విద్యా సంస్థలకు సెలవుల పొడిగింపు ఉద్యోగ ఉపాధ్యాయుల ఉద్యమాన్ని నీరుగార్చడానికా? కోవిడ్ నియంత్రణకు పాఠశాలల మూసివేతతో సంబంధం ఏమిటి? -- వడ్డేపల్లి మల్లేశము

విద్యా సంస్థలకు సెలవుల పొడిగింపు ఉద్యోగ ఉపాధ్యాయుల ఉద్యమాన్ని నీరుగార్చడానికా? కోవిడ్ నియంత్రణకు పాఠశాలల మూసివేతతో సంబంధం ఏమిటి? -- వడ్డేపల్లి మల్లేశము

విద్యా సంస్థలకు సెలవుల పొడిగింపు ఉద్యోగ ఉపాధ్యాయుల ఉద్యమాన్ని నీరుగార్చడానికా? కోవిడ్ నియంత్రణకు  పాఠశాలల మూసివేతతో సంబంధం ఏమిటి?

-- వడ్డేపల్లి మల్లేశము, 9014206412.
(17.01.2022)

        తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవుల అనంతరం 17వ తేదీ నుండి ఈ నెల 30 వరకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. ప్రధానంగా  కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా విద్యా సంస్థలకు సెలవు లను మరింత కాలం పొడిగించినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించిన ఉద్యమం యొక్క తీవ్రత కూడా బహుశా ఇందుకు కారణం కావచ్చు నేమో! ధాన్యం కొనుగోలు అంశం మూడు మాసాలకు పైగా ప్రజల దృష్టి మళ్ళిస్తే హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం సుమారుగా అయిదారు మాసాలు తెరమీద కనపడింది. ఇటీవలి ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించిన బదిలీల ఉత్తర్వులు డిసెంబర్ 6 తేదీన వెలువడిన నాటి నుండి  పనిధినాల చివరి రోజైన జనవరి7 తారీఖున ఎక్కడి వాళ్ళు అక్కడ పాఠశాలల్లో చేరగా ఈ తంతు ముగిసినట్లు కనిపించినప్పటికీ ఉపాధ్యాయుల ఉద్యమం ఆగడం లేదు.

ప్రజల దృష్టిని మళ్లించడానికే నా?:

    ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తారు. ప్రాతినిధ్యాలు నిర్వహిస్తారు. అయితే ప్రభుత్వాలు మాత్రం ప్రజల దృష్టిని మళ్ళించడం ఎలా? అనే అంశం మీద దృష్టి పెడతాయి. దానికి ఇటీవలి కాలంలో అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. అందులో భాగమే విద్యాసంస్థలకు సెలవు పొడిగింపు అని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

        ఆదివారం 16వ తేదీన సెలవుల పొడిగింపు ప్రభుత్వం ప్రకటించగానే మీడియా తల్లిదండ్రులు, విద్యార్థులు, వివిధ వర్గాలతో జరిపిన ఇంటర్వ్యూలో పాఠశాలలకు సెలవు ప్రకటించడం తగదని ఇప్పటికే విద్యార్థులు చాలా నష్టపోయారని ఆన్లైన్ బోధన ద్వారా తమకు, తమ పిల్లలకు ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదని చెప్పడం నిజంగా ఆందోళన కలిగిస్తున్న విషయం.

        2019 చివరిలో భారతదేశంలోకి కరోనా ప్రవేశించినప్పటికీ ముఖ్యంగా 2020 మార్చి నుండి ఇప్పటి వరకు సుమారుగా రెండు విద్యా సంవత్సరాలలో పాఠశాలలు, విద్యాసంస్థలు, కళాశాలలు నడిచినవి నామ మాత్రమే అని చెప్పక తప్పదు. ప్రాథమిక తరగతుల విద్యార్థులు అయితే చిన్నపిల్లలు కనుక తరగతులు నడిచినప్పటికీ పాఠశాలకు వెళ్లలేక ఆన్లైన్ ద్వారా అవగాహన చేసుకోలేక ఎంతో నష్టపోయారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

       ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్న శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి తో సహా పలు సందర్భాల్ల కారణంగానే కరోనా వ్యాపిస్తున్నది. కానీ పాఠశాలల్లో విద్యార్థుల వల్ల కాదని తేటతెల్లమైంది. ఇటీవలికాలంలో వరుసగా నెల రోజులకు పైగా జరిగినటువంటి విద్యాసంస్థల బోధన సందర్భంగా ఎలాంటి కేసులు పెరగకపోవడాన్ని ప్రభుత్వం తల్లిదండ్రులు గుర్తించవలసిన అవసరం ఉన్నది.

