ఓ అష్టమీ నీదెంత అదృష్టం --డా విడి రాజగోపాల్

ఓ అష్టమీ నీదెంత అదృష్టం --డా విడి రాజగోపాల్



ఓ అష్టమీ నీదెంత అదృష్టం

అష్టమి అరిష్టం అంటారు
కాదు  కాదు కానే కాదు
అంటూ అష్టమినే
ఇష్టంగా ఎంచుకున్నాడు
మన నల్లనయ్య
దేవకీ నందుల అష్టమ పుత్రుడై
అవతరించాడు

అమ్మ పాలకు నోచుకోలేదు
యశోదమ్మ వడిచేరాడు
అల్లరి వాడని వెన్నదొంగని
చిన్నతనపు చిలిపిచేష్టలతో
ఎన్నో లీలలు చేశాడు

మన్నుతిన్నావేంటి కృష్ణయ్యా
ఏది నోరు తెరవమంటే
యశోదమ్మకు అనంత విశ్వాన్నే చూపాడు

విషపు పాలతో తన్ను సంహరించ వచ్చిన
మాయావిని మట్టుబెట్టాడు
కాళింది మడుగులో  విషం జిమ్మే నాగుపడగపై నాట్యం చేశాడు

మురళీ గాన మాధుర్యముచే
గోపికలమనసు దోచాడు
చిటికనవేలు పై గోవర్ధన గిరినెత్తి
ఇంద్రుని గర్వం అణిచాడు

పాండవుల బాసట నిలచి
దుర్మార్గులను తుద ముట్టించాడు
అర్జునునికి గీతోపదేశం చేసి  కార్యోన్ముఖున్ని చేశాడు
ద్రౌపది మానరక్షణచే సోదర ప్రేమకు ఆదర్శవంతుడయ్యాడు
భక్తులను ముక్తిచే మురిపించాడు  దుష్టులను యుక్తిచే శిక్షించాడు
అష్టభామలతో శృంగార పురుషుడని పించుకున్నాడు
రాధామాధవుల ప్రేమే పవిత్రమని చాటాడు

సత్యభామ అలకతీర్చ పాదాభిషేకం చేశాడు
రుక్మిణి భక్తిచే వేసిన ఓ తులసిరెమ్మకు వశమయ్యాడు
ఐశ్వర్యంతో తనను తూల్చలేరని నిరూపించాడు

కుచేలుని పై ప్రేమకురిపించి స్నేహమంటే ఏమిటో చెప్పాడు

సుదర్శన చక్రంచే సూర్యగమనాన్ని శాసించాడు
అర్జునుని ఆత్మాహుతి నుండి రక్షించాడు

అడుగడుగునా పాండవులకు బాసటగా నిలిచాడు
ధర్మం వైపే తన గమ్యమని నిరూపించాడు

పుట్టింది కారాగారంలో
గిట్టింది  ఓ నిర్జీవమైన అడవిలో

అరచకాలు పెరిగినప్పుడు అవతరిస్తాడంటారు
ఆ సమయం సమీపంలో ఉందేమో
ఆ అష్టమి ఎప్పుడొస్తుందో కదా!

--డా విడి రాజగోపాల్

 

0/Post a Comment/Comments