బైరాన్ పల్లి నెత్తుటి ధారకు 73 ఏళ్లు పూర్తి. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి నేటి తరానికి అందించడం మన కర్తవ్యం! -- వడ్డేపల్లి మల్లేశము9014206412

బైరాన్ పల్లి నెత్తుటి ధారకు 73 ఏళ్లు పూర్తి. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి నేటి తరానికి అందించడం మన కర్తవ్యం! -- వడ్డేపల్లి మల్లేశము9014206412

బైరాన్ పల్లి నెత్తుటి ధారకు 73 ఏళ్లు పూర్తి.
తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి నేటి తరానికి అందించడం మన కర్తవ్యం!
27.8.2021

-- వడ్డేపల్లి మల్లేశము9014206412


      నిజాం రాజుల  పరిపాలన కాలంలో రజాకార్ల దారుణాలకు, ఘాతుకాలకు అంతే లేదు. చరిత్ర సాక్షిగా నాటి  రుధిర ధారలు అనేక ప్రాంతాలలో మూగ సాక్షిగా నేటికీ మనలను తట్టి లేపుతూ నే ఉన్నవి. నాటి బలిదానాలు, పోరాట వీరుల త్యాగాలను సంఘటనలుగా  చెప్పుకుంటున్న నేటి తరుణంలో కొన్ని ఆనవాళ్ళు అయినా నేటికీ నిలిచి మనలను ఆలోచింపజేస్తున్నవి.

       పాలకుర్తి చాకలి ఐలమ్మ, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య,  పోరాట వీరుడు నల్ల నరసింహులు, నల్ల వజ్రమ్మ, వ కమ్మరి బ్రహ్మయ్యవంటి ఎందరో వీరులు క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తే వీరికి నాయకత్వం వహించి తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపించిన టువంటి కమ్యూనిస్టు, ఆంధ్ర మహాసభ నాయకులు ఎందరో మరెందరో!.

     సాహిత్య, సాంస్కృతిక రంగాలలో వెనుకబాటుతనాన్ని వ్యతిరేకిస్తూనే గ్రంథాలయ ఉద్యమం తో పాటు భూమి, భుక్తి, విముక్తి కోసం నిజాం రాజు పైన, నిజాము రాజు తాబేదార్ల పైన, భూస్వాముల ఆగడాలపై నా గ్రామీణ స్థాయిలో నిరంతర పోరాటం ఆనాటి ప్రజా చైతన్యానికి సామాజిక స్ఫూర్తికి నిదర్శనం. అక్షరాస్యత అంతగా లేకపోయినా చైతన్యానికి అక్షరాస్యతే కారణం కాకపోవడాన్ని చరిత్ర నుండి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.

    బైరాన్ పల్లి సంఘటన పూర్వచరిత్ర':-

       నిజాం రాజు ఆగడాలు ఒకవైపు, అతని ప్రైవేటు సైన్యం ఖాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల దురాగతాలు మరొకవైపు గ్రామీణ ప్రాంతాలను నిరంతరం భయం గుప్పిట్లో ఉంచితే గ్రామీణ ప్రాంతాలలోని భూస్వాములు, దేశ ముఖ్ల్ ,సర్దేశాయి లు గ్రామీణ ప్రాంతాలలో వెట్టిచాకిరిని చట్టబద్ధం చేయడం దారుణం.

 ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో భువనగిరి, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో జరిగినటువంటి ఆంధ్రమహాసభల నిర్ణయానుసారం గా గ్రామీణ ప్రాంత దళాల నిర్మించి ఎక్కడికక్కడ పోరాటాన్ని ఉధృతం చేయడం జరిగింది. 1946 జూలై 4వ తేదీన కడివెండి గ్రామం లో విసునూరు రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ నియంతృత్వానికి వ్యతిరేకంగా గ్రామంలో ఊరేగింపు తీస్తుండగా వారి కిరాయి గుండాల  తూటాలకు దొడ్డి కొమరయ్య అమరత్వం పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. తొలి బలిదానం తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపు ఇవ్వడానికి ఉత్ప్రేరకంగా పని చేసింది.

      ఈ క్రమంలో 19 47 ఆగస్టు 15వ తేదీన దేశమంతా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటూ ఉంటే నిజాం సంస్థానం లో మాత్రం మూడు రంగుల జెండా ఎగరడానికి వీలులేకుండా నిషేధించడంతో నిషేధాలను ఉల్లంఘించి అనేకచోట్ల జెండాలను ఎగురవేసి అరెస్టయ్యారు.

