సమరయోధుల జీవితాలు పాఠ్యాంశాలు కావాలి. చారిత్రక వారసత్వ సంపద నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి.!!!-- వడ్డేపల్లి మల్లేశము9014206412

సమరయోధుల జీవితాలు పాఠ్యాంశాలు కావాలి. చారిత్రక వారసత్వ సంపద నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి.!!!-- వడ్డేపల్లి మల్లేశము9014206412


సమరయోధుల జీవితాలు పాఠ్యాంశాలు కావాలి. చారిత్రక వారసత్వ సంపద నేటి తరానికి  స్ఫూర్తిదాయకంగా  నిలవాలి.!!!

-- వడ్డేపల్లి మల్లేశము9014206412

        ప్రజా జీవితానికి ఏ రకంగా ఉపయోగపడని, చైతన్య రాహిత్యము ఐన కేవలం విశ్వాసాలు నమ్మకాలు కల్పనల పై ఆధారపడిన విద్యా విధానం సమాజ మనుగడ కు ఏ రకంగానూ దోహదపడదనే
 విమర్శ ప్రధానంగా అనేక దశాబ్దాలుగా ఈ దేశంలో కొనసాగుతున్నది. దానికి బదులుగా శాస్త్రీయ విద్యా విధానం కావాలని, ఉపాధిని, సంస్కృతిని మానవ మనుగడకు  తోడ్పడే, భావి సవాళ్లను అధిగమించే  సమర్థతను అందించే విద్యా విధానంపై మేధావులు, బుద్ధిజీవులు విద్యార్థి సంఘాలు అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు.

        చరిత్రలోకి వెళితే అనేక ఉద్యమాలు పోరాటాలలో తమ జీవితాలను పణంగా పెట్టి ప్రజల కోసం పని చేసినటువంటి వారి చరిత్ర కూడా అరకొరగానే నిక్షిప్తం కావడం అందులో అనేక తప్పులు ఉండటం గుర్తించిన టువంటి మేధావులు వాస్తవ చరిత్రను భావితరాలకు అందించాలనే ఆలోచన  ఇటీవల వచ్చింది. కాబట్టి పాఠ్యప్రణాళిక రూపురేఖలను గణనీయంగా మార్చవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.

 సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపైన హేతుబద్ధమైన దృక్పథం కలిగి సామాజిక చింతన అభ్యుదయ భావజాలం కలిగిన వారు మాత్రమే ఆ రకమైనటువంటి పాఠ్య ప్రణాళికను రూపొందించ గలరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి పాఠ్య ప్రణాళికను తయారు చేసే క్రమంలో సామాజిక దృక్పథం, శాస్త్రీయ వైఖరులు కలిగిన వారిని మాత్రమే ఎంపిక చేస్తేనే ఇది సాధ్యమవుతుంది.

   సమరయోధుల త్యాగాలు నేటి తరానికి అవసరం లేదా?

     శతాబ్దాల పాటు సాగిన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వేలాదిమంది సమర వీరులు పోరాటంలో పాల్గొని రక్తతర్పణం చేసిన ఈ నేలలో కనుమరుగై చరిత్రకందని అమరవీరులు ఎందరో. ప్రధానంగా గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, వంటి ప్రముఖుల పేర్లు మాత్రమే చరిత్రలో వినబడతాయి. పాఠ్యాంశాలలో కనపడతాయి.

      1919 ఏప్రిల్ 13 వ తేదీన అమృతసర్ జలియన్ వాలా బాగ్ లో జరిగినటువంటి మారణకాండలో వేలాది మంది అమరులు కావడానికి కారకుడైన డయ్యర్ ను ప్రత్యక్షంగా చూసిన ఉద్ధం సింగ్ 21 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ వెళ్లి కాల్పుల్లో చంపి తన ప్రతీకారం తీర్చుకున్నాడు ఎవరికోసం దేశం కోసం కాదా? ఉరికంబం ఎక్కి తన జీవన ప్రస్థానాన్ని ముగించిన ప్పటికీ వీరుడిగా నిలిచాడు. మరి ఉద్ధం సింగ్  నేటి తరానికి తెలియకపోతే ఎలా?

