స్వాతంత్ర పోరాట స్ఫూర్తి నేడేందుకు కరువయ్యింది. కొరవడిన త్యాగశీలత, ప్రజల పౌరుషాన్ని హరించి వేస్తున్న ప్రలోభాలు. 15..8..21 - వడ్డేపల్లి మల్లేశము9014206412

స్వాతంత్ర పోరాట స్ఫూర్తి నేడేందుకు కరువయ్యింది. కొరవడిన త్యాగశీలత, ప్రజల పౌరుషాన్ని హరించి వేస్తున్న ప్రలోభాలు. 15..8..21 - వడ్డేపల్లి మల్లేశము9014206412

స్వాతంత్ర పోరాట స్ఫూర్తి నేడేందుకు  కరువయ్యింది. 

కొరవడిన త్యాగశీలత, ప్రజల పౌరుషాన్ని హరించి వేస్తున్న ప్రలోభాలు.

15..8..21

- వడ్డేపల్లి మల్లేశము9014206412


75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఒక్కసారి గతంలోకి వెళ్లి పూర్వ నేపథ్యంతో పాటు పోరాట  చరిత్రను నెమరు వేసుకున్నప్పుడు ఆటుపోట్లు, సాఫల్య వైఫల్యాలు ఎన్నో దర్శనమిస్తాయి. ఆనాడు ఇంతగా చైతన్యం లేదని మీడియా అవకాశాలు కూడా లేవని మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. కానీ నేడు అనేక రకాల మీడియా అవకాశాలు వచ్చి విద్యారంగంలో ఉన్నతమైన ఫలితాలు కొంతవరకు సాధించినప్పటికీ ప్రస్తుత సమకాలీన, రాజకీయ ,చారిత్రక, ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయి ఉండదానికి ప్రధాన కారణం పోరాట స్ఫూర్తి, పౌరుషం, ఆత్మస్థైర్యం, దేశభక్తి కొరవడటమే  అని తెలుస్తున్నది.కనుక ఏ సౌకర్యం లేని ఆనాటి పోరాటమే నిజమైన చైతన్యానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. అందుకే నేటి మన సమకాలీన వ్యవస్థను గతంతో పోల్చుకుంటే తృప్తి కలగడం లేదు.


ఉద్యమం స్ఫూర్తి పోరాట చైతన్యాన్ని కలిగించిన నినాదాలు:

ప్రత్యక్షంగా 190 సంవత్సరాలు పరోక్షంగా వందలాది సంవత్సరాలుగా ఆంగ్లేయులు ఈ దేశాన్ని కుట్రపూరితంగా దుర్భర దారిద్ర్యంలోకి నెట్టి దుష్ట పరిపాలన కొనసాగించి అన్ని రంగాలలో  ఈ దేశాన్ని పరాయీ కరించారు. కుల వృత్తులు అంతరించడం, ఉపాధి అవకాశాలను కోల్పోవడం, బానిస జీవితానికి అలవాటు పడటం, ఆధిపత్య భావజాలం పెరిగిన కారణంగా సామాన్య ప్రజానీకం నిస్సహాయంగా గడపవలసి వచ్చింది.


ఇలాంటి పరిస్థితులు మరి నేడు లేవా?

అంటే మరింత దుర్భర పరిస్థితులు ఈ దేశంలో వివిధ రాష్ట్రాలలో తాండవిస్తున్నవి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అయితే ఉద్యమ కాలంలో మనం ఎంచుకున్న కొన్ని నినాదాలు మనకు తెలియకుండానే మన శక్తిని, పరాక్రమాన్ని, ధైర్యాన్ని రెట్టింపు చేసి కదన రంగం లోకి దూకే లా చేశాయి. మరొకవైపు మనం ఎంచుకున్న నినాదాలు ఆంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించిన నే కాకుండా వారిని ఆందోళనకు గురి చేసి వెన్నులో చలి పుట్టించినవి.

నినాదాలకు అంత శక్తి ఉంటుంది. ఇప్పటికీ ఆరోగ్యమే మహాభాగ్యము, తృప్తిని మించిన ధనం లేదు, జై జవాన్ జై కిసాన్ వంటి మాటలు అజ్ఞాతమైన అనుభూతికి లోను చేసి మనలో భావావేశాన్ని నింపుతాయి. కర్తవ్య దీక్ష కు పురికొల్పుతాయి. అవునంటారా? లేదా?