      గ్రామీణ ప్రాంత ఉద్యమానికి కేంద్రాలుగా ఆనాడు గ్రామగ్రామాన బురుజులు నిర్మాణం చేయడం జరిగింది. కులమతాలకతీతంగా గ్రామీణ ప్రాంత యువకులు, మహిళలు పోరాటంలో చిత్తశుద్ధిగా పనిచేసేవారు.

     1948 ఆగస్టు 27 బైరాన్ పల్లి లో ఏం జరిగింది?

     అప్పటికి అనేకసార్లు కూటిగల్, బైరాన్ పల్లి ,మద్దూరు తదితర గ్రామాల పైన రజాకర్ల , పోలీసు దాడులు అనేకసార్లు జరిగినాయి. వాటిని ఎదుర్కోవడానికి గ్రామ ప్రాంత దళాలు గుత్పలు, కారంపొడి, ఆయుధాలతో ఎన్నోసార్లు ఎదుర్కొని తరిమి కొట్టినారు. రెండుసార్లు అవమాన భారానికి లోన యినటువంటి రజాకార్లు పోలీసులను కూడా కలుపుకొని సుమారు 1200 మందికి పైగా 1948 ఆగస్టు 27వ తేదీన ఉదయం ఐదు గంటలకే బైరాన్పల్లి మీద దాడి చేశారు.

       రజాకార్ల దారుణాలకు అంతేలేని ఆనాటి పోరాటంలో ఎంతో మంది మహిళలు, యువకులు, పిల్లలు బలికావడం అనేక మందిని వివస్త్రగా చేసి ఆడించడం బాధాకరం. 1947 నుండి1952 వరకూ సుమారుగా 50 వేల మంది మహిళలపై  అకృత్యాలు, లైంగిక దాడులు, అవమానాలూ, వివస్త్రను చేసి బతుకమ్మ ఆడించడం వంటి
 ఆగడాలకు రజాకార్లు, మిలిటరీ  పాల్పడినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు.

     బైరాన్ పల్లిలో భారీ బలిదానాలు:-

         ఆనాటి నల్లగొండ జిల్లాలో ఒక  గ్రామంగా ఉన్న బైరాన్పల్లిలో జరిగినటువంటి సంఘటనను ఇప్పటికీ "బైరాన్ పల్లి దాడి" అనే పేరుతోనే పిలుస్తూ ఉంటారు. ఒక్కసారి గా గ్రామం పై దాడి చేసిన 1200 మంది రజాకార్లు పోలీసులు గ్రామములో భయంకర వాతావరణాన్ని సృష్టించారు .అదే క్రమంలో ఈ వార్తవిన్నటువంటి వార్తాహరులు దళ సభ్యులు ప్రజలందరూ కూడా చైతన్యమై బురుజు పైకెక్కి ఎక్కడి వారు అక్కడ యుద్ధ తంత్రాన్ని ఉపయోగించుకొని రజాకార్ల పైకి ఎక్కు పెట్టారు. ఈ సంగ్రామంలో గ్రామంలోని మహిళలందరిని బలవంతంగా లాక్కొచ్చి వివస్త్రలు చేసి బురుజు వద్ద బతుకమ్మ ఆడించినట్లు గా ఇప్పటికీ బ్రతికున్న కొందరు చెబుతుంటారు.  ఈ సంఘటన గ్రామ దళాన్ని మరింత రెచ్చగొట్టింది. ఇదే క్రమంలో పోలీసులు రజాకార్ల తూటాలకు ఒక్కొక్కరు
 118 మంది నేలకొరిగి ఆ ప్రాంతాన్ని రక్తతర్పణం చేశారు. ఆ బురుజు ఆ ప్రాంతం నేటికీ మౌనసాక్షిగా నిలిచింది..
     
నాటి పోరాట వీరులకు విప్లవ జోహార్లు:-

     వ్యాస రచయితగా నేను ఇటీవల రెండు సంవత్సరాల క్రితం ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు అక్కడి యువత, విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని వారికి తెలిసిన విషయాలను ఎంతో ఆసక్తిగా నాకు చెప్పడం జరిగింది. నాటి సంఘటనను ప్రత్యక్షంగా సూచిన టువంటి నాటి తరం వాళ్ళు లేకపోవడం ప్రత్యక్ష అనుభవాలకు ఆస్కారం లేకుండా పోయింది. కానీ ఆ నోట ఆ నోట విన్న విషయాలను చెప్పగలిగిన వాళ్ల ద్వారా ఈనాడు చరిత్రను మనమే నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. తమ కుటుంబాలను, ఆప్తులను, ఆత్మీయులను, అందరిని వదిలి బానిసత్వ విముక్తి కోసం, వెట్టిచాకిరి నిర్మూలన కోసం, నిజాం రాజు కబంధహస్తాల నుండి స్వేచ్ఛ స్వాతంత్య్రాల కోసం, గ్రామీణ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం కోసం తమ జీవితాలను బలి పెట్టినటువంటి నాటి విప్లవ వీరులకు జోహార్లు పలుకుదాం.

