తెలుగు భాష ఇంకెక్కడుందిరా పిచ్చోడా!! ---- కొత్తపల్లి రవి కుమార్, రాజమహేంద్రవరం (ఆగుస్ట్ 29, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కవిత)

తెలుగు భాష ఇంకెక్కడుందిరా పిచ్చోడా!! ---- కొత్తపల్లి రవి కుమార్, రాజమహేంద్రవరం (ఆగుస్ట్ 29, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కవిత)

తెలుగు భాష ఇంకెక్కడుందిరా పిచ్చోడా!!

పరభాషను చంకనెక్కించుకుని తెలుగు భాషను నడి రోడ్డుమీద వదిలేసారురా!
తెలుగు భాష ఇంకెక్కడుందిరా పిచ్చోడా!!

అమ్మని శవాల దిబ్బల మమ్మీగా మార్చి, నాన్నపై డాడీ అంటూ దాడి చేయించారురా!
తెలుగు భాష జాడే లేదురా పిచ్చోడా!!

బాధ కలిగినప్పుడు అమ్మా అని కన్నతల్లిని తలచుకోవడం మాని షిట్ అని అశుద్ధాన్ని నోట్లో వేసుకున్నారురా!
తెలుగు భాష చచ్చిపోయిందిరా పిచ్చోడా!!

బళ్ళోకి పోయి దేవత లాంటి ఆ చదువులమ్మ ఒళ్ళో పాఠాలు నేర్చుకోవడం మాని స్కూల్ కెళ్ళి డెవిల్స్ గా మారారురా!
తెలుగు భాష అమ్ముడు పోయిందిరా పిచ్చోడా!!

ఏభై రెండు అక్షరాల మాతృభాషను పలకడానికి బద్ధకమేసి ఇరవై ఆరు అక్షరాల పరభాషకు బానిసలయ్యారురా!
తెలుగు భాష సిగ్గుపడి దాక్కుందిరా పిచ్చోడా!!

తేట తెల్లని తెలుగు పద్యాలతో యదార్థాలను చూపడం మాని జానీ జానీ అనే రైమ్స్ తో అసత్యాలు పలకడం అలవాటు చేసారురా!
తెలుగు భాష కాల గర్భంలో కలిసి పోయిందిరా పిచ్చోడా!!

నిరంతరం వెలుగులు విరజిమ్ముతూ ఆనందాన్ని పంచే తెలుగు భాషను వదిలి ఎంగిలి భాషను నోటితో అందుకున్నారురా!
తెలుగు భాష ఏవగింపుతో పారిపోయిందిరా పిచ్చోడా!!

---- కొత్తపల్లి రవి కుమార్
           రాజమహేంద్రవరం
              9491804844

0/Post a Comment/Comments