 "స్వరాజ్యం నా జన్మ హక్కు" అనే నినాదాన్ని కాక బాప్టిస్టా రూపొందించినప్పటికీ దీనిని తిలక్ స్వీకరించి విస్తృత పరచడంలో తోడ్పడ్డాడు. తద్వారా స్వాతంత్ర్య కాంక్ష ప్రజలలో బలంగా పెరగడానికి ఊరు వాడ జన రన నినాదంగా రూపాంతరం చెంది ఆంగ్లేయులను నిద్రపోనివ్వ లేదు. నినాదంతో నాయకులు కార్యకర్తలు ప్రజలు ఎందరెందరో స్ఫూర్తిని పొంది ప్రభావితులయ్యారు.

 "జై హింద్" హైదరాబాద్ నగరానికి చెందిన అబిద్ హసన్సఫ్రాని జర్మనీ లో సుభాష్ చంద్రబోస్ సైనిక మద్దతు సమీకరిస్తున్న కాలములో విభిన్న మతాల మధ్యన ఏకరూపత సాధించడం కోసం పరస్పరం పలకరించుకుని ఐక్యత నినాదాన్ని ఇవ్వడం కోసం జైహింద్ అంటే బాగుంటుందని జర్మనీలో విద్యార్థిగా ఉన్న సఫ్రాని ఈ నినాదాన్ని రూపకల్పన చేసినట్టుగా తెలుస్తున్నది. స్వతంత్ర పోరాట కాలం లోనే కాకుండా స్వాతంత్ర్యానంతరం నేటికి కూడా సభలు సమావేశాల్లో మాట్లాడిన అనంతరం జైహింద్ అనడం ఒక  ఆనవాయితీగా మారిపోయింది అంటే అది నాడు ఎంత ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు.

 "సైమన్ గో బ్యాక్" 1928- 29 కాలంలో భారతదేశంలో ప్రజల స్థితిగతులను తెలుసుకోవడానికి వచ్చినటువంటి సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి ఆనాడు  meher ali ఈ నినాదాన్ని అందించాడు. ప్రధానంగా సైమన్ కమీషన్ ను వ్యతిరేకించడం కోసం వీరి నాయకత్వంలో ఎదురేగి న వందలాది మంది సైమన్ కమీషన్ ముందు తమ నిరసన తెలిపి ఈ నాదాన్ని పదేపదే ఉచ్చరించి వారిలో వణుకు పుట్టించార ట. ఆ నినాదం దాదాపుగా స్వాతంత్ర్యం వచ్చేవరకు అవసరానుగుణంగా రూపాంతరం చెందినప్పటికీ దాని అర్థం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తెలపడమే.

"ఇంక్విలాబ్ జిందాబాద్" భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ వంటి విప్లవ పోరాట యోధులను కదిలించి దేశభక్తిని రగిలించిన టువంటి నినాదం ఇది. ప్రముఖ ఉర్దూ కవి మౌలానా నోటినుండి జాలువారిన ఈ దిక్కార స్వర గుళిక  బాగా తోడ్పడింది అనడంలో సందేహం లేదు. భగత్ సింగుకు ఉరిశిక్ష ప్రకటించిన అనంతరం పోలీస్ స్టేషన్ లోనూ, కోర్టులోనూ ఈ నినాదాన్ని పదేపదే ఉచ్చరించి తన వీరత్వాన్ని చాటుకున్నాడు. ఇప్పటికీ యువతకు అభ్యుదయ వాదులకు ఈ నినాదం వెన్నుదన్నుగా నిలిచింది.

