తెలుగు భాష వైభవం
**********************
ఆట వెలదులు
**********************
కవనరంగమందు కవి తనప్రతిభతో
కవితలల్లినట్టి కావ్య భాష
దేశ భాషలందు తెలుగేను మిన్ననీ
పేరు బడసెచూడు పేర్మి తోడ!!
అష్టదిగ్గజాల నలరునట్లుగజేసి
పసిడిరచనలొదిగె ప్రౌఢరీతి
తిక్కనాది కవులు తేజస్సు సమకూర్చి
వెలుగు,జిలుగులద్ద వెలుగె భాష!!
చదువుచున్న మదికి చల్లదనమునిచ్చి
స్వాoతనమును గూర్చు సరసభాష
మంచిగంధమునను మననుముంచినయట్లు
నిండు పరిమళముల నిచ్చు భాష!!
కవుల కలములందు కమనీయశోభతో
ప్రజ్వరిల్లె నిదియు ప్రస్ఫుటముగ
తేనెవంటి రుచిని తెలుగువారికిపంచి
అమ్మ భాష గాను నమర మయ్యె!!
తెలుగు పలుకు లెపుడు తేనెలూరుచునుండు
మధువువోలె మనకు మత్తునిచ్చు
మనుజులంత దీన్ని మరువక గ్రోలుడీ
నిత్య జీవ నమున నిండుగాను!!
......✍️మణికర్ణిక🌹☘️
వడ్ల.నర్సింహా చారి, వికారాబాద్,
చరవాణి:8500296119