ఢావలో (బంజార స్త్రీల కన్నీటి గాధ)
కవి : మురళీ జాదవ్
బంజారాలు ఎన్నో కష్టనష్టాలు మరియు బాధలను అనుభవించి ఉంటారేమో బహుశా!! వారి సంస్కృతి సాంప్రదాయక పద్దతులను పరిశీలిస్తే గుండెలు పిండే అనేక విషయాలు భహిర్గతమౌతాయి. బంజార సంస్కృతికి మూలం స్త్రీలు. బంజార స్త్రీలు వారి మనోవేదన దుఃఖాన్ని బాధను బందుప్రితిని గుండెలోతు గాధను తెల్పుటకు వాక్యాలు రూపంలో రాగాలాపనచేస్తూ ఎడుస్తారు ఢావ్లో రూపంలో.
సందర్భాన్ని బట్టి బంజార స్త్రీల ఢావలోను నాలుగు ఘట్టాలుగా వర్గీకరించవచ్చు.
అవి 1.ఢావ్లో. 2.మళెరో. 3.హవేలి. 4.వడావ్.
1.ఢావలో••••• (ఫెరారో)
పెండ్లిఈడు ఆడపిల్లకు నేర్పుతారు ఎడాడుగులు నడ్చినప్పుడు హోమగుండం చుట్టు తిరుగుతు (ఫెరాఫరేర్ )సొంతంగా పాడుతుంది. చూపరులకు కన్నీళ్లు రప్పిస్తుంది. ఎంతటి కఠినాత్ముడికైన ఇది గుక్కబెట్టి ఏడిపించక మానదు. నిజజీవితంలో ఒడిదుడుకులను ఎదురుకోవటానికి మానసికంగా ధైర్యాన్ని కల్గిస్తుందని పూర్వీకుల నమ్మకం. స్వతహగ పాడటంతో గుండె నిబ్బరమై ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్మకం. ఆ కాలంలో ఆడ పిల్లల పెళ్లిలు చిన్న వయసులోనే చెసేవారట.
అసలు ఢావలో అనేపదం ఢాల్ లో అనే పదం నుండి కాలానుగుణంగా ఢావలోగా మారిందని అంటారు. పూర్వము దండయాత్రలు, కత్తి యుద్ధములు జరగే సమయాలలో వీరులకు రక్షణగ ఢాల్ అనే ఒక రక్షణ ఆయుధం ఉండేదట. ప్రతి సారి యుద్ధానికి సిద్దమైయె సమయంలో ఆ వీరిని ఆక్కచెల్లెళ్లు అతని మెడ పట్టి మేమైతే నీ రక్షణకు రాలేము. కానీ ఈ ఢాల్ మాత్రమే నీ రక్షణ చేయగలదు. చాతుర్యంతో దీన్ని ఉపయోగించి వీరుడిగా ప్రాణాలతో తిరిగి రావాలని ఏడుస్తూ ఢాల్ ఇచ్చేవారట ప్రతి సారి. ఇప్పటికి అన్న లేదా తమ్ముడికి వీరేణ (వీరుడా)అని సంభోదిస్తూ ఢావలో చేస్తారు బంజార స్త్రీలు. అదేక్రమంగా మారి ఢావలో సజీవంగా వారసత్వసంపదల బంజార స్త్రీల గుండెలో స్ధానమై , గొంతులో గానమై, కన్నీళ్ల వానైంది.
నిశ్చితార్థం అయిన పెళ్లి పిల్లకు కాళ్లకు గజ్జెలు కట్టడం పూర్వీకుల ఆచారం. ఎందుకంటే తాండలో ఉన్న ప్రతిఒక్కరు అప్యాయతగా ఆమేతో మెలుగుతారని మరియు ఆమెకు నిశ్చితార్థం అయిందని గ్రహింస్తారని. పెళ్లికి నెలలకు ముందే తాండలోని ఆడపడుచులు ఒక చోట చేరి ప్రతి సాయంత్రం పెండ్లి పిల్లకు ఢావలో నేర్పుతారు.
గోర్ బోలిలో క్రింది నాల్గు వాక్యాలు ఢావలో రూపంలో.
ఏ...యా....కాళో...కుండే నీలో..భరో
ఒయి కుండేమ నానీ మోటి మాచళి రమ యా...డి...య! అ..హ్య..
ఏ..యా..ఒయి మాచళి..ప భోయి జాళ ఫేకరో యాడియ! అ...హ్య..
ఏ...యా...ఒయి జాళేమా..నానీ.. మోటి ..మాచేళి ఫందాగి యాడియ! అ...హ్య..
