10th తెలుగు - 1వ పాఠం: దానశీలము

10th తెలుగు - 1వ పాఠం: దానశీలము


10వ తరగతి - తెలుగు వాచకం

1వ పాఠం: దానశీలము

దానశీలము.pdf       DOWNLOAD HERE

పాఠ్యాంశ వివరణ

    ‘దానము’ అనగా త్యాగం, అడిగినది లేదనకుండా ఇవ్వడం, ఉచితంగా ఇవ్వడం మరియు ఇచ్చిన దానిని తిరిగి తీసుకోకుండా ఉండడం. ‘శీలము’ అనగా గుణము, స్వభావము మరియు మంచి ప్రవర్తన. “దానశీలము”  అంటే  దానము  యొక్క  గొప్పదనం. దానశీలము అనే ఈ పాఠ్యభాగం ఇచ్చిన మాటకు కట్టుబడే తత్త్వాన్ని దానం చేయడం లోని గొప్పదనాన్ని తెలియజేస్తుంది. పురాణ ప్రక్రియకు చెందిన ప్రాచీన పద్యాన్నిపరిచయం చేస్తూ త్యాగాన్ని మరియు శీలాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈయబడిన పాఠం ఇది.


కవిపరిచయం

  దానశీలము అనే ఈ పాఠ్యభాగ రచయిత బమ్మెర పోతన. ఇతను 15వ శతాబ్దానికి చెందిన వాడు. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతనకు సహజ పండితుడు అని బిరుదు గలదు. వీరభద్ర విజయం, భోగినీ దండకం, నారాయణ శతకం మొదలగునవి రచించాడు.ఇతను రచించిన శ్రీమత్ భాగవతం అష్టమ స్కంధంలోని వామన చరిత్ర నుండి ఈ పాఠ్యభాగం  స్వీకరించబడింది. భాగవతము పురాణ ప్రక్రియకు చెందినది.


ప్రక్రియ పరిచయం

 పురాణాలు18. పురాణం అంటే పాతదైననూ కొత్తగా భాసించేది. ‘సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశాను చరితం’ అనేవి పురాణ లక్షణాలు.


విశిష్టత

  బలిచక్రవర్తి తన ప్రాణం పోతుందని తెలిసినా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువైన శుక్రాచార్యుడు ఎంత వారించినా, హెచ్చరించినా గురువు మాటలు వినకుండా వామనునికి దానం చేస్తాడు.


పూర్వకథ/నేపథ్యం

  బలిచక్రవర్తి  తన  శక్తిసామర్థ్యాలతో  స్వర్గలోకాన్ని ఆక్రమిస్తాడు.  ఈ విషయాన్ని దేవతలు విష్ణువుతో చెప్పగా  కొంత  కాలానికి విష్ణువు  వామన అవతారం  ఎత్తి నర్మదా నదీ తీరంలో యాగం చేస్తున్న బలిచక్రవర్తి వద్దకు వెళ్లి మూడడుగుల నేల కావాలని అడగగా ఇస్తానని మాటయిస్తాడు. వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించిన అసుర గురువు శుక్రాచార్యుడు  బలిని  దానం  ఇవ్వవద్దంటాడు.




సారాంశం

       శుక్రాచార్యుడు - దాతలలో గొప్పవాడవైన ఓ బలిచక్రవర్తీ! వచ్చినటువంటి వామనుడు, ఆ పొట్టివాడు సామాన్యుడుకాడు. మూడు అడుగులతో ముల్లోకాల్ని కొలవగలడు. అతడిని ఎవరూ ఆపలేరు. నా మాట విను. దానం వద్దు గీనం వద్దు. ఆ బ్రహ్మచారియైన వామనుని పంపించు.  అని  బలిచక్రవర్తి  తో  అంటాడు.

     అప్పుడు బలిచక్రవర్తి.... ఓ మహాత్మా! ఇచ్చినమాటతప్పడంకన్నా పాపం లేదు. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి పంపించలేను. మాటకు కట్టువడి సత్యంతో బ్రతకడమే మానధనులకు మేలైన మార్గం. పూర్వం రాజులులేరా? రాజ్యాలు లేవా? వారేమైనా మూటగట్టుకొని పోయారా? అడిగిన వారికి లేదనకుండా దానం చేసిన శిబిలాంటి కొందరిని మాత్రమే  ఈలోకం  గుర్తుంచుకుంది. 

        ఓ పండితోత్తమా! నాకు నరకం దాపురించినా, బంధనం ప్రాప్తమైనా, ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం వచ్చినా, నా వంశం నశించినా ఏది ఏమైనా కానీ! ఇన్ని మాటలు ఎందుకు వచ్చినవాడు విష్ణువు, శివుడు,బ్రహ్మ ఎవరైనా సరే ఆడినమాట తప్పను.

