ఉద్యమ ఆకాంక్షల వేదిక అవసరం ఎందుకు? బంగారు తెలంగాణ భ్రమలతో తెలంగాణ ప్రజానీకాన్ని మోసగించి నందుకు.

ఉద్యమ ఆకాంక్షల వేదిక అవసరం ఎందుకు? బంగారు తెలంగాణ భ్రమలతో తెలంగాణ ప్రజానీకాన్ని మోసగించి నందుకు.

ఉద్యమ  ఆకాంక్షల వేదిక అవసరం ఎందుకు?  బంగారు తెలంగాణ భ్రమలతో తెలంగాణ ప్రజానీకాన్ని మోసగించి నందుకు.


- వడ్డేపల్లి మల్లేశము, 9014206412.


తమ జీవితం బాగుండాలని, తమ పిల్లలు మంచి భవిష్యత్తు తో జీవించాలని, ఈ దేశ సంపదను వనరులను సద్వినియోగం చేసుకునే క్రమంలో ఉద్యోగాలు నిండైన ఉపాధి కల్పించ బడాలని, పేదరికం నిర్మూలించబడి అంతరాలు, అసమానతలు లేని సమ సమాజం ఈ దేశంలో స్థాపించబడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తమ భవిష్యత్తు అంధకారం అయిందనే కారణంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నుండి తెలంగాణ విడిపోవడానికి దాదాపుగా 65 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేర్పాటు ఉద్యమం కొనసాగింది.

బుద్ధి జీవులు, మేధావులు, తత్వవేత్తలు, కొందరు రాజనీతిజ్ఞత గలిగిన ఉద్యమకారులు నాయకత్వం వహించడంతో తెలంగాణ భావజాలం ఎల్లెడలా విస్తరించినది అనడంలో సందేహం లేదు. పైగా టిఆర్ఎస్ పార్టీ తోనే తెలంగాణ ఆవిర్భవించిందని, సామాన్య ప్రజానీకం, విద్యార్థులు, విభిన్న వర్గాల వారు చేసిన త్యాగాలను మరిచి  తెలంగాణ కోసం చేసిన త్యాగాలను తమ ఖాతాలోనే వేసుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఎండగట్ట వలసిన అవసరం ఎంతగానో ఉన్నది.


ఉద్యమం వరకే ఆకాంక్షలు:

తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మవిశ్వాసం అనే ప్రధానమైన నాలుగు ఆకాంక్షలను టిఆర్ఎస్ పార్టీ తో పాటు ఉద్యమ శక్తులు ,తెలంగాణ జెఎసి, తదితర ప్రజా సంస్థలు అన్నీ కలిసి నిర్ణయించడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావానికి విభిన్న సంస్థలు సమాంతరంగా నిర్వహించిన పోరాట కార్యక్రమానికి వెన్నుదన్నుగా టిఆర్ఎస్ పార్టీ 2001 నుండి 2014 వరకు తన కార్యక్రమాలను ప్రజల సహకారంతో విస్తృత పరిచిన విషయాన్ని కాదనలేము. కానీ పార్టీ నిర్మాణంలో క్రియాశీలకంగా పని చేసినటువంటి వాళ్లు క్రమంగా ఒక్కరిని పార్టీ నుండి గెంటి వేయడం అనేది కూడా తెలంగాణ పోరాటం తో పాటు సమాంతరంగా జరిగింది. పార్టీ నాయకత్వానికి సూచనలు చేసిన, ప్రశ్నించిన, పట్టించుకోకపోవడం కాకుండా వారిని పార్టీ నుంచి తొలగించడంతో అనేకమంది సీనియర్ కార్యకర్తలు, ఉద్యమ వీరులు పార్టీకి దూరమయ్యారు. ఆ రుగ్మత కొనసాగింపే ఇటీవల మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం, హుజురాబాద్ ఎన్నిక కోసం పాకులాడడం.


2014లో ప్రజలందరూ టిఆర్ఎస్కే మద్దతు:

    సకల జనుల సమ్మె ,వంటావార్పు, కుల సంఘాల పక్షాన పోరాటాలు వంటి అనేక పోరాటాలు టీఆర్ఎస్ పార్టీకి వన్నె తెచ్చిన వి. అనేక ఉద్యమ సంస్థలు కుల సంఘాలు భౌగోళిక తెలంగాణ అవసరం లేదని ప్రజాస్వామిక తెలంగాణ కోసమే తాము పని చేస్తున్నట్లు ప్రకటించడం కూడా జరిగింది.

