"విలీన విమోచనం"

"విలీన విమోచనం"

 విలీన విమోచనం


- మాసు రాజేందర్, ఎస్ఏ తెలుగు,

జెడ్పీహెచెస్ రాయపర్తి, మండలం నడికూడ,

జిల్లా: హనుమకొండ, 506164.


సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినం అని కొందరు, తెలంగాణ విలీనం జరిగిన రోజుగా మరికొందరు అభివర్ణిస్తూ వుంటారు. తెలంగాణ ప్రభుత్వం -  తెలంగాణ నిజాం పాలన నుండి విముక్తమయ్యి 75వ సంవత్సరంలో అడిగిడుతున్న సందర్భంలో "తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు" పేరుతో 2022 సెప్టెంబర్ 16, 17, 18 తేదీలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించి నాటి తెలంగాణా యోధులను, కవులు కళాకారులను స్మరించుకుంటూ వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారిని సన్మానించాలని నిర్ణయించింది. ఇది శుభపరిణామం. ఇంకో విషయం ఈ సందర్భంలో గుర్తుచేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం తన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా౹౹ బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టడం అనేది తెలంగాణా ప్రభుత్వం యొక్క గొప్ప నిర్ణయంగా పేర్కొనాలి.


నిజాం రాజ్య విలీనం


    1948 సెప్టెంబర్ 17న హైద్రాబాద్ సంస్థానంగా పిలువబడే నిజాం రాజ్యం స్వతంత్ర భారతదేశంలో విలీనం చేయబడింది. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు ఆంగ్లేయులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. 


   కానీ భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తెలంగాణ ప్రాతం 13నెలలు హైద్రాబాద్ సంస్థానంలో భాగంగానేవుంది. ప్రత్యేక రాజ్యంగా ఉంది. అప్పుడు భారత సైన్యాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో హైద్రాబాద్ చేరుకుని 'ఆపరేషన్ పోలో' పేరుతో సైనిక చర్య జరిపడం వల్ల 1948 సెప్టెంబర్ 17న నిజాం భారత సైన్యాలకు లొంగిపోయాడు. తరువాత హైద్రాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించబడింది. 



      అనగా తెలంగాణ ప్రజలు రాజరిక పాలననుండి విముక్తిపొంది స్వాతంత్ర్యాన్ని పొందింది 1948 సెప్టెంబర్17న. అంటే సెప్టెంబర్ 17న నిజాం పాలిత హైద్రాబాద్ రాజ్యం భారత్ లో విలీనమయ్యింది.


తెలంగాణ ఎలా?


   తెలంగాణ ప్రాంతం "వాయుపురాణంలో మధ్యదేశంలోని జనపదాలలో ఒకదానిగా తిలింగుల జానపదం అని చెప్పబడింది." అని డా౹౹ సుంకిరెడ్డి నారాయణరెడ్డి తను రచించిన "తెలంగాణ చరిత్ర" అనే గ్రంథంలో పేర్కొన్నాడు. తిలింగులు నివసించే ప్రాంతం 'తిలింగ'గా వ్యవహారంలో 'తెలింగ'గా అదే 'తెలంగాణ'గా రూపాంతరం చెందింది.


  1947లోనే తెలుగుల చరిత్రను, ఆలిండియా రేడియో మద్రాసు కేంద్రం నుండి విద్యార్థుల కార్యక్రమంలో భాగంగా ధారావాహికలుగా అందించిన ప్రముఖ చరిత్ర పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర శర్మ తెలంగాణ పద వ్యుత్పత్తిని గురించి వివరిస్తూ " 'తెలింగాణెమే' వ్వ్యవహారములో (తెలంగాణ) తెలంగానా అయినది. ఆణె  మనగా దేశం. హైదరాబాద్ రాజ్యములో తెలంగానా సగానికి పైగా ఉన్నది. 1766-1800 మధ్య కాలంలో నిజాము పరిపాలన క్రింద నుండిన తెలుగు దేశమునకే తెలంగానా అను పేరు రూఢమైనది." అని పేర్కొన్నాడు.


   భారత్ లో విలీనానికి ముందువున్న నైజాం రాజ్యంలోని తెలుగు మాట్లాడే ప్రజాలువున్న ప్రాంతమే "తెలంగాణ" అని స్పష్టమవుతుంది. తెలుగు మాట్లాడే పజలతో కూడుకున్నదే "తెలంగాణ" అని అవగతమవుతుంది.


    క్రీ.పూ. 1000 సంవత్సరాల నాటికే తెలుగు భాష ఏర్పడిందని భాషా శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ అందుబాటులో ఉన్న చరిత్ర మేరకు తెలంగాణా ప్రాంతపు తొలిపాలకులుగా శాతవాహనులను పేర్కొనవచ్చు. క్రీ.శ. 1వ శతాబ్దం లో శాతవాహనులు కోటిలింగాలను కేంద్రంగా చేసుకుని తెలంగాణను పరిపాలించినట్టుగా తెలుస్తుంది.


   శాతవాహనులు మొదలు ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు - బాదామీ, కల్యాణీ, వేములవాడ, ముదిగొండ చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, పద్మ నాయకులు, కళింగ గాంగులు, విజయనగర రాజులు, కళింగ గజపతులు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొఘలులు, అసఫ్ జాహీలు మొదలైన ఎన్నో రాజవంశాలచే పాలించబడి పురాణకాలం నుండే తెలంగాణ ప్రాంతం ప్రాశస్త్యంలో ఉన్నది.


