శ్రీ జయ చామరాజేంద్ర చిత్రశాల – మైసూరు
డా.. కందేపి రాణీప్రసాద్.
చిన్నారులూ! మీకు చిత్రలేఖనమంటే చాలా ఇష్టం కదా! మరి ప్రసిద్ద చిత్రకారులు వేసిన చిత్రాలను ఉంచిన చిత్రశాలల గురించి మీకు తెలుసా! ప్రజల్లో రవివర్మ ఆర్ట్ గ్యాలరీ గా ప్రఖ్యాతి గాంచిన 'శ్రీ జయచామరాజేంద్ర ఆర్ట్ గ్యాలరీ, గురించి తెలుసుకుందామా! ఇది కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో ఉన్నది. 1861లో నైసురు మహారాజులచే నిర్మింపబడిన ఈ రాజభవనాన్ని 'జగన్ మెన్ ప్యాలెస్' అంటారు. 1915లో దీనిని మ్యూజియంగా మార్చిన తరువాత 'శ్రీ జయచామరాజేంద్ర చిత్రశాల'గా పేరు పెట్టబడింది. ఈ మ్యూజియంలో రాజ రవివర్మ, శ్రీ హల్డెంకర్, రోరిచ్, నందలాల్ బోస్, వెంకటప్పా మొదలైన దేశవిదేశాల్లో పేరుగాంచిన చిత్రకారుల చిత్రాలున్నాయి. తైలవర్ణచిత్రాలు, నీటిరంగుల చిత్రాలు, వ్యక్తుల చిత్రాలు, మొఘల్, రాజస్థానీ పెయింటింగులు, చెక్కపై చెక్కిన చిత్రాలు..., మైసూరు మహారాజులు వాడిన బల్లలు, కుర్చీలు ఇలా ఎన్నో ఇక్కడ అలంకరించబడి ఉన్నాయి. అన్నిటికన్నా అధ్బుతంగా దర్శనమిచ్చేది 'ఫ్రెంచి మ్యూజికల్ కాలెండర్ గడియారం'. ఇది సుమారు ఏడెనిమిది అడుగుల ఎత్తు, ముదడుగుల వెడల్పుతో ఉన్నది. ఈ గడియారంలో ఒక సెకను గడవగానే ఒకసైనికుని బొమ్మ డ్రమ్ వాయిస్తుంది. అదే పావునిమిషం పూర్తవగానే ఇంకో సైనికుడు కత్తి ఎత్తి దించుతాడు. ప్రతిగంటకు ఒకసారి ఇలా జరుగుతుంది. ఇది చాలా అధ్బుతంగా ఉన్నది. పిల్లలూ మీరు దీన్ని తప్ప చూడాలి. చాల గమ్మత్తుగానూ, ఆనందంగాను, ఆశ్చర్యంగాను అనిపిస్తుంది దీన్ని చూస్తే.
మొదటి అంతస్తు అంతా అక్బరు, షాజహాన్, ఔరంగజేబుల చిత్రాలు, మొఘల్, రాజస్థానీ స్టైల్ లో వేసిన చిత్రాలు, బియ్యం గింజలపై వేసిన సూక్ష్మ చిత్రాలు, మైసూరు మహారాజు తైలవర్ణ చిత్రాలు, వెండి బంగారాలతో చెక్కబడిన గుర్రాలు, ఏనుగులు వంటి శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పేపర్ మంటేజ్ చిత్రంలో కాగితాన్ని ఉబ్బెత్తుగా ఉండేలా మడిచి దానికి రంగులు వేశారు. ఇది ఒక వేటదృశ్యం. ఓ ఫ్రేములో ఏనుగు పెయింటింగ్ ఉన్నది. దీనిని కుడివైపు నుంచి చూస్తే సింహంలాగా, ఎడమవైపు నుంచి చూస్తే లేడీలాగా కనిపిస్తుంది. సింహం, లేడిని తినేయకుండా ఏనుగు మధ్యలో అడ్డంగా ఉన్నట్లనిపించింది. సముద్రంలో దొరికే శంకులు, ప్రవాళాలు, అల్చిప్పలు వివిధ ఆకారాల్లోవి సేకరించబడి ఉన్నాయి. నున్నగా ఉన్న వాటి తలాలపై పెయింటింగులు చేయబడ్డాయి. ఏనుగు దంతాలు, బియ్యంగింజలు, అల్చిప్పలు ఇలా ఒకటేమిటి ప్రతి వస్తువు మీద పెయింటింగులు వేయబడ్డాయి. ప్రకృతిలో దొరికే ప్రతివస్తువును అలంకరణకు ఉపయోగించడానికి వాడటం ఆరోజుల్లో ఉందన్నమాట. ముత్యపుచిప్పలతో కుంకుమభరిణేలు, నశ్యం డబ్బాలు, ఇంకా ఆడవారి అలంకరణకు సంబందించిన వస్తువులు పెట్టుకునే జువెల్లరీ బాక్స్ లుగా తయారు చేయబడి ఉన్నాయి. సాగరగర్భంలో లభించే చిత్రవిచిత్ర ఆకారాల్లోని పెరల్ అయిస్టర్లు, కొరల్స్ ను సేకరించటం ఆనాటి రాజులకు కూడా హాబీగ ఉండేదని తెలిస్తే ఆశ్చర్యం అనిపించింది.
