"ధర్మార్జునులు" (9th - Telugu - 1st Lesson)

"ధర్మార్జునులు" (9th - Telugu - 1st Lesson)




9 తరగతి - తెలుగు


1 పాఠం: ధర్మార్జునులు



ధర్మార్జునులు, ధర్మరాజు మరియు అర్జునుడు. వీరిరువురు పాండవులు. ధర్మరాజు పాండవులలో పెద్దవాడు. (పాండవాగ్రజుడు ధర్మరాజు). నడిపివాడు అర్జునుడు. (పాండవ మధ్యముండు అర్జునుడు). వీరిరువురి గుణగణాలను తెలియ జేయడం కోసమే ఈ పాఠం. 


నేపథ్యం
ప్రతి పద్య చమత్కారచణుడు చేమకూర వేంకటకవి రచించిన విజయవిలాసం అనే కావ్య ఆరంభంలో ఇంద్రప్రస్థపుర వర్ణనలో భాగంగా దానికి రాజైన ధర్మరాజు, అతని సోదరుల గుణగాణాల గురించి తెలిపే సందర్భంలో అన్నదమ్ముల అనుబంధం, ప్రేమ, స్నేహభావం, సహన శీలత వంటి మంచి లక్షణాలను ముఖ్యంగా ధర్మరాజు అజ్ఞాపరిపాలనా వ్రతాన్ని గూర్చి ప్రభోదించడం ఈ పాఠం ఉద్దేశం.



ప్రక్రియ పరిచయం


ధర్మార్జునులు ప్రబంధం అనే సాహిత్య ప్రక్రియకు చెందినది. ప్రబంధం అనగా ఇతిహాస, పురాణాలలోని ఓ చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం. ప్రబంధంలో వర్ణన ప్రధానం.



కవి పరిచయం


చేమకూర వేంకటకవి ప్రతిపద్యచచమత్కృతిగా రచించిన విజయవిలాసం ప్రబంధంలోని ప్రథమాశ్వాసంలోది ఈ పాఠ్యభాగం. ‘విజయభవన’ అనే కవి పండిత సభను నిర్వహించిన తంజావూరు రాజు అభినవ భోజడు అనే బిరుదు గల రఘునాథ నాయకుని ఆస్థాన కవి వెంకటకవి. విజయ విలాసం అనే గ్రంథాన్ని రఘునాథ నాయకునికి అంకితం ఇచ్చాడు. ఇతని మరో కావ్యం సారంగధర చరిత్ర. ధర్మరాజు తన సోదరుల పట్ల, ప్రజల పట్ల ప్రదర్శించిన ధర్మ నిరతి ఎటువంటిదో ఈ పాఠం ద్వారా తెలుసుకోవచ్చు.



