విహరించు పలు వన్నెలు ....రమేశ్ గోస్కుల

విహరించు పలు వన్నెలు ....రమేశ్ గోస్కుల

విహరించు పలు వన్నెలు
(కైతికాలు)

రమేశ్ గోస్కుల

మంచియన్నది మాయమై 
మనీ చుట్టు పరుగులు
ఏడిస్తే వెక్కిరించి
రాక్షసుల జల్సాలు
రాముల్లెందరు కావాలో
మనుషుల మనిషిగ మార్చెటందుకు

అన్నింటికి బానిసైన
అర్థమేమి జీవితాన
ఆలోచించి నడుచుకో
వెలుగు స్వేచ్ఛ రీతిన
పులకరించు ప్రతిక్షణం
పువ్వులాగా పుడమిన

అద్దమంటి మనసైతే
అంధత్వం చేరదు
కల్మషాలు నిండియున్న
దరహాసం దూరదు
ఆలోచన తీరులోనే 
అంతులేని ఆరోగ్యం

మనుసులో కలకలం
కన్నుల్లో కల్లోలం
ఆల్చిప్ప జీవితానికి
అందనట్టిదగు బలం
సుడిగాలి తో చిక్కగ మది
బక్కచిక్కు బతుకు బండి

శిశిర మాస చీకటేల
బీదవైన నీడలు
గ్రీష్మ తాపమీడగా
హుషారెత్తు జాడలు
కాలం తీరున బతుకులు
కాదన కడుదుర్గమంబగు

అక్షరాల గంతులు
అందమైన పలుకులు
భావాల పూబంతులు
పరిమళించు గీతులు
వినిపించు కవితలు
విహరించు పలు వన్నెలు

తనివి తీరనట్టి కృతి
మనముందున్న ప్రకృతి
వినిపించు మధుర శృతి
పసిపిట్టల గానామృతి
నిశ్చలమైన నిత్య సత్యం
సృష్టి యిచ్చిన సూక్ష్మ తత్త్వం


....రమేశ్ గోస్కుల
 కైతికాల రూపకర్త

0/Post a Comment/Comments