అభివృద్ధి అంటే బిచ్చం వేయడం అనే ప్రభుత్వ ధోరణి మారాలి.
మానవాభివృద్ధి రాజ్యాంగ బాధ్యత అని గుర్తించాలి!!
---వడ్డేపల్లి మల్లేశము - 9014206412
అభివృద్ధికి నిర్వచనాన్ని ప్రభుత్వాలు సరైన రీతిలో అన్వయించుకోని కారణంగా దేశంలో సంపదను పెంచుకోవడమే, వార్షిక పంచవర్ష ప్రణాళికలకు కేటాయించిన నిధులను వాగ్దానాలు, ప్రలోభాల రూపంలో ప్రజలకు బిచ్చం వేసినట్లు వేసే వివిధ పథకములను అమలు చేయడమే ప్రభుత్వాలు తమ బాధ్యతగా భావిస్తున్నవి. సంపద పెరిగితే అభివృద్ధి చెందినట్లు, ఆ సంపదను మాత్రం ప్రజలకు అందించే క్రమంలో పాలకులు తమ సొమ్మును దానము చేసిన రూపంలో నటించడమే నేడు ప్రజాస్వామిక వ్యవస్థ కు గొడ్డలిపెట్టుగా తయారైనది.
అభివృద్ధి -పెరుగుదల:
స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో ప్రభుత్వాలు కొంత ప్రణాళికాబద్ధంగా ప్రాధాన్యత అంశాలకు ప్రణాళికలో చోటు కల్పించి వ్యవసాయ ,పారిశ్రామిక తదితర రంగాలను అభివృద్ధి చేసిన మాట వాస్తవం. ఒకవైపు సంపదను సృష్టించడం, సంపదను సృష్టించే ఉత్పత్తి శక్తులు ముఖ్యంగా కూలీలు, కార్మికులు, రైతులు నైపుణ్యం ఉన్నటువంటి వారికి పెద్ద పీట వేసి ఉత్పత్తి శక్తులకు ప్రాధాన్యత ఇచ్చినవి తొలి ప్రభుత్వాలు.
ప్రభుత్వాలు క్రమంగా తమ బాధ్యతను తప్పుకోవడంతో ప్రభుత్వ రంగం క్రమేణా ప్రైవేటు రంగం గా మారిపోతూ నేడు కార్పొరేట్ శక్తుల చేతులలోకి ఉత్పత్తి రంగం వెళ్ళిపోయింది. అయితే ప్రైవేటు రంగం పెరిగిన కారణంగా సామాన్య ప్రజానీకానికి అవకాశాలు కొరవడినప్పటికి సంపద పెరిగింది కనుక అభివృద్ధి చెందినట్లు దేశం అని కొత్త ఒరవడికి దారి తీసింది. క్రమంగా రైతులు కూలీలుగా చిన్నతరహా పరిశ్రమల యజమానులు కార్మికులు గా మారిపోయిన అటువంటి పరిణామాలు మన అందరికీ తెలుసు.
అయితే ఇక్కడే అభివృద్ధి గురించి నటువంటి నిర్వచనాన్ని సీరియస్ గా ఆలోచించాలి. దేశంలో సంపద ఉంటేనేమి ప్రకృతి వనరులకు కొరత లేక పోతే నేమి దారిద్ర రేఖ కింద 20 శాతం గా ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే అభివృద్ధి ఎలా అవుతుంది. 72 శాతం సంపద ఒక్క శాతంగా ఉన్న సంపన్నవర్గాల చేతిలో ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు ?ఆలోచించుకోవాలి. అందుకే అభివృద్ధి యొక్క నిర్వచనాన్ని పాలకులు ఎప్పుడో మార్చుకోవలసి ఉండే. కానీ తమ అధికారాన్ని ప్రైవేటు రంగానికి దఖలు పరిచిన కారణంగా ప్రభుత్వం నేడు నిస్సహాయురాలైనది.
ఈ దుస్థితిని అర్థం చేసుకున్న ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త ,భారతదేశ ముద్దుబిడ్డ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ప్రభుత్వాలకు సూచన చేస్తూనే చురక అంటించారు. దాని పేరే "మానవాభివృద్ధి"
దేశంలో సంపన్నుల గూర్చిన చర్చ అవసరం లేదు. కానీ దారిద్ర్య రేఖ దిగువన కలవారు, ఆదివాసులు ,అట్టడుగు వర్గాలు, బలహీనవర్గాలు, కూలీలు, కార్మికులు, రైతాంగం గురించి మేధావులు ఆలోచించవలసిన అవసరం ఉంది. అందరి కంటే ఎక్కువ బాధ్యత పాలకులదే .