సారాంశం


ధర్మరాజు యమధర్మరాజు వరపుత్రుడు. తాను యిచ్చిన ఆజ్ఞలను తనుకూడా పాటించే స్వభావం గలవాడు. శాంతి, దయ, నిజం చెప్పడం, మంచి వారిని ఆదరించి పోషించడం, దానగుణం, నిశిత పరాక్రమం కలిగి విద్యపట్ల ఆసక్తి గలవాడు. ఇతరులెవరైనా ఎదురుగా ఉన్నప్పుడు మంచిగా మాట్లాడి, ఎదురుగా లేనప్పుడు చాటుగా వారిని గూర్చి చేడుగా మాట్లాడడం చేసేవాడు కాదు. ఏదైనా సాయం కోరితే సంపూర్ణంగా సహాయం చేసేవాడు. ఒకరిపట్ల పరిచయమైన మొదట్లో ఎక్కువ మర్యాదగా వుండి తర్వాత్తర్వాత అమర్యాదగా కాకుండా ఎప్పుడూ ఒకేలా ఉండేవాడు.
దానగుణం, ధర్మ ప్రవర్తన కలిగి అందరితో కలిసి మెలిసి ఉండేవాడు. ప్రజలు గొప్పగా సిరి సంపదలతో ఉంటె సంతోషపడేవాడు. కోపం కొంచెం కుడా లేని సత్య స్వరూపుడు మనుష్యులలో వ్యత్యాసాలు తెలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్వతంత్రుడు. స్థిర స్వభావం గలవాడు.
ధర్మరాజు నలుగురు తమ్ములు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీరిని ఐదుగురిని పాండవులు అంటారు. వీరు ఓటమినే ఎరుగని పరాక్రమం గలవారు. అయిదు దేవతా వృక్షాలో, విష్ణుమూర్తి ఐదు ఆయుధాలో ఈశ్వరుని ఐదు ముఖాలో అని పొగిడేంత గొప్ప గుణవంతులు పాండవులు. పాండవులంతా ఒకరి మనసెరిగి ఒకరు నడుచుకుంటూ, పనులలో భేదాలు లేక, పెద్దా చిన్న వ్యత్యాసాలెరిగి మాట మీరకుండా, స్నేహభావంతో భక్తి , ప్రేమ, సహనంతో ఏంతో నేర్పుగా ఉండేవారు.
అన్నల పట్ల, తమ్ముల పట్ల సమాన భావాలు గలిగి, ఎదురులేని పరాక్రమంగల వానిగా పేరొంది ధర్మ ప్రవర్తన గలిగినవాడు పాండవ మధ్యముడు అర్జునుడు. అర్జునుడు అందంలో జయంతుని తమ్ముడు. దయాగుణంలో గరుడ ధ్వజుడైన కృష్ణునికి ప్రాణమిత్రుడు. యుద్ధవిజయాలలో శివునికి పోటీ పడే వీరుడు. ఈ భూమండలంలో అతనికి అతడే సాటియైన అర్జునుని పొగడడం అసాధ్యం.
అర్జునుడు తేరిపార చూస్తే చాలు, శత్రుసైన్యం పారిపోవడానికి సిద్ధమవుతుంది. విల్లుఎత్తి పట్టుకోవడానికి వంగితే చాలు శత్రు సమూహం వీరస్వర్గం దారి పడుతుంది. ఇక వేయి మాటలెందుకు? ఆ అర్జునునితో సాటి అని చెప్పదగినవాడు, పోల్చదగిన వీరుడు రఘురాముడే కాని, ఈ లోకంలో మరొకడు లేదు.



కంఠస్థ పద్యాలు - భావాలు


*ఉ.   ఆ పురమేలు ‘మేలు బళి!’, యంచుఁ బ్రజల్ జయవెట్టుచుండ నా
జ్ఞా పరిపాలన వ్రతుఁడు, శాంతి దయాభరణుండు; సత్య భా
షా పరతత్త్వకోవిదుఁడు, సాధు జనాదరణుండు, దాన వి
ద్యా పరతంత్ర మానసుఁడు ధర్మతనూజుఁ డుదగ్రతేజుడై.


తాత్పర్యము: యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం తానుకూడా ప్రవర్తించాలన్న దీక్ష కలవాడు. శాంతి, దయ అనే మహాగుణాలనే ఆభరణాలు ధరించినవాడు. నిజం చెప్పడంలోని సారస్యాన్ని బాగా తెలిసినవాడు. మంచి వారిని ఆదరించి పోషించేవాడు. దానం చేయడమనే విద్యపట్ల ఆసక్తిగల మనసున్నవాడు. నిశిత పరాక్రమం కలవాడై విశేషంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. అటువంటి ధర్మరాజును గూర్చి ఆ ఇంద్రప్రస్థ ప్రజలంతా ‘మేలు, బళి!’ అంటూ జేజేలు పలుకుతున్నారు.


*ఉ.   కోపమొకింతలేదు; బుధకోటికిఁ గొంగుఁబసిండి; సత్యమా 
రూపము; తారతమ్యములెఱుంగు; స్వతంత్రుఁడు; నూతన ప్రియా
టోపములేని నిశ్చలుఁ డిటుల్ కృతలక్షణుఁడై చెలగఁ గా
ద్వాపర లక్షణుం డనగవచ్చునొకో యల ధర్మనందనున్?