" క్విట్ ఇండియా" 1942లో ఆంగ్లేయులను పూర్తిస్థాయిలో తరిమికొట్టాలని పూర్తి స్వాతంత్రాన్ని సాధించాలని ఉద్దేశంతో దీర్ఘకాలిక పోరాటాన్ని ప్రకటించినప్పుడు ఆ ఉద్యమానికి పేరు పెట్టే సందర్భంలో జరిగిన చర్చలో అనేక మంది పేర్లను సూచించినట్లుగా తెలుస్తోంది. ఆనాడు ముంబాయి నగరానికి మేయర్గా పనిచేస్తున్న యూసఫ్  మెహర్ అలీ క్విట్ ఇండియా అంటే బాగుంటుందని చేసిన సూచనను ఆ నాటి కమిటీ ఆమోదించడంతో ఆ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం గా మారిపోయింది. క్విట్ ఇండియా నినాదం రూపకర్త ఎనిమిది సార్లు జైలుకు వెళ్లి అనేక శిక్షలు అనుభవించినటువంటి పోరాటయోధుడు కావడం గమనార్హం.

వందలాది సంవత్సరాల క్రితం కోట్లాది ప్రజానీకాన్ని ఏకం చేసి సాయుద్ధ, సత్యాగ్రహ పద్ధతుల ద్వారా ఆంగ్లేయులతో పోరాడటానికి ఈ నినాదాలు ఎంతో ఉత్సాహంగా పని చేసినట్లుగా తెలుస్తున్నది. నేడు ఎంత మీడియా ఉన్న ప్రతి స్పందన ప్రజల్లో కానరావడం లేదు .కానీ ఈ మీడియా లేకపోయినా పౌరుషం, స్వాతంత్ర్య కాంక్ష, దేశభక్తి ఆనాడు అందరిలో రగిలించింది అంటే ఆ లక్షణాలను తిరిగి మనం పునికి పుచ్చుకో వలసిన అవసరం ఉన్నదని చరిత్ర ద్వారా తెలుస్తున్నది.


    స్వతంత్ర భారతంలో నిర్లిప్తత ఎందుకు?

  • ప్రభుత్వ రంగం క్రమంగా 85 శాతం నుండి 15 శాతానికి మారిపోయిన కారణంగా ప్రజల జీవితాలకు భద్రత లేదు కనుక.
  • చట్ట సభలో మెజారిటీ సభ్యులు నేరస్తులు కార్పొరేట్ శక్తులు కావడం వలన వాళ్ల వర్గ ప్రయోజనం కోసమే పాకులాడుతూ ఉన్నారు తప్ప సామాన్య ప్రజానీకం కోసం కాదు. అందువల్లనే అభివృద్ధి తిరోగమన దిశలో పయనిస్తోంది.
  • రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలను ప్రజల కోణంలో ప్రజాసేవకు ఉపయోగించే బదులు రాజకీయ స్వప్రయోజనాల కోసం. కార్పొరేట్ శక్తుల కొమ్ము కాయడం కోసం ప్రభుత్వాలు పని  చేస్తున్నందున సామాన్య ప్రజానీకం నిర్వీర్యం అవుతున్నది.
  • ప్రధాన సమస్యలైన ఆర్థిక అంతరాలు, అసమానతలు ,వివక్షత ఆధిపత్య భావజాలం, అగ్రవర్ణాల అణచివేత దోపిడీ విధానాలు సామాన్య ప్రజానీకాన్ని యాచకులుగా బానిసలుగా మార్చుతున్నవి.
  • దారిద్ర్య రేఖ దిగువన 20 శాతం ప్రజానీకం ఉండడం, 75 శాతం సంపద ఒక్క శాతంగా ఉన్న సంపన్నవర్గాల చేతిలో ఉండటం, 20 కోట్ల మంది వలస కార్మికుల పైన ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవడం ఈ దేశ పాలకుల విధానం ఎటువైపు వెళుతుందో ఆలోచించవచ్చు.
  • దేశంలో దినదినం సంపద పెరుగుతున్నది. దానిని ప్రభుత్వం అభివృద్ధి అని అపోహ పడుతూ ప్రతిపక్షాలను సంప్రదించకుండా, ప్రజా సంఘాలు రైతు సంఘాల ను ఆలోచించకుండా, సంబంధిత శక్తులతో మాట్లాడకుండా తీసుకుంటున్న కఠిన ప్రజా వ్యతిరేక విధానాల వలన ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అగాధం పెరిగిపోతోంది.
  • సంపద పెరుగుదల అభివృద్ధి కాదు .ఆ పెరిగిన సంపద ప్రజలందరికీ పంపిణీ జరిగినప్పుడే సార్థకత. ఇదే విషయాన్ని భారతదేశ నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ "మానవాభివృద్ధి" అనే పేరుతో పాలకులకు దిశానిర్దేశం చేయడాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం తమ సోయి లేని తనానికి నిదర్శనం.
  • తెలంగాణ వంటి రాష్ట్రంలో భారతదేశంలోనూ 40 శాతంగా ఉన్న యువతకు సంబంధించి సరైన యువజన విధానం లేని కారణంగా ఉపాధి ,ఉద్యోగం ,నైపుణ్యాలకు దూరమై  ఆత్మహత్యలు  చేసుకుంటున్నారు.
  • ప్రణాళికా రచనలో 85% గా ఉన్నటువంటి సామాన్య, మధ్యతరగతి, ఆదివాసి, బహుజన వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వని కారణంగా 74 సంవత్సరాలు దాటినా మానవాభివృద్ధి సాధించడంలో పూర్తిగా విఫలమైనము.