  ఎందరో రాజులతో రాజవంశాలతో పాలించబడిన తెలంగాణ ప్రజలు నిజాం రాజుకు ఎందుకు ఎదురుతిరిగారు? ఎందుకు సాయుధులై పోరాడారు? సైన్యాలు వచ్చి నిజాం రాజ్యాన్ని ఎందుకు భారత్ లో విలీనం చేసుకున్నాయి?


తెలంగాణ ప్రజాపోరాటం


    నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాయుధులై జరిపిన పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా గుర్తిస్తున్నారు. కానీ "చైతన్య వంతులైన ప్రజలు స్వేచ్ఛను కోరి స్వాతంత్య్రం కోసం, ప్రజా పరిపాలన కోసం చేసిన పోరాటం"గా చరిత్ర అంగీకరించింది.


   మహ్మదీయ రాజులైన అసఫ్ జాహీ వంశస్తులు వలసవచ్చిన వారిలా కాకుండా స్థానికులుగా హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. ప్రజలతో మమేకమై మత భేదాలు పాటించకుండా హిందువులకు తమ కొలువులో అత్యున్నత పదవులిచ్చినట్టు చరిత్ర చెబుతున్నది. అయినా మరి ఎందుకు ప్రజలు ఎదురుతిరిగారు? నిజాం రాజు అయిన నిజామలీ  క్రీ.శ. 1800 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళతో "సైన్య సహకార ఒప్పందం" చేసుకున్నాడు. దీనితో నిజాం రాజ్యం తన స్వాతంత్ర్యాన్ని కోల్పోయి బ్రిటిష్ 'ఈస్ట్ ఇండియా కంపెనీ'కి సామంత రాజ్యంగా మారింది.. క్రమంగా నైజాం రాజ్యం విచ్చిన్నం కావడం మొదలైంది.


   1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు, 1892లో హైదరాబాద్ లో ఆర్య సమాజం వారి శాఖ ఏర్పడడం, సామాజికోద్యమం, గ్రంథాలయోద్యమం మూలంగా ప్రజలు చైతన్యవంతులయ్యారు. నిజాం వెలుపల పరిస్థితుల్ని అవగతం చేసుకున్న ప్రజలలో స్వాతంత్ర కాంక్ష మేల్కొంది.


  నైజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో1930లో ఏర్పడ్డ 'నైజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ' పాత్ర ముఖ్యమైంది. అలాగే ఎవరి ప్రాధాన్యతలు వారికున్నా 1938లో ఏర్పడ్డ 'హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్' పాత్రకుడా చెప్పుకోదగ్గదే.  వీటి పేరుతో కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ఆర్యసమాజం మొదలైనవారు నిజాం వ్యతిరేక, రజాకార్ల వ్యతిరేక ఉద్యమాలు నడిపారు.


   ఈ ఉద్యమాలు నడుస్తున్న కాలంలోనే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన సమయంలో 1947 ఆగస్టు 15న ఇండియాకు స్వాతంత్య్రం ప్రకటించబడింది. కానీ నిజాం తన హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్ లో విలీనం కాదని, స్వతంత్ర రాజ్యంగా ఉంటుందని కూడా ప్రకటించాడు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ 'ఐక్యరాజ్య సమితి'కి లేఖ రాశాడు.


   నిజాం నిర్ణయంతో ప్రజల్లో వ్యతిరేకత ఉవ్వెత్తున ఎగసింది. సహాయ నిరాకరణ చేశారు. వేలాది మందితో జైళ్ళు నిండిపోయాయి. ప్రభుత్వం నిర్బంధాన్ని విధిస్తూ దౌర్జన్యాలకు దిగజారింది. రజాకార్ల ఆగడాలకు అంతులేకుండా పోయింది. అహింసాయుతంగా కొనసాగే ఉద్యమం హింసాత్మకంగా మారింది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 'ఇండియన్ యూనియన్' ను సైనిక చర్య జరుపవలసిందిగా కోరింది. ఎన్ని సంప్రదింపులు జరిపినా నిజాం వినలేదు. చిట్టచివరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో భారత సైన్యాలు హైదరాబాద్ చేరుకుని నిజాంపై సైనికచర్య జరిపింది. 1948 సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయాడు. నిజాం రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేశారు.


  నిజాం నిరంకుశత్వం వల్ల అలసిపోయిన ప్రజలు స్వేచ్చా వాయువులు పీల్చకముందే ఆంధ్ర వలసవాదుల చేతుల్లో బలయ్యారు. 75ఏళ్ళ స్వతంత్ర భారతంలో సుమారు 60ఏళ్ళకు పైగా తెలంగాణ ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారు. అనేక ప్రజా ఉద్యమాల అనంతరం 2014 జూన్2న తెలంగాణ ప్రజలు నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందారు.


   తెలంగాణ ఉద్యమకారులు పేర్కొన్నట్టుగా తెలంగాణను 'బతుకు తెలంగాణ', 'బంగారు తెలంగాణ'గా మార్చుకునేందుకు మరో ఉద్యమం అవసరమైతే తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. 


  ఈ సందర్భంగా "ఈ నేలతల్లి బిడ్డలు స్వేచ్చావాయువులు పేల్చేందుకు, వారి ఆయువును వదులుకున్న తెలంగాణ అమరవీరులను స్మరించుకుందాం. వారిస్ఫూర్తితో ముందుకుపోదాం."



(తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల సందర్భం)

16.09.2022 5:00pm-8:11pm)



0/Post a Comment/Comments