తాత్పర్యము: కోపం కొంచెం కూడా లేదు. పండిత సమూహానికి మూటగట్టిన కొంగు బంగారం. సత్యస్వరూపుడు. మనుష్యులలో వ్యత్యాసాలు తెలిసినవాడు. మంచిచెడ్డలను తాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్వతంత్రుడు. కొత్త విషయాలపట్ల ఆడంబరాలు లేని స్థిరస్వభావం గలవాడు. ఈ విధంగా ప్రసిద్ధమైన మంచి లక్షణాలు కలవాడైన ఈ ధర్మరాజును ద్వాపర లక్షణుడు అంటే సందిగ్ధ లక్షణాలు కలవాడు (ద్వాపరయుగంవాడు అ నికూడా) అనిఅనవచ్చునా? (అనకూడదు.) కృతలక్షణుడు (కృతయుగలక్షణుడు) అని అనాలి.


*చ.   అతని నుతింప శక్యమె? జయంతుని తమ్ముఁడు సోయగమ్మునన్
        బతగ కులాధిపధ్వజుని ప్రాణసఖుండు కృపారసమ్మునన్ 
క్షితిధర కన్యకాధిపతికిన్ బ్రతిజోదు సమిజ్జయమ్ము నం,
         దతని కతండె సాటి చతురబ్ధి పరీత మహీతలమ్మునన్.


తాత్పర్యము: అందంలో జయంతుని (ఇంద్రుని కుమారుడు) వంటివాడు. దయా స్వభావంలో గరుడ ధ్వజుడైన (విష్ణువుకు) కృష్ణునికి ప్రాణమిత్రుడు. పర్వతరాజపుత్రిక పార్వతి భర్తయైన శివునికి యుద్ధ విజయాలలో పోటీ పడే వీరుడు. నాలుగు సముద్రాలచే ఆవరించబడిన ఈ భూమండలంలో అతనికి అతనే సాటి (మరింకెవ్వరూ సాటికాదు). అటువంటి అర్జునుడిని పొగడటం సాధ్యమా? (సాధ్యంకాదు అని భావం).



ముఖ్య వివరణలు


జయంతుడు= ఇంద్రుని పెద్దకొడుకు (జయంతుని తమ్ముడు మన్మథుడు. ఇతడు అతి సౌందర్యవంతుడు. అర్జునుడు ఇంద్రుని వరపుత్రుడు.)
పతగ కులాధిపధ్వజుడు= పక్షి సమూహానికి రాజైన గరుత్మంతుని(గ్రద్ధ) చిహ్నాన్ని జెండాగా గలవాడు. విష్ణువు.
క్షితిధర కన్యకాధిపతి= పర్వత రాజ పుత్రిక అయిన పార్వతి యొక్క భర్త. శివుడు.
పంచామర తరులు= ఐదు దేవతావృక్షాలు. (పారిజాతము, మందారము, సంతానము, కల్పవృక్షము, హరిచందనము - ఇవిదేవవృక్షములు)
హరి పంచాయుధములు= శంఖము(పాంచజన్యము), చక్రము(సుదర్శనము), గద(కౌమోదకి), ఖడ్గము(నందకము), చాపము(శార్‌ఙ్గము).
గిరీశు పంచాస్యములు= శివుని అయిదు ముఖాలు. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము.



విద్యార్థులకు సూచనలు


  • పువ్వు గుర్తుగల పద్యాలను  కంఠస్థం చేయాలి. ప్రతి పదార్థాలను, వాటి భావాలను సొంతంగా రాయాలి.
  • పాఠం మొత్తం చదువాలి. అర్థం కాని పదాల కింద గీత గీయాలి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువు (డిక్షనరీ) చూసి తెలుసుకోవాలి.
  • పాఠ్యభాగ సారాంశం సొంత మాటల్లో రాయాలి.

****************************

0/Post a Comment/Comments