       ఉద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి 317 జీవో లోని అవకతవకలను సరిచేయడానికి అక్రమ బదిలీలను రద్దు చేయాలనే డిమాండ్తో ఉద్యోగులు ఉపాధ్యాయులు పరస్పర భార్య భర్తలకు సంబంధించి ఇతర దూరప్రాంతాలకు చేసిన బదిలీలను రద్దు చేయాలని సుమారుగా నెల రోజుల నుండి ఉద్యమాలు కొనసాగుతున్నవి. బిజెపి కాంగ్రెస్ వామపక్షాలు మిగతా రాజకీయ పార్టీలు పూర్తి మద్దతు ప్రకటించగా ప్రగతి భవన్ ముట్టడి అనేకసార్లు ప్రకటించి ప్రభుత్వాన్ని ఆలోచింపచేసినా స్పందన లేకపోవడం చాలా విచారకరం. విద్యాసంస్థలు ఉన్నట్లయితే ఉపాధ్యాయులు విద్యార్థులు పాఠశాలలకు వస్తారు కనుక ఉపాధ్యాయుల సమీకరణ ద్వారా ఉద్యమాలు మరింత ఉధృతంగా జరిగే ప్రమాదం ఉంటదని భావించిన ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కోసం కూడా ఈ సెలవులను పొడిగించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

       ఇక కరోనా కు సంబంధించి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులు ఉన్నత స్థాయి అధికారులు పోలీసులు డాక్టర్లు ఉద్యోగులు వేల సంఖ్యలో కరోనా బారిన పడినట్టు తెలుస్తున్నది. కానీ పాఠశాలలో ఎక్కడ కూడా అలాంటి దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు, లోకేష్, అంబటి రాంబాబు తో సహా ఇతర నాయకులకు కూడా కరోనా సోకినట్టు తెలుస్తున్నది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో గాంధీ ఇతర వైద్య శాలల లో ఉన్న వందలాది మంది వైద్య సిబ్బందికి కరోనా సోకడం విచారకరమే కాదు. కరోనా రోగులకు చికిత్స చేయడానికి కూడా ఇబ్బందులు ఎదురు కావడం ఆందోళన కలిగించే విషయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ డైరెక్టర్ కూడా కరోనా బారిన పడిన విషయాన్ని ప్రస్తావించక తప్పదు.  పాఠశాలలు, విద్యా సంస్థలు, కళాశాలలకు సంబంధించి ఎలాంటి కేసులు లేకపోవడాన్ని ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు. ఇటీవల నెల రోజులకు పైగా వరుసగా విద్యాసంస్థలు సక్రమ పద్ధతిలో కొనసాగుతున్న వేల మరో రెండు మాసాల్లో వచ్చే విద్యా సంవత్సరం పూర్తి అయ్యే సందర్భంలో అర్ధాంతరంగా సెలవును ప్రకటించి విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులకు చాలా నష్టదాయకం.

        ఎన్నికల సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు ,మంత్రులు శాసనసభ్యులు, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వేలాది మంది kovid నిబంధనలు పాటించకుండా ప్రవర్తిస్తే లేని తప్పిదం పాఠశాలలకు  కళాశాలలకు విద్యార్థులు నిబంధనలు పాటిస్తూ వెళుతూ ఉంటే అభ్యంతరం చెప్పవలసిన అవసరం ఏమిటి? అవసరమైతే ప్రభుత్వం మరిన్ని కోవిడ్ జాగ్రత్త చర్యలను విద్యాసంస్థలలో ప్రవేశపెట్టి ఎంత ఖర్చయినా విద్యా బోధన కొనసాగేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నది. ఈ రకంగా మధ్యలో దారి మళ్ళించడం అంటే బాధ్యతను విస్మరించినట్లేనని అనేకమంది ఆక్షేపణ తెలియజేస్తున్నారు.

       ముఖ్యంగా విద్యా సంస్థలు మూసివేశారు. కనుక ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి పోరాటం సన్నగిల్లుతుంది అని ప్రభుత్వం భావించవచ్చు. 317 జీవోలో సవరణలు వచేవరకు స్థానికతను పరిశీలించకుండా కేవలం సీనియారిటీ ప్రాతిపదికన చేసిన బదిలీలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తూ ఉద్యమాలు కొనసాగిస్తున్న విషయాన్ని ప్రభుత్వం పునరాలోచన చేయకుంటే పెను సవాళ్లు ఎదుర్కొనేప్రమాదం ఉన్నది అని ప్రభుత్వం గుర్తించాలి.

      ఇప్పటికీ పూర్తి భద్రత ల మధ్యన తిరిగి విద్యాసంస్థలను ప్రారంభించి విద్యా సంవత్సరం అంతం వరకు కొనసాగించి విద్యార్థుల భవిష్యత్తుకు జీవo పోయవలసిన  బాధ్యత ఇటు సమాజం పైన అటు ప్రభుత్వం పైన ఉన్నది. ప్రజల దృష్టిని మళ్ళించడానికి ఉద్యమాన్ని దారి తప్పించడానికి ప్రభుత్వం ఈ ప్రకటన చేసి ఉంటే వెంటనే ఉపసంహరించుకోవాలని అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ)

0/Post a Comment/Comments