అర్దం: ఓ..అమ్మల్లారా! ఒక స్వచ్చమైన నీటికుంటలో చిన్న పెద్ద చేపలు ఆనందగా ఆడుకుంటున్న వేళ ఒక భోయవాడు గాలమేసి చెపపిల్లను లాగుతున్నాడే అమ్మల్లారా.... అంటూ పెండ్లి కోడుకుని భోయవాడిగా, తననుతాను చేపపిల్లగా వర్ణిస్తూ ఎడుస్తుంది పెళ్లి పిల్ల. పైవిధంగా అనేక ఢావ్లో గీతాలు నెర్చుకుంటుంది పెళ్లి పిల్ల.
2. మళెరో•••••••
ఒకరికి ఒక్కరు కలిసి నప్పుడు మెడ పట్టుకొని ఎడవడమే మళెరో. ఇద్దరు స్త్రీలే అయితే సమాధానాలు వర్ణించుకుంటూ ఖుషల ప్రశ్నలెస్తూ ఏడుస్తారు. ఇద్దరిలో ఒకరు మగవారైతే స్త్రీ మాత్రమే అతనిని పోగుడుతు తనబాధను వర్ణిస్తూ ఢావలో గానం చేస్తూ ఏడుస్తుంది. పూర్వము సంచారజీవులుగా, సంచార వ్యపారులుగా దూర ప్రాంతాలకు సంవత్సరాల కొద్ది గడపవలసి వచ్చేది. వీరి కులగురువులైన భట్రాజులు గాన గాంధర్వులైన వీరు ప్రతి తాండకు సందర్శించెవారు. వీరు దూర దూర ప్రాంతాల నుండి పెళ్లి పరిచయాలు తెచ్చెవారు. కుటుంబాలను వారి వంశాలను పుట్టుపూర్వోత్తరాలను పరిశీలించి తగిన ఇడుజొడుతో సంబంధాలు సమకూర్చేవారు. వీరి నిర్ణయాలకు వీరి మాటలకు ఏవరు జవదాటేవారుకాదు. ఐతే పెళ్లిలు అయిపోయి వెళ్ళిపోయిన బంధువులు చాలా రోజుల తర్వాత కలిసేవారు. అందులో కోందరు అటవి మృగాల బారినపడి మృత్యు చెందెవారట. చాలా కాలం తర్వాత కలిసి నప్పుడు పాత జ్ఞపకాలను లేదా కొంత మంది మరణించిన వారిని స్మరించుకుంటూ వచ్చిన బంధువును ఆప్యాయతగా మెడను పట్టుకొని ఏడుస్తారు బంజార స్త్రీలు. దీనినే మళెరో అని అంటారు. అసలు మళెరో అనే పదానికి అర్దం అనుకోకుండ దొరకటం లేదా కలిసి రావటం అని అర్దం. మళజన రో (కలిసినప్పుడు ఏడుపు) అనే పదమే మళెరో గా మారిందంటారు. అన్న లేదా తమ్ముడిలో నవ వధువు మళెరో గోర్ బోలిలో నాల్గు వాక్యాలు క్రిందివిధంగా ఉంటుంది.
వీరేణ.. కేళా కేళీ..రో ఝుండ క..సో ఒసో జుండ్ వెతో అపణో
ఒ ఝుండె మాయితి మన టాళనాకే వీరావో అ..హ్య..
వీరేణ.. తారెహతేమ సోనేరి ఘడి, పణ
మారే హతెమ పరదేశి పత్యారి హత్కడి ఘాలదేన హూబర్గే వీరావో! అ..హ్య..
అర్దం:
ఒ వీరులైన అన్నల్లారా......ఒకే ఆరటిగేలలో ఉన్న ఆరటి కాయలం మనమందరం కానీ మీనుండి (గేలనుండి) నన్ను విడదీస్తున్నారేమిటి అన్నల్లారా.....
ఒ వీరులాంటి తమ్ములారా....మీ చేతికున్న వాచిలాగా నా చేతికి బెడిలువేసి పరదేశపు బాటసారికి నన్ను బలవంతగా పట్టించి నిలబడి చుస్తున్నారా......అంటూ ఏడుస్తుంది. నవ వధువు ఇలాంటి ఎన్నో దుఃఖ భరిత భావాలను ఆలాపిస్తు అన్నతమ్ములను కౌగిలించుకొని మెడపట్టుకొని ఢావలో తో మళెరో చేస్తుంది బంజార స్త్రీ.
