నవ భారత నిర్మాత డా.అంబేడ్కర్...రచయిత రాథోడ్ శ్రావణ్ సోనాపూర్ నార్నూర్ ఆదిలాబాద్

నవ భారత నిర్మాత డా.అంబేడ్కర్...రచయిత రాథోడ్ శ్రావణ్ సోనాపూర్ నార్నూర్ ఆదిలాబాద్

 
నవ భారత నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ ..రచయిత రాథోడ్ 


పేదోడి  బతుకును మార్చెను
భవితకు దారి చూపెను
దళితుల స్థితిని చూసెను
రాజ్యాంగం రచించెను
వారెవ్వా !  అంబేడ్కరా!
కలియుగాన దేవుడా !!

నవ భారత దార్శనికుడు 
నవతరం బుద్దుడు 
గొప్ప విద్యావంతుడు 
దళితుల బాంధవుడు 
వారెవ్వా! మెరిసిన రత్నమా.!
మా దళిత జాతి ముత్యమా.!!

"డా.అంబేడ్కర్ గొప్ప వ్యక్తి,ప్రపంచ విజ్ఞాన సంపన్నుడు,భారత రాజ్యాంగం పితగా.!, నవ భారత నిర్మాతగా.! దళిత జాతి ఆపద్బాంధవుడిగా.!దళితుల ఆరాధ్యదైవంగా.! ప్రపంచ మేధావులచే ప్రభావితమవడమే కాకుండా తాను రచించిన రచనలచే ఇతరులు ప్రభావితమయ్యే విధంగా తగు చర్యలు తీసుకున్న స్ఫూర్తి ప్రదాత, గొప్ప దార్శనికుడు, తాత్వికాలోచనలు గల హేతుబధ్ధమైన సామాజిక విప్లవవాది.బోధించు-సమీకరించు-పోరాడు అనే  నినాదాలతో దేశ ప్రజలను జాగృతం చేసిన మేధావి."

బడుగు బలహిన వర్గాల ఆశాజ్యోతి:-

భారత దేశంలో ఈ నాటికి ప్రజల హృదయాల్లో పదిలంగా ఉండి, ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావవంతులైన వారిలో ఒకరిగా, దేశ విదేశాలలో అత్యధికంగా  పూజింప బడుతున్న  వ్యక్తులలో 20వ శతాబ్ది మహాపురుషులలో
మన భారత రాజ్యంగ పితామహుడు
డా. బాబా సాహేబ్ అంబేడ్కర్ ఒకరు. విదేశాల్లో డబ్బు సంపాదించడానికి ఎన్నో అవకాశాలు వచ్చినా, సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్న  తన మాతృభూమి కోసం తన దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గ ప్రజల కోసం అహర్నిశలు అలోచించి వారి జీవితాల్లో వెలుగును చూసి తన జీవితమును ప్రజల హక్కులు, న్యాయం కోసం  అంకితం చేసిన మహానుభావుడు ఈ  రోజు వారి 132వ జయింతిని  భారతీయులతో పాటు ప్రపంచం దేశాలు తన యొక్క విగ్రహాలకు,చిత్రపటాలకు పూలమాలలు వేసి ఎంతో ఘన నివాళులు అర్పిస్తున్నారు.

డా.భీంరావు రాంజీ అంబేడ్కర్  14 ఏప్రిల్ 1891 లో అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ సమీపంలో 
 "మోవ్"  అను గ్రామంలో   రాంజీ సక్పా ల్, భీమాబాయి అను పుణ్యదంపతులకు జన్మించాడు. అతని సతీమణిలు రమాబాయి అంబేడ్కర్,సవితా అంబేడ్కర్
స్వస్థలం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని మందనగర్ తాలుకా పరధిలోని అంబేవాడ గ్రామము.
అతని తండ్రి అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో సైనికోద్యోగి, తండ్రి ప్రోత్సాహంతో బొంబాయిలో ప్రాథమిక ఉన్నతోభ్యాసం చేసి బి.ఏ ముంబై విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేశారు.అప్పటి బరోడా రాజ్యానికి చెందిన  మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ సహాయం అందుకొని విదేశానికి వెళ్ళి కొలంబియా విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఏ; పి హెచ్ డి; చదవి ఆ తర్వాత  లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి యం.ఎస్సి; డి.ఎస్సి డిగ్రీలు చేసి బార్. ఎట్. లా, ఎల్.ఎల్.డి;‌ డి.లిట్ డిగ్రీలు పొందాడు. విశ్వవిజ్ఞానాన్ని సంపాదించిన విజ్ఞాన పిపాసి అంబేడ్కర్ చరిత్ర,రాజనీతి,న్యాయ, అర్థశాస్త్రాలలో అనేక డిగ్రీలు చేసి మన దేశ చరిత్ర, ఆర్థిక, న్యాయ,రాజనీతి వ్యవస్థ పై సమగ్ర పట్టు సాధించాడు.భారత ఆర్థిక వ్యవస్థ పై అనేక గ్రంధాలు ,పరిశోధక వ్యాసాలను రచించిన గోప్ప ఆర్థికవేత్త. 

