పరవశం ----జీగురు రవీందర్

పరవశం ----జీగురు రవీందర్


పరవశం

పచ్చనిపైరు  సల్లగాలికి సయ్యాటలు 
మిర్చి తోటల బంతిపూల గుబాళింపు 
జొన్నకంకి మీద పాలపిట్ట 
సింహాసనమెక్కినట్టు
మక్కపెరడుకు నీళ్ళు కడుతుంటె 
జల్లుల అక్షింతలు
కట్టమీద మడేలయ్య పక్కన కూసోని
నీళ్ళల్ల రాళ్ళ సప్పుడు
అలల మీద అల్లిపూల ఆటలు
చెర్ల బుడుబుంగల దాగుడుమూతలు
కొమ్మ మీది కోయిల పాటకు 
మత్తడి సప్పుడు శృతి
వాకిట్ల సహచరి వేసిన ముగ్గులో 
అవ్వ పలకరింపు 
నాగరిక ప్రపంచంలో
ధోతి రుమాలు కనపడుతే 
అయ్య జ్ఞాపకాలు
కాంక్రీటు దునియల 
మట్టి పరిమళం గుభాలిస్తే 
జన్మభూమి యాది
సాంకేతిక సమాజంల 
మాతృభాష వినబడుతే 
పండుగకు పుట్టింటికి పేనట్టు 
మనసు మంచిగుంటె 
కాళ్ళకాడ గంగుంటది 
మనిషి ఎక్కడున్నా 
జ్ఞాపకాలు పదిలంగనే ఉంటయ్

           ----జీగురు రవీందర్
                  9290025994

0/Post a Comment/Comments