మైసూరు మహారాజు కృష్ణరాజ వాడయార్ బ్రిటిష్ వాళ్లతోనూ, యూరోప్ నాయకులతోనూ కలిసి ఉన్న తైలవర్ణ చిత్రాలున్నాయి. చాలా చిత్రాల కింద రామనర్సయ్య, రామవర్మ అని చిత్రకారుల పేర్లున్నాయి. గునోడ్ అనే చిత్రకారుడు ఎన్నో మినియేచర్ ఆయిల్ పెయింటింగులు వేశాడు. మైసూరు మహారాజు వివాహ మహోత్సవం. పుట్టినరోజు మహోత్సవం, మహారాజ పట్టాభిషేకం, దసరా ఉత్సవాలు మొదలైన చిత్రాలు చాలా పెద్దవిగా,బంగారపు ప్రేముతో గోడలకు అందంగా అలంకరించబడి ఉన్నాయి. ఇంకొక రూములో టిప్పు యుద్దం చేసే దృశ్యాలు, టిప్పుమరణం, టిప్పు కుమారుల్ని బ్రిటిషర్లకు అప్పగించటం, హైదర్ అలీఖాన్ చిత్రం మొదలైనవి ఉన్నాయి. ఇంకో గదిలో మైసూరు మహారాజు యొక్క దివానులు, ట్రస్టీల చిత్రాలున్నాయి. మరో గదిలో మహారాజుల కుటుంబం వాడిన పాత్రలు, సోఫాలు కుర్చీలు ఉన్నాయి. ఆ ఫర్నిచర్ ఎక్కువగా చైనీస్ రోజ్ వుడ్ తో తయారు చేయబడి ఉన్నాయి. ఒక కుర్చీ కాపర్ వుడ్ తో చెక్కబడి ఉన్నది. ఇంకా పోర్సీలిన్ తో తయారైన కప్పులు, సాసర్లు, బుట్టలు, పాత్రలు ఫ్లవర్ వేజ్ లు రకరకలుగా ఉన్నాయి. వాటిపై లతలు, పువ్వులు, పక్షులు చిత్రింపబడి ఉన్నాయి. ఎల్లోకట్ గ్లాస్, రెడ్ గ్లాస్, ప్లెయిన్ గ్లాస్ లతో వివిధ పాత్రలు, వాటిని పట్టుకోవడానికి హ్యాండిల్స్ తో సహా ఉన్నాయి. ఇప్పుడు మనం వాడుతున్న గ్లాస్ వేర్, క్రిస్టల్ వేర్ ఆ రోజుల్లోనే ఉన్నాయా అనిపిస్తుంది వాటిని చూస్తే. ఏనుగు దంతాన్ని కత్తిల చెక్కారు. ఏనుగు దంతం కూడా కొద్దివంపుతో ఖడ్గంలా ఉంటుంది కాబట్టి దాన్ని కత్తి ఆకారంలోనే చెక్కారు ఎంత అద్భుతమైన ఆలోచన.
మేడమీద మొత్తం రవివర్మ వేసిన చిత్రాలు ఉన్నాయి. ఇక్కడ రవివర్మ చిత్రం ఉన్నది. ఈయన కేరళ మహారాజు. కేరళ మహారాజు వేసిన బొమ్మలు మైసూరు మహారాజు ప్యాలెస్ లో ఉన్నయేంటి అని అనుమానమొచ్చి అక్కడివాళ్ళను అడిగితే ఆ మహారాజులిద్దరూ స్నేహితులు అని చెప్పారు. ఒకసారి రాజారవివర్మ మైసూరును సందర్శించి విడిది చేసినప్పుడు ఇక్కడే ఆ పెయింటింగులన్ని వేసి స్నేహితునికి బహుమతిగా ఇచ్చాడట. ఈ పెయింటింగులు అత్యంత మనోహరంగా ఉన్నాయి. వీటి వలనే ఇది రవివర్మ ఆర్ట్ గ్యాలరీ గా పేరుపొందింది. ఎంతో మండి ప్రసిద్ది చిత్రకారులు, వర్తమాన చిత్రకారులు ఈ గ్యాలరీ ని సందర్శించి ఎన్నో మెళకువలను తెలుసుకుంటుంటారు.