     చరిత్రలో కనుమరుగైన అనేకమంది అమరవీరులు, పోరాట వీరులు, స్వాతంత్ర ఉద్యమ నాయకులు కఠిన దరిద్రాన్ని అనుభవించి, పేదరికంలో,  ఆకలితో అలమటించి సంవత్సరాల తరబడి జైలులో మగ్గి ఉరి కంబాల ఎక్కి పోరాటంలో అమరవీరుల యినారు. వారి సుదీర్ఘ చారిత్రక ఘట్టాలను పాఠ్యాంశాలలో పెడితే తప్ప నేటి తరానికి తెలిసి రాదు.

        భావితరాలు ప్రశాంతంగా బ్రతకాలని, భావి సవాళ్లను అధిగమించే చైతన్యవంతులు కావాలని, తెల్లవారి దాస్యశృంఖలాల తెంచే   క్రమంలో తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించారు. మనుగడ కోసం భవిత కోసం నాటి పోరాటాలే చరిత్రగా నేటికీ దారి చూపుతున్నాయి. అందుకే వారి చరిత్ర పాఠ్యాంశాలలో తప్పనిసరి చేయాలి. ఒకటవ తరగతి నుంచి ఉన్నత స్థాయి వరకు చరిత్ర మరిచిన వారందరినీ పాఠ్యాంశాలలో చేర్చడమే నేటితరం స్ఫూర్తి పొందడానికి దోహదపడుతుంది.

ప్రపంచ స్థాయి తెలంగాణ సాయుధ పోరాటాన్ని  పదిలపరచుకుందాం:

     సమాజం ఒడిదుడుకులతో, ఉన్నప్పుడు, అణచివేత, దోపిడీ ,వివక్షత, బానిసత్వం, వెట్టిచాకిరీ, ప్రజా జీవితాన్ని చిద్రం చేస్తున్నప్పుడు ప్రతిఘటన   ఏ కాలంలోనైనా ఏ ప్రాంతంలోనైనా తప్పదు.
 అలాంటి ఉద్యమాలు శ్రీకాకుళం లోనూ, పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరి లోను, తెలంగాణ లోని అనేక ప్రాంతాల్లో భూమి భుక్తి విముక్తి కోసం అలాగే దేశవ్యాప్తంగా సాగిన పోరాటాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పినవి. ఇప్పటికీ హక్కులకోసం, మానవ మనుగడ కోసం, ఆదివాసీల రక్షణ కోసం, నిర్బంధాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తమ జీవితాలనే త్యాగం చేస్తున్న మహానుభావులు, హక్కుల కార్యకర్తలు, మేధావులు,  బుద్ధిజీవులు ఎందరో మరెందరో! వీరందరూ వ్యవస్థ కోసం తమ జీవితాలను పణంగా పెట్టిన విషయాన్ని మనం మర్చిపోకూడదు.

     ఇప్పటికీ జైల్లో ఉండవలసిన అటువంటి నేరస్థులు, అవినీతిపరులు, క్రిమినల్స్ రాజకీయాల్లో, చట్టసభలలో, పార్లమెంటులో అధికారంలో తులతూగుతూ ఉంటే సామాజిక స్ఫూర్తితో సమసమాజం కోసం ఆరాటపడుతున్న అనేకమంది నిర్బంధాలు అనేక ఆరోపణలపై జైళ్లలో మగ్గుతున్న విచిత్రమైన పరిస్థితి భారత దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ అంశాలపైన కూడా స్పష్టమైన అవగాహన కోసం నేటితరం బాధ్యతల కోసం రాజ్యాంగం ఏమి చెబుతుంది? రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాలు ఏమిటి? రాజ్యాంగం ఎందుకు విఫలం చెందింది? పాలకుల సొంత ఎజెండా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్న టే వారి పైన చర్యలేవి? అనే విషయంలో నేటి యువత ,ప్రజాసంఘాలు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఈ అంశాలను కూడా పాఠ్యాంశాలలో చేర్చాలి.