3.హవేలి••••••
నవ వధువు పుట్టింటి నుండి మెట్టింటి సాగడంపునప్పుడు తాంగ్డి (ఒక గొనె సంచి పుట్టింటివారు ఇచ్చెకానుకలతో నిండినది) వధువును అప్పగింతల వేళ ఎద్దుపై నిల్చోబెడ్తారు ఆ సమయంలో నవ వధువు ఎడుస్తూ పాడే అప్పగింతల శ్లోకాలే హవేలి అని అంటారు. అసలు హవేలి అంటే రాజస్థాన్ పదం. దీని అర్దం రాజ భవనం లేదా మాహల్ అని అంటారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో మడగి అని కూడా అంటున్నారు. ఐతే బంజారాలకు రాజస్థాన్ మాతృభూమి. ఇక్కడి నుండే బంజారాలు సంచార జీవులుగ వ్యాపారులుగా దేశమొత్తంలో విస్తరించారనే భావన ఉంది. అందుకే నవ వధువు హవేలి అనే పదాన్ని ఆ కాలంలో ఉపయోగించి తండ్రి యొక్క హవేలి నుండి వెళ్ళిపోతున్నాను అంటూ హవేలికి సంబందించిన శ్లోకాలు పాడుతు ఏడుస్తుంది అప్పగింతల సమయంలో. మన ప్రాంతంలో ఈ కార్యము ఇప్పుడులేదు. పూర్వీకులు కనివినియెరుగని రీతిలో ఘనంగా సాంప్రదాయ బద్దంగ ముచ్చటపడి మూడురోజుల పెళ్లి జరిపెవారట. ఇందులో చివరి రోజు చివరి ఘట్టం ఇది. ఇప్పటికి ఇతర రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో హవేలి కార్యము నేటికి ఉంది. కానీ మన ప్రాంతంలో దీని పాటలు నేటికి పాడుతున్నారు.
4.వడావ్••••••
ఏదైన భారీ నష్టాలు లేదా సంఘటనలు జరిగినప్పుడు ఎకధాటిగా క్రోదంతో ఎడవడం వడావ్ అంటారు లేదా వడావ్ కరన్ రోరి అని అంటారు. ఈ వడావ్ చాలా దుఃఖాన్ని కల్గిస్తుంది. చాలా దుఃఖ భరితమైనది. భర్తను కోల్పోయిన స్త్రీ , లేదా దూర ప్రదేశప్రయాణ సమయం లేదా ప్రమాదాలు జగినప్పుడు లేదా భరించరాని అన్యాయాలు జరిగినప్పుడు మొదలగు సమయాలలో గోడు గోడున ఏడుస్తుంది బంజార స్త్రీ. దీనినే వడావ్ అంటారు. ఇవన్ని ఢావ్లోతోనే ముడిపడి ఉంటాయి.
ముగింపు
నేడు పూర్వవైభవం ఎక్కడుంది. ఆ రోజుల్లో అనేక సమస్యలున్న కరువు కాటకాలు ఎన్ని ఉన్న అన్ని రకాల కార్యక్రమాలు తాండ సమిష్ఠితో జరిగేవి. ఉన్న చిన్నపెద్దలందురు పంచిన బాధ్యతనునిర్వహించి పండుగ మాధుర్యాన్ని పోంది ఆనంద పడేవారు. ప్రతి నక్త (కార్యం) సాంప్రదాయ పద్దతుల్లో జరిగేవి. ఒక ఇంట్లో కార్యముంటే ఆ తాండ ప్రతి ఇంట పండుగ వాతావరణం నెలకొనేది.. పాడుకునే పాటలు మనసును అహ్లాదాని కలిగించి గుండెల నిండ ఆనందం ఉప్పోంగేది. పెళ్లిలో పండుగల్లో చేసే సంబురాలు హడావిడిలగోల అంత ఇంత కాదు. వడ్డింపులు వాదింపులకు ప్రతిఒక్కరి భాగస్వామ్యం ఉండేది. కానీ ఇప్పుడు డిజే పాటలకు మందు మత్తులో చిందులేస్తున్నారు. ఇతరుల పోకడలకు బలై సంస్కృతిని పూర్తిగా మరిచిపోయారు. ఇదే కోనసాగుతే ఇక ముందు వచ్చేతరానికి చేప్పుకోవటానికి కథలు తప్ప చూపించడానికి ఏమి మిగలదు.
శ్రీ మాత్రే నమః జై సేవాలాల్
-- మురళీ,
ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లామ,
9492539553.
ప్రక్రియ : వ్యాసం.