నీకెక్కడొచ్చిందిరా స్వాతంత్ర్యం?---- కొత్తపల్లి రవి కుమార్ రాజమహేంద్రవరం

నీకెక్కడొచ్చిందిరా స్వాతంత్ర్యం?---- కొత్తపల్లి రవి కుమార్ రాజమహేంద్రవరం

నీకెక్కడొచ్చిందిరా స్వాతంత్ర్యం?

ఇన్నేళ్ళైనా మన గురుకులాలలో చదువుల గంట మోగలేదు,
నేటికీ ఆ తెల్లోడు తెచ్చిన కాన్వెంట్లలోనే మగ్గుతోంది మన చదువు ,
నీకెక్కడొచ్చిందిరా స్వాతంత్ర్యం, తెల్లోడిదే ఇప్పటికీ రాజ్యం!

ఇన్నాళ్ళైనా మనం కనిపెట్టిన ఆయుర్వేదం మీద కలగలేదు నమ్మకం,
నేటికీ ఆ తెల్లోడు చేసిన అల్లోపతి వైద్యమే అన్ని రోగాలకు శరణ్యం,
నీకెక్కడొచ్చిందిరా స్వాతంత్ర్యం, తెల్లోడిదే ఇప్పటికీ రాజ్యం!

ఇన్నేళ్ళైనా మన ప్రాచీన భాష సంస్కృతానికి కట్టలేదు పట్టం,
నేటికీ ఆ తెల్లోడు నేర్పిన ఆంగ్ల భాషే అన్నిటినీ నడిపించే పెద్ద చుట్టం,
నీకెక్కడొచ్చిందిరా స్వాతంత్ర్యం, తెల్లోడిదే ఇప్పటికీ రాజ్యం!

ఇన్నేళ్ళైనా మన జాతీయ క్రీడ హాకీ కి దక్కలేదు సింహాసనం,
నేటికీ ఆ తెల్లోడు ఆడించిన క్రికెట్ కే యువత మొత్తం దాసోహం,
నీకెక్కడొచ్చిందిరా స్వాతంత్ర్యం, తెల్లోడిదే ఇప్పటికీ రాజ్యం!

ఇన్నేళ్ళైనా మన సాంప్రదాయ దుస్తులను తొడగడానికి నామోషీ,
నేటికీ ఆ తెల్లోడు తొడిగిన జీన్స్ వ్యామోహంలో పడిన నల్ల మనిషి,
నీకెక్కడొచ్చిందిరా స్వాతంత్ర్యం, తెల్లోడిదే ఇప్పటికీ రాజ్యం!

ఇన్నేళ్ళైనా మన ఇతిహాసాల సారాంశాలను నేర్వలేదు ఈ బతుకులు,
నేటికీ ఆ తెల్లోడు ఇచ్చిన ఫేస్ బుక్ తోనే మమేకమయ్యాయి మన జీవితాలు,
నీకెక్కడొచ్చిందిరా స్వాతంత్ర్యం, తెల్లోడిదే ఇప్పటికీ రాజ్యం!

ఇన్నేళ్ళైనా మన దేశ పండగలని జరుపుకోము ఉత్సాహంగా,
నేటికీ ఆ తెల్లోడు అందించిన హ్యాపీ న్యూ ఇయరే పెద్ద పండుగ,
నీకెక్కడొచ్చిందిరా స్వాతంత్ర్యం, తెల్లోడిదే ఇప్పటికీ రాజ్యం!

ఇన్నేళ్ళైనా మన భారతదేశ సంస్కృతీ సాంప్రదాయాలకు ఇవ్వము విలువ,
నేటికీ ఆ తెల్లోడు అలవాటు చేసిన అలవాట్లకు అయిపోయాము ఏ ప్రాణం లేని శిలువ,
నీకెక్కడొచ్చిందిరా స్వాతంత్ర్యం, తెల్లోడిదే ఇప్పటికీ రాజ్యం!

---- కొత్తపల్లి రవి కుమార్
           రాజమహేంద్రవరం
              9491804844

0/Post a Comment/Comments