రవివర్మ చిత్రాల్లో 'జటాయువధ' అనే చిత్రం అద్భుతంగా ఉన్నది. ఆ చిత్రాన్ని కుడివైపు నుంచి చూసిన ఎడమవైపు నుంచి చూసిన అందులో బొమ్మ, మనవైపే చూస్తున్నట్లుగా ఉంటుంది. ఇంకో చిత్రం 'వెన్నెల్లో ఆడపిల్ల' నయనానంద కరంగా మనోజ్ఞంగా ఉన్నది. చెట్లు, పొడల్లో మధ్యన కూర్చున్నా అమ్మాయి మీద పైనున్న చంద్రుడు కురిపిస్తున్న వెన్నెల పడుతున్నట్లుగా చిత్రీకరించారు. వెన్నెల పడిన చోట వెలుగులు, వెన్నెల పడని చోట మసకమసకగా అద్భుతంగా ఉన్నదీ చిత్రం. కృష్ణ,సుధామల చరిత్ర, హరిశ్చంద్రుడు, ఇంద్రజిత్తు విజయం, శకుంతల చిత్రలేఖనం, హంస రాయబారం, సైరంద్రి, గ్రామీణ జీవనం, మలబారు చలపతి, మత్స్యగంధి ఇలా ఎన్నో రవివర్మ వేసిన చిత్రాలున్నాయి. అక్కడే ఉన్న రాజ రవివర్మ తైలవర్ణ చిత్రాన్ని ఎమ్. రామనర్సయ్య వేశారు.
ఒక చీకటి గదిలో 'గ్లోఆఫ్ హోప్' అనే అత్యద్భుత చిత్రం ఉన్నదీ. దీనిని ఎస్.ఎల్. హోల్టెన్ కర్ అనే చిత్రకారుడు వేశాడు. ఇందులో ఒక అమ్మాయి చేత దీపం పట్టుకొని వస్తుంటుంది. ఆ దీపం ఆరిపోకుండా మరో చెయ్యి అడ్డుగా పెట్టి ఉంటుంది. ఆ చేతి వెనక ఉన్న దీపపు వెలుగు అమ్మాయి మొహం మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఈ చిత్రాన్ని చీకటిలో చూసినా, వెలుగులో చూసినా దీపపు వెలుగులు అత్యంత మనోహరంగా కనిపిస్తాయి. ఈ చిత్రం ఈ ఆర్ట్ గ్యాలరీ కే వెలుగు అంటే అతిశయోక్తి కాదేమో! ఆరు ఋతువులకు సంబందించిన చిత్రాలు అద్భుతంగా వేశాడు రవివర్మ.
ఈ ప్యాలెస్ లో బెంగుళూరు కు చెందిన అనంతయ్య, ఎన్. ఎస్. సుబ్బకృష్ణ, హనుమయ్య మొదలైన చిత్రకారులు, మైసూరుకు చెందిన వెంకటప్ప, రామచంద్ర, శంకర రాజు వంటి చిత్రకారులు, బెంగాల్ కు చెందిన అశ్వనీకుమార్ రాయ్, మద్రాసుకు చెందిన కె. ఆనందమోహన శాస్త్రి ఇంకా కలకత్తా, లక్నో, గుజరాత్ చిత్రకారుల చిత్రాలను ఇక్కడ దర్శించవచ్చు. ఈ ఆర్ట్ గ్యాలరీ ని చూస్తుంటే ఒక పెద్ద సిద్దాంత గ్రంధం రాయవచ్చనిపిస్తోంది. ఎంతసేపు చూసినా తనివి తీరలేదు. ఇన్నింటివి ఒక్కసారిగా చూసిగుర్తు పెట్టుకోవడం చాలా కష్టమనిపించింది. కొన్నింటిని అక్కడే కూర్చుని నోట్సు రాసుకున్నాను. పిల్లలూ! మీరూ ఎప్పుడైనా మైసూరును దర్శిస్తే ఈ జయచామరాజేంద్ర చిత్రశాలను తప్పకుండా చూడండి.