అమర్త్యసేన్ నిర్వచనం ప్రకారం గా ప్రజలు తమ అవసరాలను సంతృప్తి స్థాయి లో తీర్చుకో గలిగే ఆర్థిక పరిస్థితి కలిగి ఉండడాన్ని మానవాభివృద్ధి అంటారు. కనీస అవసరాలు కూడా తీర్చుకోలే క మనుషులుగా మాత్రమే బతుకుతున్న దారిద్ర్యరేఖ దిగువన గల వారి తో పోల్చినప్పుడు ఈ పరిస్థితి కొంత మెరుగైనది. ఆ పరిస్థితిలోకి ప్రజానీకాన్ని తీసుకురావడానికి ప్రణాళికాబద్ధమైన కృషి అవసరమని అమర్త్యసేన్ చెప్పడం జరిగింది.
అంటే దేశంలో సంపద ఉండడం వేరు. ఆ సంపద ప్రజలకు అందితేనే సార్థకత. సంపద హేతుబద్ధంగా ప్రజలకు చేరడాన్ని అభివృద్ధి అంటారు. అది మానవాభివృద్ధికి క్రమంగా దారితీస్తుంది.
అభివృద్ధి అంటే ప్రభుత్వం బిచ్చం వేయడం అనే దుస్థితి రావడానికి కారణం:
రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాన్ని కేంద్రంలోనూ రాష్ట్రాలలోనూ పాలకులు ప్రణాళికాబద్ధంగా సామాజిక ఆర్థిక నేపథ్యంలో ఆయా వర్గాలకు దక్కాల్సిన వాటా ను డిమాండ్ చేయడం కాకుండా యాచించే పరిస్థితి దాదాపుగా అన్ని రాష్ట్రాలలోనూ కొనసాగడం ఆందోళనకరం. ప్రజలను ప్రభువులుగా చూడాల్సింది పోయి యాచకులుగా, బానిసలుగా ప్రభుత్వాలు చూస్తుంటే తమ అభివృద్ధి కోసం డిమాండ్ చేసే స్థాయిలో ప్రజలు లేకుండా బలహీనుల వుతున్నారు.
ఈ పరిస్థితికి కొన్ని కారణాలను అన్వేషిద్దాం.
- ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకు రావడంతో ప్రజలను, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి మధ్యాన్ని ,మత్తును ఎరగా చూపి లేనిపోని ఆశలు కల్పించి పావులుగా వాడుకుoటున్నారు. ఎన్నికలప్పుడే అదనంగా నిధులు మంజూరు చేయడం, కొత్త పథకాలతో ఆశ చూపడం ఇలాంటివే. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఉప ఎన్నికల సందర్భంగా నాగార్జునసాగర్ లోనూ ప్రస్తుతము జరగబోతున్న హైదరాబాదులోనూ దళిత బంధు, తదితర పథకాలు ,నిధులు మంజూరు అలాంటివే. ఈ నిర్ణయాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే.
- పార్టీల నాయకత్వంతో మొదలుకొని క్రింది నుండి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి వరకు కూడా ఉన్నత వర్గాల చేతుల్లోనే అధికారం ఉండడం వల్ల కూడా ప్రజలు డిమాండ్ చేయలేకపోతున్నారు. చేసిన పాలకులు పట్టించుకోకపోవడమే కాకుండా ఉద్యమాలను .అణచి వేస్తున్నారు.
- సామాన్య అట్టడుగు వర్గాలు ప్రభుత్వాల ధోరణిని ప్రశ్నించ లేక పోతున్నారు. కారణం వారు నిరంతరం శ్రమ లో లీనమై ఉత్పత్తిని పెంచడానికి చూపిన శ్రద్ధ ఉద్యమాల వైపుగా చూపకపోవడం. కానీ ఇటీవల కేంద్రం రూపొందించిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఇప్పటికీ ఉద్యమిస్తున్న విధానాన్ని మనం ఒక హెచ్చరికగా గుర్తించాలి. మధ్యతరగతి వర్గం కొంత సంతృప్తి స్థాయిలో జీవించడం వలన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించకపోవ డం కూడా పాలకుల ఆటలు సాగడానికి కారణమవుతున్నది. ఇక మిగిలింది కార్పొరేట్ శక్తులే కనుక. ప్రైవేటు రంగంలో పెరుగుతున్న టువంటి సంపద తమ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగుతుందని ప్రజలు అభివృద్ధి చెందినట్లు కాదా? అని ప్రభుత్వాలు భావించడం వలన ప్రజలకు న్యాయంగా చెందాల్సిన వాటా అనేక వర్గాలకు అందడం లేదు.
- సుమారుగా 85 శాతం ప్రైవేటీకరించబడిన నేటి దుస్థితిలో కార్పొరేట్ ప్రయోజనం కోసమే ప్రభుత్వాలు పని చేయడం కార్పొరేట్ శక్తుల వ్యతిరేక విధానాలకు ఉద్యమిస్తున్న ప్రజలపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ప్రజలు జీవించవలసి రావడం వల్ల కూడా యాచకులుగా మారిపోతున్నారు.