అంబేడ్కర్ కు విద్యపట్ల ఎనలేని ప్రేమ:-

అంబేడ్కర్ కు విద్యపట్ల ఎనలేని ప్రేమ అందుచే 
ప్రపంచవ్యాప్తంగా గల ప్రముఖుల రచనలు చదివి ప్రభావితుడై వాటి ఫలితాలను సమాజ సముద్దరణ కోసం ఉపయోగించాడు.
విద్యార్థిగా ఉన్న సమయంలో గౌతమ బుద్దుని బోధనలు,బెంజిమన్ ప్రాంక్లిన్ ,రానడే ,రూసో,వాల్టర్ లిప్ మాన్, జార్జి బెర్నార్డ్ షా, మహాత్మా జ్యోతిభా పూలే వంటి మేధావులచే ఎంతో ప్రభావితుడై స్ఫూర్తిని పొందాడు. భారతీయ కులవ్యవస్థ పై పరిశోధనాత్మక వ్యాసం రాసి ఆంథ్రోపాలజీ సెమినార్ లో చదివాడు.1920లో మూక్ నాయిక్, అనే మరాఠీ పక్షపత్రికను స్థాపించాడు."హూ ఆర్ శూద్రాస్ " అనే గ్రంధంలో  భారత దేశంలో ఉన్న కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించాడు.1924లో  బహిష్కృత కారిణి సభను ప్రారంభించి సామాజిక మార్పు కోసం కృషి చేశారు.

1946లో  రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికై
ఆ తరువాత 28 ఫిబ్రవరి1947లో  *"రాజ్యాంగ ముసాయిదా కమిటీ"* కి అధ్యక్షునిగా
ఎన్నికవ్వడంతొ
సమాజ సమస్యలను తీర్చడానికి చక్కని అవకాశం లభించింది. సమాజంలో అట్టడుగు వర్గాల వారికి సరైన ప్రాతినిధ్యం లభించాలనె ఉద్ధేశ్యంతో వారికి రాజ్యాంగంలో  ప్రత్యేక హక్కులను కల్పించారు.భారత రాజ్యాంగంలోని పద్నాలుగవ
అధికరణంలో - చట్టం ముందు అందరూ సమానులే అని అన్నారు. పదిహేనవ అధికరణంలో " కుల ,మత, వర్ణ,వర్గ, విచక్షణలు ప్రభుత్వ ఉద్యోగాలలో చూపరాదు అని చెప్పారు. పదహారవ
అధికరణంలో - షెడ్యూలు కులాల వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. పదిహేడవ అధికరణంలో 1. విద్యారంగంలో ప్రత్యేక కల్పన 2. ఎన్నికలలో రిజర్వేషన్ల సౌకర్యాల కల్పన గుర్చి కృషి చేశారు.భారత దేశానికి ఒక ఆదర్శ రాజ్యాంగం ఉండాలనే ఉద్దేశ్యంతో తాను జన్మించిన కాలం నుండి మరణించే దాక సమాజ సమస్యలు ముఖ్యంగా అసమానతలను ఎదిరించాడు.విద్య ద్వారా మాత్రమే అన్ని సమస్యలను  పరిష్కరించవచ్చని భారత విద్యారంగాన్ని అభివృద్ది పర్చడానికి అహర్నిశలు శ్రమిస్తూ సమాజంలో నివసించుచున్న నిమ్నవర్గానికి "నిర్భంధవిద్య" అవసరమని భావించి రాజ్యాంగ రక్షణలు కల్పించాడు. ప్రపంచానికే తలమానికమైన లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించడమే  కాకుండా నవ స్వాతంత్ర దేశాలకు ఆదర్శంగా ఉండేటట్లు   రచించాడు.

సామాజిక సమస్యలను స్వయంగా అనుభవించి,భావితరాల వారికి  వాటి చాయలు కూడా కానరాకూడదనే  ప్రధాన ఆశయంతో 
సమాజంలో జరుగుతున్న అనేక రకాల ఇబ్బందులను,సమాజ రుగ్మతలైన అంటరానితనం,కుల వ్యవస్థ విధానాన్ని విమర్శించి అవమానాలను కళ్ళార చూసిన అతడు
 అస్పృశ్యత నివారణ కోరకు అవిరళ కృషి చేసి బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలుగొందిన అంబేడ్కర్  చిరస్మరణీయుడు. భారత దేశానికి ఆ భగవంతుడు పంపిన  మానవ చరిత్ర పటలానికే ధ్రువతార
 06 డిసెంబర్ 1956లో రాలిపోయింది.
అతని సేవలను గుర్తించిన  భారత ప్రభుత్వం 31 మార్చి1990లో  మరణాంతరం  దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న ను ప్రధానం చేయడం అత్యంత అభినందనీయం.

 

(వ్యాసకర్త: ఉపన్యాసకులు,  ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంద్రవెల్లి ,పూర్వ అధ్యక్షులు ఉట్నూరు సాహితీ వేదిక ఆదిలాబాద్ జిల్లా )
రాథోడ్ శ్రావణ్
9491467715

0/Post a Comment/Comments