మహతీ సాహితీ కవిసంగమం - కరీంనగరం: కవితావాణీ నిలయం
ఉపాధ్యాయుడు అడిగొప్పుల సదయ్య సాహితీ సేవలు చిరస్మరణీయం
ఉపాధ్యాయుడు అడిగొప్పుల సదయ్య సాహితీ సేవలు చిరస్మరణీయం
పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా, స్కౌటు శిక్షకునిగా పనిచేయుచున్న ఉపాధ్యాయుడు అడిగొప్పుల సదయ్య ప్రారంభించిన మహతీ సాహితీ కవిసంగమం పలువురు రచయితలకు వారధిగా మారింది. ఎన్నో రకాల ప్రక్రియలలో శిక్షణ ఇస్తూ రాయిస్తూ, ఒకవైపు పద్య కవిత ,మరోవైపు వచన కవితలకు పట్టం కడుతున్నారు. మొదట ఇష్టపదులు అనే ప్రక్రియతో ప్రారంభించిన సదయ్య పలు సంకలనాలు వేశారు.దాశరథి, సినారె, పివి, గాంధీజీ పై సంకలనాలు, గణితంమూర్థ నిస్థితయే సంకలనం, స్వతంత్రభారతం, పర్యావరణ పరిరక్షణ, కార్మికదినోత్సవం, మాతృదినోత్సవం, శ్రీ మద్రామాయణం, ప్లవ నామ ఉగాది సంకలనం, తెలంగాణ పోరాటంపై సంకలనం వంటివి ఆయన వెలువరించారు. ప్రతిరోజు కవితా పండుగ పేరుతో అనునిత్యం వివిధ ప్రక్రియలతో దాదాపు 300 మంది కవులు, రచయితలు వారంలో ఆరు రోజుల పాటు రచనలు చేస్తుంటారు.
సోమవారం నాడు చిత్రకవిత, మంగళవారం నాడు సాహిత్య అంశము, బుధవారం నాడు దత్తపది, గురువారం నాడు ఇష్టపది, శుక్రవారం నాడు ఐచ్ఛిక ప్రక్రియ, శనివారం నాడు పద్యరచనలను రచయితలు చేయడం జరుగుతుంది. దాదాపు సంవత్సరంన్నర పైగా ఈ సాహితీ యజ్ఞం నిరంతరాయంగా కొనసాగుతోంది. కె గీతాశైలజ, దాసరి చంద్రమౌళి, బీరప్పొల్ల అనంతయ్య, లక్ష్మీ రాజేందర్, ముక్కా సత్యనారాయణ , వీ టి ఆర్ మోహన్రావు, కుందారపు గురుమూర్తి తదితరులు ఆయా కార్యక్రమాల నిర్వహణ చూస్తారు. అడిగొప్పుల సదయ్య పర్యవేక్షణలో కొనింటి రమేష్, కామేశ్వరరావు, నరసింహ శర్మ, దొంతరాజు విజయలక్ష్మి తదితరులు కవితలను సమీక్షిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికీ దాదాపు 150 పోటీలు నిర్వహించి ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది. ముక్కా సత్యనారాయణ అధికంగా 132 ప్రశంసాపత్రాలు అందుకోగా, వి టి ఆర్ మోహన్రావు 110 ప్రశంసాపత్రాలు అందుకోవడం జరిగింది. వచన కవిత, వ్యాసాలు దత్తపది, ఇష్టపది, తేటగీతి, ఆటవెలది పద్యాలతో పాటు రగడలు అనే నూతన ప్రక్రియ పరిచయం చేశారు.
మాత్రాఛందస్సు, యతిమైత్రి లక్షణాలతో కూడిన ఇష్టపది అనే ప్రక్రియలో రచయితలతో రచనలు చేస్తున్నారు. 50 ఇష్టపదులు రాసిన వారికి ఇష్టపదిమిత్ర, 100 ఇష్టపదులు రాసిన వారికి ఇష్టపది శ్రేష్ఠ, 200 ఇష్టపదులు రాసిన వారికి ఇష్టపది స్రష్ట, 500 ఇష్టపదులు రాసిన వారికి ఇష్టపది వశిష్ఠ, 1000 రాసినవారికి విశిష్ఠ ఇష్టపది చక్రవర్తి బిరుదు మరియు రు. 1116 ఇస్తున్నారు. ఆంజనేయుడు, శ్రీరంగనాథుడు, శ్రీనివాసుడు, కృష్ణ పరమాత్మ పై భగవద్గీత, రామాయణం, భాగవతాల పై ఇష్టపది వ్రాయించిన మహతీ సాహితీ కవిసంగమము ఇప్పుడు దశావతారాలపై అంశాలను రాయిస్తున్నారు..
ధనుర్మాసం సందర్భంగా 30 రోజులపాటు తిరుప్పావై పాశురాలను రచింప చేసి గోదా దేవి అమ్మవారి కృష్ణ భక్తిలో తరింపజేసి, 30 పాశురాలు రాసిన దాదాపు 40 మందికి సాహితీ చక్రవర్తి బిరుదు పురస్కారం ప్రదానం చేయడం జరిగింది. అంతేకాక సందర్భానుసారంగా కవన పోటీలను నిర్వహిస్తూ తను స్వయంగా అనేక రకాల ప్రక్రియలలో రచిస్తూ డాక్టరేటు సాధించి తెలుగు సాహితీ మాతకు అడిగొప్పుల సదయ్య మహతీ సాహితీ కవిసంగమం ద్వారా చేస్తున్న సేవలను అందరూ అభినందిద్దాం.
ఇట్లు
ప్రవాహిని
తెలుగు సాహితీ సంస్కృతుల వాహిని