 టిఆర్ఎస్ పార్టీ పరంగా అలాంటి వాగ్దానం కావాలని కుల సంఘాలు ప్రజాస్వామ్య సంస్థలు ఆ రోజుల్లో డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఉద్యమం కొనసాగుతున్నప్పుడు బలవంతమైన టువంటి శత్రువును ఎదుర్కోవడం ప్రధానం కనుక జెండాలను పక్కన పెట్టి తెలంగాణ అనే ఏకైక ఎజెండాతో కలిసి రావాలని వచ్చిన పిలుపుమేరకు ఉద్యమ శక్తులు తమ ప్రధాన డిమాండ్ ను పక్కన పెట్టారు.

       ఆ కారణంగానే 2014లో జరిగినటువంటి తెలంగాణ తొలి ఎన్నికలలో తెలంగాణ ఆవిర్భావానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం అయినటువంటి కాంగ్రెస్, బీజేపీని కాదని టిఆర్ఎస్ పార్టీకి సకల ప్రజానీకం మద్దతు తెలపడంతో పెద్ద మొత్తంలో గెలుచుకోవడం ద్వారా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి ఉద్యమ శక్తులను నాయకులను ఒక్కొక్కరిని బయటికి పంపి వేయడంతోపాటు ఉద్యమాన్ని నీరుగార్చి,నిర్వీర్యం  చేసినటువంటి ఉద్యమ ద్రోహులకు స్థానం కల్పించడంతో ఇవాళ పార్టీ ,మంత్రివర్గం కూడా తెలంగానేతర శక్తుల తో నిండిపోయింది. ఇక్కడే తెలంగాణ ఆకాంక్షలకు, ప్రజాస్వామిక తెలంగాణ డిమాండ్కు గండి పడిందని చెప్పవచ్చు.


ఏడేళ్ల పాలన తీరు:

         ఉద్యమకాలంలో ఆంధ్ర ప్రభుత్వాలను విమర్శిస్తూ స్వరాష్ట్రం ఏర్పడితే భాషను రక్షించుకుంటాం అని, గుట్టలు ప్రకృతి వనరులను కాపాడుకుంటామని, టీవీ సినిమా సంస్కృతిలో విప్లవాత్మక మార్పులు చేస్తామని, చివరికి ప్రపంచం నివ్వెరపోయి స్థాయిలో పరిపాలన అందిస్తామని  పార్టీ నాయకత్వం వివిధ వేదికలు, ధూమ్ దాం కార్యక్రమాలలో ప్రజలకు హామీలు ఇవ్వడంతో పాటు వాగ్దానం చేయడం కూడా జరిగింది. ఎక్కడ సమావేశమైన లక్ష ఎకరాలకు నీళ్ల కోసం కుర్చీ వేసుకుని కూర్చుని ఏర్పాటు చేస్తానని ,సుపరిపాలన అందించడానికి కావలి కుక్క వలే ఉంటానని, కరీంనగర్ సింహ గర్జన లో తన పిల్లలకు రాజకీయాలు అవసరం లేదని తామే ఇరువురము రాజకీయాలకు ప్రజా జీవితానికి అంకితం అవుతామని ముఖ్యమంత్రి అయిన తర్వాత హామీలు ఇవ్వడం జరిగింది.

       ఉద్యమకాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముఖ్యమంత్రి పదవి దళితులకు ఇస్తామని, దళితులకు 3 ఎకరాల భూమి తోపాటు ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని, ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తామని భూమిలేని పేద లందరికీ భూమిని పంపిణీ చేసి కోటి ఎకరాలకు నీరు ఇవ్వడానికి కృషి చేస్తామని హామీలు, ఇచ్చిన వాగ్దానాలకు లెక్కేలేదు.


ఉద్యమ ఆకాంక్షలు, వాగ్దానాలకు దూరంగా ప్రభుత్వం:

     తెలంగాణ ఉద్యమ కాలం లోనూ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో చేసిన వాగ్దానాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపో గా పార్టీ నిర్మాణం ,ఎన్నికలలో గెలుపు కోసం పడరాని పాట్లు పడుతూ ప్రభుత్వ ధనం ,అధికార దుర్వినియోగం విచ్చలవిడిగా కొనసాగినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు రాగానే మద్యం, మనీ పంపిణీ విచ్చలవిడిగా చేయడంతోపాటు సామాన్య ప్రజానీకాన్ని బానిసలుగా పావుగా వాడుకోవడం జరిగింది. అధికార పార్టీని చూసి మిగతా పార్టీలు కూడా అదే వరుసలో పోవడానికి ప్రయత్నించే క్రమంలో ప్రజలు ఆశాజీవులు బానిసలుగా తయారు అయినటువంటి వైనం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనబడుతుంది.

      తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమకాలంలో ఎంతో బాధ్యత తో పోరాడిన టువంటి ప్రజానీకం రాష్ట్రం ఏర్పడి పరిపాలన కొనసాగుతుంటే తెలంగాణ ఆశలు ,ఆశయాలు, ఆకాంక్షల గురించి ఏనాడూ ప్రభుత్వాలను  ప్రశ్నించిన దాఖలా లేదు. కారణం పైన చెప్పుకున్నాం. సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల సందర్భంలోనూ జిహెచ్ఎంసి వంటి ప్రధానమైన ఎన్నికల సందర్భంలో అధికారపార్టీ పడరాని పాట్లు పడుతూ గెలుపుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నట్లు విమర్శలు వస్తున్నాయి.

       ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుభవించిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో పొందలేకపోయినామంటే ఎంత నిర్బంధ పాలన కొనసాగుతుందో ఇటీవలి కొన్ని అక్రమ అరెస్టులు, లాకప్ డెత్ లు, నిర్బంధాలు తెలియజేస్తున్నాయి. నిరసన తెలపడానికి ఉన్నటువంటి వేదిక ఇందిరాపార్క్ ను అనుమతించక పోవడంతో పాటు సభలు-సమావేశాల పైన కూడా నిఘా వేసి అనుమతించకపోవడం సామాన్యుల నుంచి మేధావుల వరకు ఆలోచింపజేసింది.


హామీలను పక్కదారి పట్టించి:

తమ కుటుంబ సభ్యులందరినీరు విడుదల చేయాలని కూడా రాజకీయాల్లోకి దింపి పదవులను పంపిణీ చేసి హామీకి తూట్లు పొడిచారు. దళితులకు ముఖ్యమంత్రి అనే మాట నినాదంగా మారిపోగా నేటికీ ఆ ప్రశ్నకు ఏనాడు కూడా జవాబు రాలేదు ప్రభుత్వం నుండి.  దళితులకు 3 ఎకరాలు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సంగతి కొందరికి మాత్రమే పంపిణీ చేయగా అనేక చోట్ల నాణ్యతా లోపం గా కూలిపోయినట్లు మనం వీడియోలో టీవీలలో చూసినాము. క్రియాశీలక విషయాలలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ బహుశా గత ఏడేళ్లలో దళితుల సమస్యలపై ఏర్పాటుచేసిన దే మొదటిది కావచ్చు.

ప్రకృతి , గుట్టల విధ్వంసం యధేచ్చగా కొనసాగుతుండగా అందులో అధికార పార్టీకి చెందిన వాళ్లే భాగస్వాములుగా ఉండటం విచారకరం. విడ్డూరమైన విషయం. పార్టీ ఫిరాయింపులు పెరిగిపోయి ప్రతిపక్షమే లేకుండా చేసినటువంటి ఘనత బహుశా తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందేమో!

సచివాలయాన్ని ఏనాడు కూడా ఉపయోగించని ప్రభుత్వం సచివాలయం నిర్మాణం పేరుతో ఉన్నదానిని కూలగొట్టి ఆరు వందల కోట్ల రూపాయలతో  తిరిగి నిర్మించడానికి పూనుకోవడం దేనికి సంకేతం? పేద రైతుల రుణ విముక్తి కోసం పంట సాగుకు సహాయంగా ప్రకటించిన రైతు బంధు తో గుట్టలు ,ఎకరాల కొద్దీ ఖాళీ స్థలాలకు, రాళ్లు రప్పల కు ఉన్నత వర్గాలు బడా భూస్వాముల జేబులు నింపడంలో ఆంతర్యం ఏమిటి?

ప్రజలెవరూ డిమాండ్ చేయని మిషన్ భగీరథ వలన 45 వేల కోట్ల రూపాయలు ఖర్చు కావడమే కాకుండా నీరు నిరుపయోగంగా పోవడo దానివల్ల ఎన్నో రోడ్లు విధ్వంసం అయినవి. డబల్ రోడ్లు నేడు సింగల్ రోడ్డు గా మారిన టువంటి దౌర్భాగ్య పరిస్థితులకు తెలంగాణ దర్పణం పడుతుంది.

