గారు  తన స్వీయ అనుభూతులతో రచించిన ‘యాది’ అనే వ్యాస సంపుటి లోనిదే ఎవరిభాష వాళ్ళకు వినసొంపు అనే ఈ ప్రస్తుత పాఠ్యభాగం.


 విశిష్టత

  భాషలోని నుడికారపు సొంపు, పలుకుబడులు, జాతీయాల వల్ల భాష ఎంత పరిపూర్ణంగా, సౌందర్యవంతంగా విలసిల్లుతుందో చెబుతూ ఇతర భాషల్లోని గొప్పతనాన్ని బేరీజువేస్తూ, తెలుగుభాష గొప్పతనాన్ని, ప్రాంతీయ భాషలోని మాధుర్యాన్ని తెలియజేస్తుందీ పాఠ్యభాగం.


పూర్వకథ/నేపథ్యం

   నాలుగేళ్ళు కూడా నిండని మన రచయిత సామల సదాశివ గారి మనుమరాలు లావణ్య ఒకనాడు ‘తాతా ! ఇగపటు నీ పాను జర్దా డబ్బి’. అని అచ్చమైన తెలుగు నుడికారంలో ఇగపటు అనగానే తన మనుమరాలికి ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టువడ్డ ఆనందంలో కొన్నాళ్ళ క్రిందట సంస్కృతాంధ్ర భాషల్లో, కావ్యవ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు; ‘ఆంధ్రబిల్హణ’ బిరుదాం కితుడైన కప్పగంతుల లక్ష్మణశాస్త్రి అన్నటువంటి- “వారీ! రామచంద్ర! ఇగపటు” అనే మాటలు యాదికి వచ్చి ప్రస్తుత పాఠ్యభాగమైన “ఎవరిభాష వాళ్ళకు వినసొంపు” అనే వ్యాసాన్ని రాయడానికి పూనుకుంటాడు.
సారాంశం

 సంస్కృతాంధ్రప్రాకృత భాషల్లో పండితుడైన తిరుమల రామచంద్ర ఆంధ్రప్రభ వారపత్రికలో హైదరాబాద్ నోట్ బుక్ అనే పేరుతో చివరి పేజీ రాసేవారు. అందులో ఒకనాడు రామచంద్ర గారి బాల్య మిత్రుడు సంస్కృతంలో బిల్హణ మహాకవి రాసిన 'విక్రమాంకదేవ చరిత్ర' అనే కావ్యాన్ని తెలుగులోకి అనువదించిన కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు తిరుపతికి వెళ్లి తెచ్చిన ఒక లడ్డూను రామచంద్ర గారికి ఇస్తూ "వారీ! రామచంద్రా! ఇగపటు తిరుపతి లడ్డూ" అని అన్న మాటలను పేర్కొన్నారు. లావణ్య మాటలు వినగానే సదాశివ గారికి కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.

   లక్ష్మణశాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు. వీరికుమార్తె ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ కమలగారు. కమలగారు బాసరలో వ్యాసపూర్ణిమ నాడు ప్రసంగించారు. ఈమె మాట్లాడుతుంటే సదాశివగారికి లక్ష్మణశాస్త్రిగారు గుర్తుకువచ్చారు. శాస్త్రిగారు నిజాంకాలంలో సమాచార పౌరసంబంధాల శాఖలో అసిస్టెంట్ ఓరియంటల్ లాంగ్వేజెస్ పదవిలో విరమణ పొందాడు.

     మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కలిగిఉంటుంది. సురవరం ప్రతాపరెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడుకు చెందినవారు. దీనిని నీళ్లులేని ఇటిక్యాలపాడు అనేవారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాయచూర్ లోని కొంతభాగం కర్ణాటకలో చేరిపోయింది. ఇటిక్యాలపాడు, ఆలంపూర్ మహబూబ్ నగర్ జిల్లాలో కలిసిపోయాయి. ఆలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పాటుకు  ముఖ్య కారకులైన గడియారం రామకృష్ణశర్మ గారు చురుకుగా పాల్గొన్నారు.

   నల్గొండ జిల్లా తెలుగు కూడా సొంపైనదే నల్గొండలోని ఒక ఆశ్రమంలో వత్సలుడు మొదలైన కావ్యాలు రాసిన అంబటిపూడి వెంకటరత్నం గారు అనే కవి ఉండేవారు. వీరు వేలూరి శివరామశాస్త్రి గారి శిష్యులు. సామల సదాశివ, కోడూరి వీర రాఘవాచార్యులు కూడా వేలూరి వారి ఏకలవ్య శిష్యులు. అంబటిపూడి వారి ఒకకావ్యం కప్పగంతుల వారి సంక్షిప్త వ్యాకరణం పరిషత్ నిర్వహించే పరీక్షల సిలబస్ లో ఉండేవి.