మానవ అభివృద్ధి జరిగి ఆయా వర్గాలకు జనాభా దామాషా లో సంపద అందాలంటే:
ప్రభుత్వం తనకు ఉన్న విస్తృత అధికారాలను ఉపయోగించి ప్రభుత్వ భూములను, వనరులను ప్రైవేటు పరం చేస్తున్నది. ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది అదే తంతు. కొన్ని ఇతర రాష్ట్రాలలోనూ కేంద్ర స్థాయిలోనూ ఇలాంటి పనులు కొనసాగుతున్నాయి. రాజ్యాంగబద్ధంగా దేశ సంపద ఆయా వర్గాలకు అందకపోవడం కారణంగా ప్రాంతీయతత్వం, అసమానతలు, అంతరాలు వంటి విష సంస్కృతి పెరిగిపోవడం కూడా పాలకుల అపజయానికి సూచికలుగా భావించవచ్చు. కాబట్టి పాలన గాడి తప్పకుండా ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశలో చట్టబద్దంగా కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పనిసరి.
- ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించాలి అందుకు సంబంధించిన నిబంధనలను చట్టసభల్లో ఆమోదించు కోవడం కోసం పాలకులు లేదా రాజకీయ పార్టీలు అడ్డు వస్తున్న కారణంగా అనేక చట్టాలు రూపకల్పన జరగడం లేదు. లేదా చేసిన చట్టాలు అమలు కావడం లేదు. ఎన్నికల సందర్భంలో ఎన్నికల వ్యయాన్ని పూర్తిగా నిషేధిస్తే తప్ప ఈ దేశంలో ఎన్నికలు న్యాయంగా సజావుగా జరగవు. ఎన్నికలు అంటేనే డబ్బు తో కూడుకున్న వైనం కావడంవల్ల ఉన్నత వర్గాలు సంపన్న వర్గాలు మాత్రమే అధికారంలోకి రాజకీయాల్లోకి రా గలుగుతున్నారు. కొంతవరకైనా ఢిల్లీలో కల ఆమ్ ఆద్మీ పార్టీ ఈ వికృత చేష్టలను అధిగమించి సామాన్యులు కూడా చట్టసభల్లో లోనికి రావడానికి మార్గం సుగమం చేసింది.
- ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎన్నో యధాతథంగా అమలు కావడం వలన ప్రజలు అనేక రంగాల్లో నష్టపోతున్నారు. చట్ట పరంగా అనేక రక్షణలు ఉన్నప్పటికీ అమలు కాని కారణంగా ఆదివాసీలు, పేదలు, గిరిజనులు, అట్టడుగు వర్గాలు మరీ పేదలుగా మిగిలిపోతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ప్రజల నుండి అసైన్డ్ భూములను అభివృద్ధి కోసం అని లాగు కోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
ఒక పాలనా కాలంలో పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి మితిమీరిన అప్పులు చేసినప్పుడు ఆఅప్పును ఆ పాలకుల కాలంలోనే తిరిగి చెల్లించే విధంగా న్యాయవ్యవస్థ కొంత అత్యున్నత స్థాయిలో ప్రజా ప్రయోజనాల రీత్యా హెచ్చరికలు చేయాల్సిన అవసరం ఉంది.తెలంగాణ అప్పు 4లక్షలకోట్లకు చేరినట్లు తెలుస్తుంది.
- పాలకులు ఇష్టారాజ్యంగా హామీలు వాగ్దానాలు చేసినప్పుడు అవి ప్రలోభాలు గా మారకుండా ఉండటానికి ఇటీవల ఢిల్లీ హైకోర్టు వాటిని కచ్చితంగా అమలు చేయాల్సిందే .వాటికి రాజ్యాంగబద్ధత వుంటుందనే తీర్పును ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అమలుకై ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
- ప్రజలు కూడా తమకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కులను గుర్తించి దేశ సంపద కు వాటాదారుల మని నిలదీసి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది .అందుకు సమైక్య ఉద్యమాలు దోహదపడతాయి.
- ఎన్నికల సందర్భంలో ఓటర్లు పోటీ లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అనేక రకాలుగా ఎర చూపినప్పటికీ ఆయా పార్టీల కుట్రలను ఎండగట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టం చేసిన పార్టీలను నల్లమల అడవుల్లోకి పంపించవచ్చు. అప్పుడు మాత్రమే ప్రజలు ప్రభువులుగా నిలబడతారు .పాలకులు సేవకులుగా ప్రజల కోసం సేవ చేస్తారు. అలాంటి సామ్యవాద తరహా సమసమాజం రావాలని మనసారా కోరుకుందాం.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)