"చుక్కల రమేష్ గారి-చక్కని మణిపూసలు"
(పుస్తక సమీక్ష)-గద్వాల సోమన్న
--------------------------------
విరిసిన సిరిమల్లెలు
వెలసిన హరివిల్లులు
చుక్కల రమేష్ గారి
విరచిత మణిపూసలు
వెదజల్లును పరిమళాలు
వెలిగించును జీవితాలు
వెన్నెలమ్మ చల్లదనం
ఇందులోని మణిపూసలు
పదపదమున తీయదనం
చూపించెను తెలుగుదనం
అలతి అలతి పదాలతో
చాటి చెప్పె గొప్పదనం
మిలమిల మెరిసే చుక్కలు
కళకళలాడే మొక్కలు
అక్షరాల అల్లికలే !!
రమేష్ గారి మణిపూసలు
అందమైన భావాలు
నిజ జీవిత సత్యాలు
చుక్కల రమేష్ వ్రాసెను
అద్భుతం మణిపూసలు
శ్రీ చుక్కల రమేష్ గారు వాట్సప్ వేదిక ద్వారా సుపరిచితులు. సహృదయులు,ఘన సమీక్షకులు ముఖ్యంగా సాహితీమిత్రులు, ప్రేమికులు. అనతికాలంలోనే అమోఘమైన,తెలుగుదనం ఉట్టిపడే మణిపూసలు వ్రాసి పుస్తక రూపానికి శ్రీకారం చుట్టడం అత్యంత అభినందనీయం,ఆనందదాయకం.వడిచర్ల సత్యం గారు రూపొందించిన నూతన తెలుగు కవితాప్రక్రియ మణిపూసలలో వెలుబడిన పుస్తకాలలో చుక్కల రమేష్ గారిది అద్వితీయం కాగలదని ఆశాభావం.
వారి మణిపూసలలో కొన్ని పూసలను పరిశీలిద్దాం:
మొదటి మణిపూసలలోనే జ్ఞానానికి మూలమైన, అనంత శక్తిమంతుడైన భగవంతునికి అమిత వినమ్రతతో తన భక్తిభావాన్ని ప్రకటించుకున్నారు.
"శ్రీవాణి గిరిజ కృపతో/శ్రీ గురుదేవుల దయతో/నా కృతి సాకరమాయె/తల్లిదండ్రుల ప్రేమతో" , "నన్నుగన్న తల్లికి/నన్నుగన్న తండ్రికి/శ్రీ గురులకిదే ప్రణతులు /నన్నుగన్న భూమికి" "సుకవి వడిచర్ల సత్యం/మణిపూసలిడెను సత్యం/నవకవుల నెందరినో/కదిలించెననుట సత్యం" అని తాను ఋణపడిన వారికి కృతజ్ఞతాంజలి ఘటించారు."తెలుగు భాషను వదలకు/తెగువ జూపుట మరువకు/జ్ఞానార్జన కొరకు రోజు/తెలుసుకొనడం మానకు! " ,"తెలుగు కొరకు నిలబడదాం/తెలుగు విలువ నిలబెడుదాం/కీర్తి పతాక మన తెలుగు/తెలుగు ఘనతను చాటుదాం" అని ఆంగ్ల భాష మోజులో తెలుగుభాషను మరువద్దని సున్నితంగా ఆదేశించారు."చదువగ పోదాం రండి/సర్దుకుపోదాం రండి/బతుకులు మారును తప్పక/మనది బడి గెలాక్సండి!"అని బాలలుంటే చోటు పాఠశాలలేనని,భవిత నిర్మాణం అందే జరుగుతుందని,బడి ఆవశ్యకతను గళమెత్తి,శివమెత్తి నినదించారు."చెడు స్నేహం ముందు ఇంపు/తరువాత ఎంతో కంపు/చెడ్డ చెలిమి చిచ్చును/త్వరగా మంచిగా తెంపు"అని చెడు స్నేహం వలన అనర్ధం విపులకరించారు.
"చదువే మనిషికి సత్యం/చదువే వెలుగిడు నిత్యం/తప్పకుండా చేసుకో/చదువడమే నీ కృత్యం!" అని చరవాణి చెరలో విద్యార్థులు చదువు ను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన చెందుతూ చదువే నిత్య కృత్యం కావాలని మనసారగ ఆకాంక్షించారు. ఇలా చుక్కల రమేష్ గారు మణిపూసలలో అనేక సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.తేటతెలుగు పదాలతో స్పృశించారు..ఎన్నో అంశాలు.
"శ్రీ చుక్కల రమేష్ గారి కలం నుంచి మరెన్నో పుస్తకాలు వెలుగు చూడాలని మనసా,వాచా,కర్మణా కోరుకుంటూ..తన తొలి పుస్తకానికి ముందుమాటకు అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ...
- 'కవి శిరోమణి 'గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,
9966414580