" విరులు " బాలలకు సిరులు(పుస్తక సమీక్ష) -బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

" విరులు " బాలలకు సిరులు(పుస్తక సమీక్ష) -బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

" విరులు "  బాలలకు సిరులు(పుస్తక సమీక్ష)
-బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న
--------------------------------
అందమైన గేయాలు
మధురమైన భావాలు
'వేము రాములు' విరచితం
పారిజాత పుష్పాలు

అలతి అలతి పదాలు
తీయనైన ఫలాలు
" విరులు " బాలగేయాలు
పదపదమున పరిమళాలు

"విరులు" బాలలకు సిరులు
 ఇందు గేయాలు మణులు
చదివిన వికశించు మదులు
వేము రాములు ఘనులు

అద్భుతమైన ప్రాసలు
మదిని దోచు వరుసలు
రాములు పొత్తం "విరులు"
బాలగేయాల ఝురులు
         ప్రౌఢ సాహిత్యంతో పోల్చితే బాలసాహిత్యం తక్కువనే చెప్పక తప్పదు. ఈలాంటి తరుణంలో  మొదటి ప్రయత్నంలోనే  అలతి అలతి పదాలతో "విరులు" రూపంలో అద్భుత బాలగేయాలు అందించిన వేము రాములు కృషి సఫలీకృతం అనడంలో సందేహం లేదు.ఇందులో ప్రతి గేయం ఆణిముత్యం.అక్షర సత్యం.విచ్చిన విరులై పరిమళాలు వెదజల్లుతున్నాయి.పూలలో పలు రకాలు ఉన్నట్టు వీరి గేయాలలో అనేక సామాజిక అంశాలున్నాయి. బాలలు లయబద్ధంగా పాడుకోవడానికి అనువుగా ఉన్నాయి.వేము రాములు గారి కృషి,సంకల్పం గొప్పది.
     వేము గారి గేయాలలో కొన్ని పరిశీలిద్దాం:
    "ప్రాణం లేని పక్షి నీవు/ఆకాశాన ఎగురుతావు/ఎందరినో గమ్యాలకు /చేర్చు లోహ విహంగామా!" అని రైట్ సోదరులు కనిపెట్టిన  వాయు వాహనాన్ని గురించి అద్భుతంగా అభివర్ణించారు."మామ మామ చందమామ/అంబరాన ఉన్న మా మామ/తారల మధ్యన వెలిగే మామ/అందరి మామ చందమామ"అని   మామ కాని మామ అందమైన చందమామపై  మందారంలాంటి అందాల ప్రాసలతో మదిని దోచారు."చక్కని నెమలి నేనూ/పించము నాకు అందము/పురివిప్పి ఆడుతాను/ఆనందం కల్గిస్తాను"అని అందానికి మారుపేరు అయిన మన జాతీయ పక్షిని గురించి చక్కని సందేశమిచ్చారు."పిల్లలం మేము మంచి పిల్లలం/విరిసివిరియని తెల్లని మల్లెలం/అంబరాన మెరిసేటి తారలం/అమ్మానాన్నల ఆశల దివ్వెలం"అని కల్లాకపటమెరుగని పసి పిల్లల గూర్చి మంచి గేయమందించారు."కూరల్లో వేస్తారు/నన్ను లవణం అంటారు/తెల్లగా నేను ఉంటా!/పేరేమిటో చెప్పుమంటా!"అని గేయ పొడుపులు గేయంలో మెదడుకు మేత పెట్టారు.
    "ఏటిలోన నీరుంటే కళకళ/నీరు లేకుంటే ఊరు విలవిల/ఆ నీరు పంటలకు ఆధారం/పంటలే మా జీవనాధారం"అంటూ ఏరు వలన ఊరికి వచ్చే లాభాలు,నీటి ప్రాముఖ్యత  ఏరు గేయంలో నొక్కివక్కాణించారు."ఇదిగో మా పూలతోట/అందమైన పూలతోట/రంగురంగుల పూలుండె/రమ్యమైన పూలతోట" అని పూలతోట గురించి సరళమైన శైలిలో అద్భుత భావనలు గుప్పించారు."పెద్దలకు చేయుము నమస్కారము/ఇతరులకు చేయాలి ఉపకారము/ఎవరికి చేయకు అపకారము/సమస్యకుంటుంది పరిష్కారము"అని కారము గేయంలో పలురకాల "కారము" జోడించారు."మంచి వారి తోడ చెలిమి/ వృద్ధి చెందు నీకు కలిమి"అని పూదోట గేయంలో హితోక్తులు  చాటి చెప్పారు."పువ్వు పువ్వు/ఏమి పువ్వు/పువ్వు పువ్వు/మల్లె పువ్వు"అని పువ్వులను పరిచయం చేశారు.
  గొడుగు,వాన,నా అందం,ఎవరు గొప్ప,బొమ్మ,గౌను,పిల్లి,జేజేలు,గులాబీ, జంట పదాలు,చెరువు,అభిమానం,అరటిపండ్లు, సుద్దులు...ఇలా ఎన్నో విషయాలపై చక్కని,చిక్కని బాలగేయాలు లిఖించారు వేము రాములు గారు.పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడే ,అందరూ రాగయుక్తంగా ఆలపించడానికి సులువైన బాలగేయాలు  పొందుపరిచారు "విరులు"గేయ సంపుటిలో. హృదయాలకు హత్తుకొను రీతిలో.
    సోదర సాహితీమిత్రులు,బాలసాహిత్యవేత్తలు  శ్రీ వేము రాములు కలం నుంచి మరెన్నో పుస్తకాలు వెలుగుచూడాలని మనసా,వాచా,కర్మణా కోరుకుంటూ..ఎందరో మహానుభావులుండగాతొలి పలుకులకు అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతాభినందలు తెలుపుతూ...
       --గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హిస్సార మురవణి, కర్నూలు జిల్లా, చరవాణి:9966414580

0/Post a Comment/Comments