     ఎన్ని కష్టాలకు గురైనా, పేదరికం వచ్చినా, మరణమే సంభవించినా అభిమానధనులు మాట తప్పలేరు. అని బలిచక్రవర్తిఅంటుండగా భర్త సైగను గ్రహించిన అతని భార్య వింధ్యావళి ఆ వామనుడి కాళ్ళు కడగడానికి బంగారు కలశంలో నీళ్ళు తీసుకుని వన్తుంది. అప్పుడు బలిచక్రవర్తి వామనున్ని పిలిచి లేవయ్యా! ఇటురా! నీవు అడిగింది లేదనకుండా ఇస్తాఅంటూ అతడి పాదాల్ని కడిగి పూజించి నీకు మూడు అడుగుల నేలను దానం  చేస్తున్నానంటూ చేతిలో నీటిని ధారవోసాడు. అదిచూసి లోకం ఆశ్చర్యపడింది. పది దిక్కులూ, పంచభూతాలు “బళి బళి” అని పొగడాయి.


కంఠస్థ పద్యాలు - తాత్పర్యాలు


*మ.  కులమున్ రాజ్యముఁ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం

డలఁతిం బోఁడు త్రివిక్రమస్ఫురణవాఁడై నిండు బ్రహ్మాండముం

           గలడే మాన్ప నొకండు? నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్

           వలదీ దానము గీనముం; బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా !

తాత్పర్యం: దాతలలో గొప్పవాడా ! ఓ బలి చక్రవర్తీ ! నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్నీ, నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు. కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు. మూడడుగులతో మూడులోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానం వద్దు గీనం  వద్దు.  ఈ  బ్రహ్మచారిని (వామనుడిని)  పంపించు.

*శా.     కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?

            వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపైఁ

            బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై

            యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా !

       తాత్పర్యం:  ఆచార్యా ! పూర్వం రాజులు ఉన్నారు. రాజ్యాలు ఉన్నాయి. వారు ఏంతో అహంకారంతో విర్రవీగారు . కానీ వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదూ. ప్రపంచంలో వారి పేర్లుకూడా మిగులలేదు. శిబిచక్రవర్తి వంటివారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోర్కెలు తీర్చలేదా? వారిని ఈనాటికీ లోకం మరువలేదు  కదా.

*మ.   నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు

           ర్మరణం బైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ముపో ;

           హరుఁడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన నౌఁ;

           దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా! ధీవర్య! వేయేటికిన్?

తాత్పర్యం:ఓ పండితోత్తమా! నాకు నరకం దాపురించినా సరే. బంధనం ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం  వచ్చినా సరే, నా వంశం అంతా నశించినా సరే. ఏమైనా కానీ, ఏదైనా రానీ! ఎందుకు ఇన్ని మాటలు. వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే. నా నాలుక వెనుదిరుగదు. (ఆడిన మాట తప్పను).



ముఖ్య వివరణలు

దశ దిక్కులు= పది దిక్కులు- దిక్కులు దిక్పాలకులు:- 1.తూర్పు-ఇంద్రుడు, 2.పడమర-వరుణుడు, 3.ఉత్తరము-కుబేరుడు, 4.దక్షిణము-యముడు,5.ఈశాన్యం-శివుడు, 6.నైరృతి-నిరృతి, 7.వాయవ్యము-వాయువు, 8.ఆగ్నేయము-అగ్ని, 9.ఆకాశం-బ్రహ్మ, 10.భూమి-శేషుడు.

వాయువ్యం

ఉత్తరం

ఈశాన్యం

పడమర

భూమి

ఆకాశం

తూర్పు

నైరుతి

దక్షిణం

ఆగ్నేయం

పంచ భూతాలు= పృథివి(భూమి), ఆపస్సు (నీరు), తేజస్సు(అగ్ని), వాయువు(గాలి), ఆకాశం. (నీరు నిప్పు గాలి భూమి ఆకాశం పంచ భూతాలు. భూతము అనగా ప్రాణము. పంచ భూతాలు అనగా ఐదు ప్రాణాలు.) 



విద్యార్థులకు సూచనలు

* పువ్వు గుర్తుగల పద్యాలను  కంఠస్థం చేయాలి. ప్రతి పదార్థాలను, వాటి భావాలను సొంతంగా రాయాలి.

* పాఠం మొత్తం చదువాలి. అర్థం కాని పదాల కింద గీత గీయాలి.

* వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువు (డిక్షనరీ) చూసి తెలుసుకోవాలి.

* కవి పరిచయం, ప్రక్రియా పరిచయాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి.

* పాఠ్యభాగ సారాంశం సొంత మాటల్లో రాయాలి. ఇవి చేయండి లోగల సృజనాత్మక అంశాలను సాధన చేయాలి.

* ఇవి చేయండి లోని భాషాంశాలులో గల పదజాలం, వ్యాకరణాంశాంలు సంపూర్ణంగా అధ్యయనం చేయాలి.





0/Post a Comment/Comments