               పలుకుబడి, నుడికారం, జాతీయాలను ఉర్దూలో రోజ్ మర్రా, మొహావిరా అంటారు. వరంగల్ తెలుగును టక్సాలీ తెలుగు అని అనవచ్చు. టక్సాలీ అంటే టంకసాల. టంకసాలలో తయారయ్యే నాణేలకే విలువ ఎక్కువ. డిల్లీ ఉర్దూను టక్సాలీ ఉర్దూ అంటారు.

         సదాశివ గా ఊరిలో మరాఠీపు రోహితుడు మొదట 'మీకండ్లకు నీళ్లు పెట్టుకోండి"అంటాడు. "కళ్ల నీళ్లు పెట్టుకోండి"అనడు. ఇది టంకసాల బయట తయారైన నకిలీ నాణెం. వరంగల్లో కూరగాయలు అమ్మే స్త్రీ నోటివెంట అచ్చ  తెనుగు నుడి వినిపిస్తుంది. ముస్లిం స్త్రీలు ఇల్లుదాటి వెళ్ళని వాళ్లు మాట్లాడేది శుద్ధమైన భాష రాజమహల్లలోఉండే బేగములు మాట్లాడేది శుద్ధమైన భాష. ఈ ఉర్దూను బేగమాతీ జుబాన్, మహెల్లాతీ జుబాన్ అంటారు. సామల చదువుకునే సమయంలో నిజాంకాలేజీలో ఆగా సాహెబ్ అనే ప్రొఫెసర్గంటలు గంటలు దిల్లీ బేగమాతీ జుబాన్లో మాట్లాడేవారు.

 వరంగల్లో పెద్ద కాలోజి వర్ధంతి సభలో సదాశివ పాల్గొన్నాడు. పెద్ద కాలోజీ కవి. ఇతని కలంపేరు షాద్. వర్ధంతి సభలో చిన్నపాటి కవి సమ్మేళనం జరిగేది. గాయకులు షాద్ గజల్లు పాడేవారు. సదాశివ గారు సభకు వెళ్ళే సరికి సాహితీ మిత్ర మండలి వాళ్ళు కవితా గానం చేస్తున్నారు. సభకు డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులుగా ఉన్నారు. అధ్యక్షులు వేరే భాష పదాల జోలికి పోకుండా వరంగల్ ప్రాంతీయ తెలుగులో మాట్లాడాడు. తర్వాత సామల తెలుగులో మాట్లాడే సాహసం చేయలేదు. ఉర్దూలోనే మాట్లాడాడు.

   సామల సదాశివ వార్తా పత్రికల్లో కొన్నాళ్లు ఉర్దూ కవుల గురించి రాశాడు. తర్వాత యాది రాశాడు. యాదిలో వచ్చిన వ్యాసాలను చదివి గుంటూరు అడ్వకేట్ ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ మెచ్చుకునేవాడు. ఆంధ్రవాళ్ళు మెచ్చుకోవడం గొప్పేకదా.

   సదాశివ తెలంగాణ సీమోల్లంఘనం చేసి తిరుపతివెంకన్నను కూడా చూడలేదు. కారా మాస్టారు గారి ఆజ్ఞతో మూడు రోజులు విశాఖ శ్రీకాకుళం వెళ్ళివచ్చాడు. సదాశివ తెలుగు పంతులు ఉర్దూ మరాఠీ పిల్లలు వ్యవహారిక భాషలోనే చదువుకునేవారు. ఒక టీవీ చానల్లో "తెలుగేరాయండి. తెలుగులోనే మాట్లాడండి" అని చెపుతున్నప్పుడు... అది విన్నప్పుడల్లా ఏతెలుగు? ఎక్కడితెలుగు? అని రెండు ప్రశ్నలు వేసుకునేవాడు.

  ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైన కవి మీర్ తఖీమీర్. అతడు శుక్రవారం శుక్రవారం దిల్లీ జామె మసీదు మెట్లమీద కూర్చుండి ఫకీర్లు, బిచ్చగాళ్లు, బిచ్చగత్తెలు కూర్చుండి మాట్లాడు కుంటుంటే వాటిని శ్రద్ధగా విని ప్రజలపలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాడు. తఖీమీర్ నాది ప్రజా కవిత అన్నాడట.

 తఖీమీర్ గారి ఒక షేర్

 ‘గో మెరే షేర్ హైఁ ఖవాస్ పసంద్

పర్ మెరీ గుఫ్తగూ అవామ్ సేహై’

  ఇందులో ఖాస్ అంటే ప్రత్యేకమైనది. దాని బహువచనం ఖవాస్. ఆమ్ అంటే సామాన్యం. ఆవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు.

 “ నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు. కానీ నేను మాట్లాడుతున్నది సామాన్య ప్రజలతోనే అని పై షేర్ యొక్క అర్థం.”

 ఈ విధంగా సామల సదాశివగారు ఆయా ప్రాంతాల తెలుగును ఆయా ప్రాంతాలలోని భాషా సేవకులను, అభిమానులను గుర్తుచేసుకుంటూ ఉర్దూ భాషపై తనకు గల అభిమానాన్ని, పట్టును ప్రస్తావిస్తూ సాగించిన రచనే ఈ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠ్యభాగం.


***************

0/Post a Comment/Comments