స్వతంత్రం సార్థకం కావాలంటే:

ప్రజాస్వామ్య దేశంలో పాలకులు రాజ్యాంగబద్ధంగా పాలన చేయగలగాలి వ్యక్తిగత ఎజెండాకు ఏనాడు తావుండకూడదు. ప్రభుత్వాలకు సామ్యవాద దృక్పథం ఉంటే తప్ప ప్రజాస్వామ్య దేశాలలో పాలన సఫలం కాదు. శాస్త్రీయ విద్యా రంగాలలో పరిశోధనా రంగంలో ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే తప్ప ప్రజలు సుఖ సంతోషాలతో బ్రతకలేరు.

  • ఈనాటికీ భారతదేశంలోనూ అనేక రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో విద్య ,వైద్యం ప్రైవేటు ఉక్కు సంకెళ్ళ మధ్య నలిగిపోతూ పేదలు మరియు ప్రజలు కావడానికి తమ కొనుగోలు శక్తిని కోల్పోవడానికి కారణమవుతున్నాయి. ఈ రెండు రంగాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగాలి.
  • ప్రజా సేవకులకు మాత్రమే చట్టసభలలో ప్రాతినిధ్యం ఉండాలి. నేరగాళ్లు నేరారోపణ కు గురైన వారు కఠినంగా శిక్షించ బడాలి.
  • లక్షలాది రూపాయలను తమ  వేతనాలు గా తామే నిర్ణయించుకునే అధికారాన్ని చట్టసభలకు లేకుండా చేయాలి. ప్రజల ద్వారానే నిర్ణయించబడాలి.
  • తెలంగాణ రాష్ట్రంలో నేటి ప్రభుత్వం నాలుగు లక్షల వేల కోట్ల అప్పులు చేసినది.
  • కేంద్రం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఏ ప్రభుత్వం చేసిన అప్పులను ఆ ప్రభుత్వమే చెల్లించే విధంగా చట్టం తీసుకురావాలి.
  • ఎన్నికల విధానాన్ని పూర్తిగా నిషేధిస్తూ సమర్ధుడు అయిన వాళ్ళు పేదలైన చట్టసభల్లో కి అధికారానికి వచ్చే విధంగా అంతిమంగా రాజ్యాధికారానికి అర్హులను చేసే నూతన అవకాశాలకు చట్టసభలు జీవం పోయాలి.ఆమ్ ఆదమీ పార్టీవలె.
  • పాలకుల వికృత ప్రవర్తన, అణచివేత ధోరణి కార్పొరేట్ శక్తుల దోపిడి నడుమ ప్రజలకు సరైన పాలన అందించే అవకాశం లేదు. గౌరవ రాష్ట్రపతి ఆయా రాష్ట్రాల గవర్నర్ లతోపాటు న్యాయవ్యవస్థ అంతిమంగా సర్వోన్నత న్యాయస్థానం పాలకుల తప్పుడు విధానాల మీద అన్యాయాలు దోపిడీ మీద ఉక్కుపాదం మోపాలి అప్పుడే సామాన్య ప్రజానీకానికి 75 ఏళ్ల తర్వాత స్వాతంత్ర ఫలాలు పొందే అవకాశం కలుగుతుంది.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయులు తమ నాయకుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

0/Post a Comment/Comments