          " అక్షరాస్యత లేకపోతే నేమి ఆరాటం ఉంది. తమ వారిని వదిలి పెట్టడమే కాదు ఏదో సాధించాలనే తపన ఉంది వారిలో". దానికి తోడు ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని పూర్తిస్థాయిలో అందించడంతో కిందిస్థాయి కార్యకర్తలు అసువులుబాసినా చరిత్రలో నిలిచిపోయారు. వారికి ఉన్న ఆలోచన మనకు ఎందుకు లేదు?. ఆనాట పరిస్థితులకు ఏ మాత్రం తీసిపోని  రీతిలో బానిసత్వం, భూ సమస్యలు, జమీందారి విధానం, పేదరికము, అస్పృశ్యత పెట్టుబడిదారీవిధానం నేటికీ పడగ విప్పి నాట్యం చేస్తుంటే నేటి యువతరానికి, బుద్ధి జీవులకు, మేధావులకు, ప్రజాసంఘాలకు కనబడడం లేదా? తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని వృద్ధులు, మధ్యతరగతి వ్యక్తులుగా  మనం ప్రతిజ్ఞ చేద్దాం! నేటి యువతరానికి ఆనాటి వారసత్వాన్ని అందిద్దాం! అందుకే చరిత్ర నిర్మించే క్రమంలో ఈ చిన్న ప్రయత్నం.

    విద్యార్థి, యువకుల్లారా!


    73 ఏళ్ల క్రితం జరిగినటువంటి  నాటి నెత్తుటి ధారకు, బలిదానాలకు, త్యాగాలకు ప్రధానకారణం నేటి మన తరం గురించిన వారి ఆలోచనే కదా మూలం! మన కోసమే మనము ఆలోచించని నేటి రోజుల్లో రాబోయే తరం కోసం కనిపించని జనం కోసం కురిపించిన వారి త్యాగ వర్షం అపారం. అనన్యసామాన్యం .! అజేయం కూడా!నేటికి భైరంపల్లి నడిబొడ్డున నిలిపిన
నాటి అమరవీరుల స్థూపంపై 118మంది
అమరవీరుల పేర్లను చూడవచ్చును.

            నాటి హైదరాబాదు సంస్థానంలో భాగంగా ఉన్న నేటి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సాధన అనంతరం మన ఆకాంక్షలు ఏమేరకు సఫలమైనవో ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ రెండింటినీ మేళవిస్తూ బైరాన్పల్లి సంఘటనపై నేటి తరానికి చెప్పడం కోసం మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ గారు నేటి నుండి సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవం నాటి వరకు కూడా గ్రామగ్రామాన ఉద్యమాలు జరిగిన ప్రాంతాల్లో నాటి బలిదానాలను నెమరువేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా విజ్ఞప్తిచేసియున్నారు..

       "బైరాన్ పల్లి ఘటనకు 73 ఏళ్లు" అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ఊరూరా గ్రామ గ్రామాన నిర్వహించడం ద్వారా నేటి తరానికి, విద్యార్థి, యువజనకార్యకర్తలకు కూడా ఆనాటి పోరాట స్ఫూర్తిని అందించే ప్రయత్నం చేద్దాం.

 నాటి రాచరిక పాలన లోనూ నేటి ప్రజాస్వామ్య పరిపాలన లోనూ ఓకే రకమైనటువంటి  పరిస్థితులు కనపడటం చాలా బాధాకరం. అందుకే కమ్యూనిస్టు పార్టీతో పాటు అభ్యుదయవాదులు అంతా నేటి తెలంగాణ ప్రాంతంలో తేవలసిన మౌలికమైన మార్పుల కోసం ,తెలంగాణ ఆకాంక్షలను సాధించుకోవడం కోసం, ప్రభుత్వాల యొక్క అణచివేత నిర్బంధాలను ప్రతిఘటించడం కోసం ఐక్యం కావాల్సిన అవసరం ఎంతగానో ఉంది .అది బైరాన్పల్లి ఘటన, తెలంగాణ సాయుధ పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయి మన కర్తవ్యాలను గుర్తించడమే బైరాన్పల్లి అమరవీరులకు మనముఅర్పించగల ఘనమైన నివాళి.

(వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

0/Post a Comment/Comments