      తెలంగాణ సాయుధ పోరాటంలో వందలాది మంది  పాల్గొని రక్తతర్పణం చేస్తే వేలాది మంది ప్రజలను, కార్యకర్తలను రజాకార్లు మిలిటరీ బలగాలు పిట్టల్లా కాల్చి చంపితే సంఘాల పేరుతో ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో  ఎదురొడ్డి పోరాడి నిలిచారు. ఇందులో వందలాది ఎకరాలు ఉన్నటువంటి భూస్వాముల తో పాటు పూట గడవడమే కష్టంగా ఉన్నటువంటి కుటుంబాలు కూడా తమ జీవితాలను త్యాగం చేసిన మహోన్నత ఘట్టాలను నేటి తరానికి అందించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.
      
   పైపైన కాకుండా ఆనాటి ఉద్యమ నేపథ్యం, చారిత్రక సామాజిక పరిస్థితులు, ఎదురొడ్డి నిలిచిన విధానం, వారి త్యాగాలు శాస్త్రీయ పద్ధతిలో నేటి తరానికి అందించాలంటే  పాఠ్యంశాలే. చక్కని మార్గం.

      ఆనాడు ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్న టువంటి వేలాదిమంది తెలంగాణ వీరుల లో ఇప్పటికీ కొద్దిమంది బ్రతికి ఉన్నారు. వారి ద్వారా నాటి పరిస్థితులను సమాజ విలువలను సేకరించి పోరాట రూపాలను చిత్రీకరిస్తే సజీవ చరిత్ర సాక్షాత్కరిస్తుంది. తద్వారా లభించిన జ్ఞానాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలి. వారి పైన పరిశోధనలను ప్రోత్సహించాలి.

    విసునూరు రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ , కొడుకుల దౌర్జన్యాలను వివరిస్తూనే ఎదురొడ్డి నిలిచిన పోరాట వీరులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, నల్ల నరసింహులు, చాకలి ఐలమ్మ కమ్మరి బ్రహ్మయ్య,  నల్ల వజ్రమ్మ సాంస్కృతిక రంగంలో పని చేసిన హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన మేర మల్లేశం, చరిత్రకు అందని అటువంటి హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన పడాల చంద్రయ్య, వేముల నరసయ్య వంటి నాయకులు కార్యకర్తలు ఎందరో పోరాడి గెలిస్తే అసువులు బాసిన వారు కూడా ఎందరో. ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాగిన ఈ పోరాటానికి తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ప్రేరణగా నిలిచి తే ఎంతో మంది గ్రామీణ ప్రాంత వీరవనితలు కూడా పాల్గొని సాయుధ పోరాటాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనత హైదరాబాద్ సంస్థాన ప్రజలకు దక్కింది.

      నాటి నిజాం రాజు  యొక్క ఆధీనంలో పని చేసినటువంటి భూస్వాములు పెట్టుబడిదారులు ప్రజలను, రైతు, కూలీలపైచేసిన అఘాయిత్యాలు, సామాజిక స్థితిగతులను కళ్లకు కట్టినట్టుగా పాఠ్యాంశాలలో చేర్చడంతో పాటు తరగతి గదిలో పాఠ్య ప్రదర్శనలో లీనమై బోధిస్తే తప్ప ఈనాటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రజలకు అర్థం కాదు. ఇందుకోసం ఆ రంగంలో నిష్ణాతులైన టువంటి, చరిత్ర తెలిసినటువంటి అప్పటి తరానికి చెందినటువంటి వారి ద్వారా కొన్ని తరగతులను నిర్వహించవలసిన అవసరం కూడా ఉన్నది.

      ఏదిఏమైనా ఒక తరానికి సంబంధించిన విజ్ఞానం, సంఘటనలు, చరిత్ర మరొక తరానికి అందాలంటే పాఠ్యపుస్తకాలు, పాఠశాల, విద్యా విధానమే మార్గం. ఆ మార్గం ద్వారా రాబోయే తరాలకు గత చరిత్రను అందించే కృషిలో మనమందరం భాగస్వాములమవుతాం. యువతకు ప్రేరణ కల్పిద్దాం నేటి సామాజిక స్థితిగతులపై నా పోరాడే చైతన్యాన్ని అందిద్దాం.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయులు ఉద్యమ నాయకుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

0/Post a Comment/Comments