దానశీలము
దానశీలము అనే ఈ పాఠ్యభాగ రచయిత బమ్మెర పోతన. ఇతను 15వ శతాబ్దానికి చెందిన వాడు. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతనకు సహజ పండితుడు అని బిరుదు గలదు. వీరభద్ర విజయం, భోగినీ దండకం, నారాయణ శతకం మొదలగునవి రచించాడు.ఇతను రచించిన శ్రీమత్ భాగవతం అష్టమ స్కంధంలోని వామన చరిత్ర నుండి ఈ పాఠ్యభాగం స్వీకరించబడింది. భాగవతము పురాణ ప్రక్రియకు చెందినది.
‘ఎవరిభాష వాళ్ళకు వినసొంపు’
‘ఎవరిభాష వాళ్ళకు వినసొంపు’ పాఠ్యభాగ రచయిత డాII సామల సదాశివ. సదాశివ గారు బహు భాషావేత్త. సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో పండితుడు. ఇతను రచించిన ‘అమ్జద్ రుబాయీలు’ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అనువాద రచనా పురస్కారం, ‘స్వరాలయలు’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ డిగ్రీని ఇచ్చాయి. సామల సదాశివ గారు తన స్వీయ అనుభూతులతో రచించిన “యాది” అనే వ్యాస సంపుటిలోనిదే ‘ఎవరి భాష వాళ్ళకు వినసొంపు’ అనే ఈ ప్రస్తుత పాఠ్యభాగం.
వీర తెలంగాణ
ఈ పాఠ్యభాగ రచయిత దాశరథి కృష్ణమాచార్య. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన ఉద్యమ వీరుడు. ‘ముసలి నక్కకు రాచరికంబు తగునే’ అంటూ నిజాంను వ్యతిరేకించి జైలు పాలైన ధీరుడు దాశరథి కృష్ణమాచార్య. జైలుకు వెళ్ళి జైలు గోడల మీద కుడా నిజాంకు వ్యతిరేకంగా పద్యాలు రాసాడు. తెలుగు సాహిత్యానికి ఇతడు చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. దాశరథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థానకవి.
తెలుగులో గజల్ ప్రక్రియకు ఆద్యుడు దాశరథి.గాలిబ్ గజళ్ళను తెలుగులోకి అనువదించాడు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితాపుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలోచనాలు, నవమి, యాత్రాస్మృతి వ్మోదలైనటువంటి గ్రంథాలను, ఆణిముత్యాల వంటి సినిమా పాటలను రచించాడు.
ప్రస్తుత పాఠ్యభాగం వీర తెలంగాణ డా. దాశరథి కృష్ణమాచార్యులు రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి రుద్రవీణ నుండి గ్రహించబడింది.
కొత్తబాట
కొత్తబాట అనే ఈ పాఠ్యభాగ రచయిత పాకాల యశోదారెడ్డి గారు. ఈవిడ ‘తెలుగులో హరివంశాలు’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. యశోదారెడ్డి గారు రాష్ట్ర అధికారభాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ. వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం ‘మహాలక్ష్మి ముచ్చట్లు’ ఎంతో ప్రజాదరణ పొందింది. ఇంకా ఎన్నో పరిశోధనా గ్రంథాలను మరియు కథా సంపుటాలను వెలువరించారు. కొత్తబాట పాఠ్యభాగం ‘నేషనల్ బుక్ ట్రస్ట్’ వారు ప్రచురించిన ‘యశోదారెడ్డి ఉత్తమ కథలు’ అనే గ్రంథం నుండి గ్రహించబడింది.
నగరగీతం
నగరగీతం పాఠ్యభాగ రచయిత అలిశెట్టి ప్రభాకర్. అలిశెట్టి ప్రభాకర్ రచించిన ‘అలిశెట్టి ప్రభాకర్ కవిత’ అనే గ్రంథంలోని ‘సిటీ లైఫ్’ అనే మినీ కవితలలో కొన్నిటిని ‘నగరగీతం’ గా కూర్చడం జరిగింది.
జగిత్యాల జిల్లా జగిత్యాల ఇతని జన్మస్థలం. మొదట చిత్రకారుడుగా జీవితం ప్రారంభించి, కవిత్వరంగంలోకి ప్రవేశించి, జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్ లలో స్టూడియోలను ఏర్పాటు చేసుకొని జీవికకోసం ఫోటోగ్రాఫర్ గా జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు. ఎన్నడు సంపాదన కొసం ఆరాటపడలేదు. తన కళ ప్రజల కోసమే అని చివరివరకు నమ్మాడు.
భాగ్యోదయం
ఈ పాఠ్యభాగ రచయిత కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎం.బి.గౌతం రచించిన ‘భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర’ గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజ్ రాసిన వ్యాసంలోనిది ఈ పాఠ్యభాగం.
కృష్ణస్వామి ముదిరాజ్ రాజకీయ వేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్ట్, సమాజ సంస్కర్త. 1957 లో హైదరాబాద్ నగరమేయర్ గా ఎన్నికై నగరాభివృద్ధికోసం రాబోయే ముప్ఫైఏండ్ల అవసరాలకు అనుగుణంగా ‘మాస్టర్ ప్లాన్’ తయారు చేసిన దార్శనికుడు. ‘దక్కన్ స్టార్’ అనే ఆంగ్లవార పత్రికను స్థాపించాడు. హైదరాబాద్ నగరాన్ని చాయాచిత్రాల్లో వెయ్యి పేజీల్లో బంధించి ‘పిక్టోరియల్ హైదరాబాద్’ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్యరూపంగా మనకు అందించాడు.
1948లో ఉర్దూలో ‘హైదరాబాద్-కి తీస్ సాలా సియాసి జదు జిహిద్’ పేరుతో హైదరాబాద్ లోని రాజకీయ ఉద్యమాలపై గ్రంథాన్ని రాశాడు. భారత ప్రభుత్వంచే ‘భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర’ రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా నియమితుడయ్యాడు.
“తన మిత్రుడు భ్యాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసాడు.”