ఇక ఎన్నికల్లో అధికార పార్టీ కోట్ల రూపాయలు తాయిలాలు గా ప్రకటించడం అనేక పథకాలను అప్పటికప్పుడే ప్రకటించి ఓటర్లను తమ వైపు తిప్పుకుని గెలుపే ప్రధానంగా అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా పోలీసు, అధికార యంత్రాంగాన్ని కూడా తమకనుకూలంగా ఉపయోగించుకుంటున్న సందర్భాలు అనేకం .నేడు హుజరాబాద్ లో కూడా అలాంటి పరిస్థితి కొనసాగుతున్నట్లు గా పత్రికల్లో కథనాలు వస్తున్నాయి నిజం కాదా?   


ఉద్యమ ఆకాంక్షల వేదిక ఇందుకే అవసరం వచ్చింది:

1956, 69 నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రజానీకం ,విద్యార్థులు, ఉద్యమ శక్తులు ఎన్నో త్యాగాలకు పాల్పడ్డారు. మలిదశ పోరాటంలో 1200 పైగా విద్యార్థులు యువకుల బలిదానాల తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ వారిని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు  నిందిస్తూ ఉన్నాయి.

ఉద్యమ కాలంలోనూ, అధికారం చేజిక్కించుకొని పరిపాలన చేస్తున్న నేటి వరకు కూడా గత ఐదేళ్లలో తెలంగాణ ఆకాంక్షలు ఏ మాత్రము నెరవేరని కారణంగా ఖాళీగా ఉన్న ఒక లక్షా 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో పాటు గతంలోనే నియమించబడిన టువంటి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 52 వేల మందిని నేటి ప్రభుత్వం తొలగించడంతో నిరుద్యోగులు ,యువత మనస్థాపానికి గురై అనేక మంది విద్యావంతులు ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు రాష్ట్రంలో జరగడం చాలా బాధాకరం.

ఈ సందర్భంగా తెలంగాణ ఆకాంక్షల కోసం బలంగా పని చేసినటువంటి ఉద్యమ భావజాల శక్తులు, సంస్థలు ,ప్రజా సంఘాలు, కొన్ని రాజకీ య పార్టీలలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారితో గత నెల రోజులుగా అనేక చర్చలు జరిపి హైదరాబాద్లోనూ ఇటీవల వరంగల్లు లోనూ ఉద్యమ ఆకాంక్షల వేదికను నిర్మించడంలో కృతకృత్యులు అయినట్లుగా వార్తల ద్వారా తెలుస్తున్నది. అప్పులు కుప్పోలె పెరిగినప్పటికీ ప్రజల ఆదాయము ఆస్తులు మాత్రం పెరగలేదని  అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు, మంత్రులతో పాటు రాజకీయ పార్టీల వారు భూ కబ్జాలకు పాల్పడుతూ సంపదను కొల్లగొడుతున్న నేపథ్యంలో ప్రజల పక్షాన నిలిచి తాడోపేడో తేల్చుకోవడానికి ఈ వేదిక ఏర్పాటు అయినట్లు వేదిక నాయకుల ప్రసంగాలను బట్టి తెలుస్తున్నది.


అవును నిజమే మరి:

     భౌగోళిక తెలంగాణ కు బదులుగా సామాజిక ,ప్రజాస్వామిక తెలంగాణ కావాలని డిమాండ్ ను ఆనాడే పక్కన పెట్టిన కారణంగా ఈ దుర్గతి పట్టినట్లు అనేకమంది విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీని తీసుకోవడంతో పాటు ప్రభుత్వo అసంబద్ధమైన విధానాలతో మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన దుస్థితి పైన కూడా చర్చించి ప్రజల సమస్యలకు నిజమైన ప్రతినిధులుగా వ్యవహరించడం కోసం ఈ సంస్థ ఏర్పాటు అయినట్లుగా తెలుస్తున్నది.

      ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు అక్రమాలకు, భూకబ్జాలకు పాల్పడి ప్రజలను పట్టించుకోనప్పుడు ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమ రూపంలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో జరిగినటువంటి చారిత్రక సత్యం. బహుశా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాళోజీ నినాదం ప్రకారంగా పోరాటం చేయవలసి రావచ్చు. ఇప్పటికైనా పాలకులు అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు ఎన్నికైన తర్వాత అక్రమ సంపాదన తో ఎదిగిన వారు స్వచ్ఛందంగా ప్రకటించి తమ నిజాయితీని చాట్ కోవాల్సిన అవసరం ఉంది లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

0/Post a Comment/Comments